భారత్ వేదికగా జరగనున్న 2023 వన్డే ప్రపంచ కప్ కు మరికొన్ని రోజుల్లో తెరలేవనుంది. ఇప్పటికే కౌంట్ డౌన్ మెుదలైంది కూడా.. మరో 46 రోజుల్లో ఈ విశ్వసమరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఐసీసీకి, బీసీసీఐకి మరో తలనొప్పి వచ్చిపడినట్లు తెలుస్తోంది. కొత్తగా ప్రకటించిన వరల్డ్ కప్ మార్పులు చేయాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) బీసీసీఐను అభ్యర్థించినట్లు వార్తలు వైరల్ గా మారాయి. దీంతో మరోసారి వరల్డ్ కప్ షెడ్యూలో లో మార్పులు జరగనున్నాయా? అన్న సందేహాలు తెరపైకి వస్తున్నాయి. మరి ఇంతకీ షెడ్యూల్ మార్చాలని హెచ్ సీఏ ఎందుకు కోరిందో ఇప్పుడు తెలుసుకుందాం.
వరల్డ్ కప్ 2023 టోర్నీకి ఒకదాని తర్వాత మరోటి అడ్డంకులు ఎదురౌతున్నాయి. ఇప్పటికే గుజరాత్ క్రికెట్ అసోసియేషన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అభ్యర్థనల మేరకు ముందుగా ప్రకటించిన వరల్డ్ కప్ షెడ్యూల్ ను మార్చింది. కొద్ది మార్పులు చేసి రీ షెడ్యూల్ ను ప్రకటించింది ఐసీసీ. అదీకాక కొత్త షెడ్యూల్ ప్రకారం మరో వారం రోజుల్లో టికెట్లు కూడా విక్రయించడానికి బీసీసీఐ సిద్దమైంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐతో పాటుగా ఐసీసీకి షాకిచ్చినట్లుగా సమాచారం.
కాగా ఐసీసీ ప్రకటించిన కొత్త షెడ్యూల్ ప్రకారం.. హైదరాబాద్ వేదికగా అక్టోబర్ 9న నెదర్లాండ్స్-న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఆ వెంటనే అక్టోబర్ 10న పాక్-శ్రీలంక మ్యాచ్ జరగనుంది. దీంతో వరుసగా రెండు మ్యాచ్ లకు భద్రత కల్పించడం కష్టం అవుతుందని హైదరాబాద్ పోలీసులు హెచ్ సీఏకు తెలిపినట్లు సమాచారం. దీంతో పోలీసుల అభ్యర్థనను పరిగణంలోకి తీసుకుందట హెచ్ సీఏ. ఇదే విషయంపై బీసీసీఐకు లేఖ రాసినట్లుగా సమాచారం. అయితే వాస్తవానికి పాక్-శ్రీలంక మ్యాచ్ అక్టోబర్ 12న జరగాల్సి ఉంది. కానీ ఐసీసీ రీ షెడ్యూల్ కారణంగా ఆ మ్యాచ్ రెండు రోజుల ముందుకు జరిగింది. దీంతో మూడు క్రికెట్ బోర్డులకు తలనొప్పి వచ్చింది. మరి హెచ్ సీఏ రిక్వెస్ట్ పై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి. అయితే ఈ వార్తలపై హెచ్ సీఏ అధికారికంగా ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు.
ఇదికూడా చదవండి: ఇలాంటి క్యాచ్ మీరెప్పుడూ చూసుండరు! వైరల్ వీడియో..