iDreamPost
android-app
ios-app

ఇది బ్యాటింగ్ కాదు.. అంతకు మించి! క్లాసెన్ బీభత్సం.. ఆసీస్ బౌలర్లకు పీడకల

  • Author Soma Sekhar Published - 09:27 PM, Fri - 15 September 23
  • Author Soma Sekhar Published - 09:27 PM, Fri - 15 September 23
ఇది బ్యాటింగ్ కాదు.. అంతకు మించి! క్లాసెన్ బీభత్సం.. ఆసీస్ బౌలర్లకు పీడకల

అతడు 5వ నంబర్ లో బ్యాటింగ్ వచ్చాడు. అప్పటికే ఇన్నింగ్స్ లో 32 ఓవర్లు ముగిశాయి. అప్పుడు ఆ ఆటగాడి స్కోర్ 25 బంతుల్లో 24. దీంతో అతడు మహా అయితే 90 పరుగులో లేక 100 పరుగులో చేస్తాడని అందరూ అనుకుని ఉంటారు. కానీ అతడు చెలరేగిన విధానం మాటలకందనిది.. ఊహకు సైతం అందనిదనే చెప్పాలి. అతడు మైదానంలో ఫోర్లు, సిక్సర్లతో పెద్ద సునామీనే సృష్టించాడు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ.. ఈరోజు ఆసీస్ బౌలర్లకు పీడకలగా మార్చాడు సౌతాఫ్రికా బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్. అతడి ధాటికి ఆసీస్ బౌలర్లు దారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. క్లాసెన్ సునామీ ఇన్నింగ్స్ తో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 416 పరుగుల రికార్డు స్కోర్ సాధించింది.

సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగో వన్డేలో రికార్డు స్కోర్ నమోదైంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 416 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ప్రోటీస్ జట్టు రికార్డు స్కోర్ సాధించడానికి ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. అతడి అసాధారణ బ్యాటింగ్ కు డేవిడ్ మిల్లర్ తుపాన్ ఇన్నింగ్స్ తోడవ్వడంతో.. ఈ స్కోర్ సాధించింది. ఇక ఈ మ్యాచ్ ను వన్ మ్యాన్ షోగా మార్చాడు క్లాసెన్. 25 బంతుల్లో 24 పరుగులతో ఉన్న క్లాసెన్ అవుటైయ్యే సరికి కేవలం 83 బంతుల్లో 13 ఫోర్లు, 13 సిక్స్ లతో 174 పరుగులు చేశాడు.

ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే? అతడు 32 ఓవర్లు పూర్తి అయ్యేసరికి 24 పరుగులతో ఉండి.. మిగతా 18 ఓవర్లలోనే ఒక్కడే 150 పరుగులు చేశాడంటే అతడి విజృంభన ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. క్లాసెన్ బాదుడు దాటికి బలైయ్యాడు ఆసీస్ స్పిన్నర్ అడం జంపా. అతడు 10 ఓవర్లలో 113 పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. మిగతా బౌలర్లు అయిన హేజిల్ వుడ్, స్టోయినిస్, నాథన్ ఎల్లిస్ లు కూడా క్లాసెన్ బాధితులే. క్లాసెన్ వీరోచిత శతకంతో సౌతాఫ్రికా 416 పరుగుల రికార్డు స్కోర్ నమోదు చేసింది.

క్లాసెన్ తో పాటు వాండర్ డస్సెన్(62), మిల్లర్(82), డికాక్(45) పరుగులతో మెరిశారు. అనంతరం 417 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ కు మూడో ఓవర్లోనే షాకిచ్చాడు ఎంగిడి. డేవిడ్ వార్నర్(12), మిచెల్ మార్ష్(2)ను త్వరగా పెవిలియన్ కు చేర్చాడు ఎంగిడి. ప్రస్తుతం 5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసింది ఆసీస్. మరి క్లాసెన్ వీరోచిత శతకంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.