సునామీ ఇన్నింగ్స్‌ ఆడిన SRH బ్యాటర్‌ క్లాసెన్‌! MLCలో తొలి సెంచరీ

అమెరికాలో జరుగుతున్న మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ 2023 టోర్నీలో సంచలనం నమోదైంది. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరపున ఆడే సౌతాఫ్రికా ఆటగాడు హెన్రిచ్‌ క్లాసెన్‌ సునామీ ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు. ఏకంగా సెంచరీతో చెలరేగాడు. అది కూడా అతి తక్కువ బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. క్లాసెన్‌ విధ్వంసం ముందు ప్రపంచ అత్యుత్తమ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ కూడా నిలువలేకపోయాడు. రషీద్‌ ఖాన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌లోనైతే క్లాసెస్‌ విలయతాండవం చేశాడు. రషీద్‌ను చీల్చిచెండాడుతూ ఏకంగా మూడు సిక్సులతో రెచ్చిపోయి.. ఆ ఓవర్‌లో మొత్తం 26 పరుగులు పిండుకున్నాడు.

క్లాసెస్‌ ఇన్నింగ్స్‌లో మరో విశేషం ఏమిటంటే.. ఈ మ్యాచ్‌లో అతను పవర్‌ ప్లే చివరి ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ సాధించాడు. సాధారణంగా టీ20ల్లో ఓపెనర్లే ఎక్కువగా సెంచరీలు చేస్తుంటారు. ఎందుకంటే పవర్‌ ప్లేలో పరుగులు చేసే అవకాశం ఎక్కువగా అలాగే ఎక్కువ బంతులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కానీ క్లాసెన్‌ బ్యాటింగ్‌కు వచ్చే సమయానికి పవర్‌ప్లే చివరి ఓవర్‌కు చేరుకుంది. అయినా కూడా సంచలన ఇన్నింగ్స్‌ ఆడి 9 ఫోర్లు, 7 సిక్సులతో విరుచుకుపడి కేవలం 41 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. మొత్తం మీద 44 బంతుల్లో 110 పరుగులు చేసి అజేయంగా నిలిచి తన టీమ్‌ సీటెల్ ఓర్కాస్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. క్లాసెన్‌కు ఓపెనర్‌ నౌమన్‌ అన్వర్‌ 30 బంతుల్లో 51 పరుగులు చేసి సపోర్ట్‌గా నిలిచాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసి ఎంఐ న్యూయార్క్‌ నిర్ణీత 20 ఓవర్లలో 194 పరుగులు చేసింది. నికోలస్‌ పూరన్‌ 68, కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌ 34 పరుగులతో రాణించారు. సీటెల్‌ బౌలర్లలో ఇమద్‌ వసీమ్‌ 2, హర్మీత్‌ సింగ్‌ 2 వికెట్లు తీసుకున్నారు. ఇక భారీ లక్ష్యఛేదనకు దిగిన సీటెల్‌ టీమ్‌ను రషీద్‌ ఆరంభంలోనే ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ను అవుట్‌ చేసి దెబ్బతీశాడు. ఆ వెంటనే జయసూర్యను డకౌట్‌ చేసి చావుదెబ్బకొట్టాడు. కానీ, క్లాసెన్‌ వచ్చిన తర్వాత సీన్‌ పూర్తిగా మారిపోయింది. రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌ కూడా క్లాసెన్‌ ఉపేక్షించలేదు. ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డాడు. దీంతో 19.2 ఓవర్లలో మరో నాలుగు బంతులు ఉండగానే సీటెల్‌ విజయం సాధించింది. ఎంఐ బౌలర్లలో ట్రెంట్‌ బౌల్ట్‌ 4, రషీద్‌ ఖాన్‌ 2 వికెట్లతో రాణించినా ఫలితం లేకుండా పోయింది. మరి ఈ మ్యాచ్‌లో క్లాసెన్‌ విధ్వంసంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: జహీర్‌ ఖాన్‌-కోహ్లీ గురించి సంచలన విషయం బయటపెట్టిన ఇషాంత్‌ శర్మ

Show comments