iDreamPost
android-app
ios-app

క్రికెట్​లో మోస్ట్ కాంట్రవర్షియల్ మ్యాచ్.. సచిన్​ను కోర్టుకు లాగిన ఘటన! ఏంటీ మంకీగేట్?

  • Published Sep 25, 2024 | 8:13 PM Updated Updated Sep 27, 2024 | 4:51 PM

Sachin Tendulkar, Harbhajan Singh, Andrew Symonds: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఘనతల గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. బ్యాటర్​గా ఎవరూ బ్రేక్ చేయలేని ఎన్నో రికార్డులను అతడు క్రియేట్ చేశాడు. 22 గజాల పిచ్​పై 24 ఏళ్ల పాటు తన బ్యాట్​తో హవా నడిపించాడు. ఎన్నడూ వివాదాల బారిన పడలేదు. అలాంటోడు ఓ ఘటన కారణంగా కోర్టు మెట్లు ఎక్కాడు.

Sachin Tendulkar, Harbhajan Singh, Andrew Symonds: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఘనతల గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. బ్యాటర్​గా ఎవరూ బ్రేక్ చేయలేని ఎన్నో రికార్డులను అతడు క్రియేట్ చేశాడు. 22 గజాల పిచ్​పై 24 ఏళ్ల పాటు తన బ్యాట్​తో హవా నడిపించాడు. ఎన్నడూ వివాదాల బారిన పడలేదు. అలాంటోడు ఓ ఘటన కారణంగా కోర్టు మెట్లు ఎక్కాడు.

  • Published Sep 25, 2024 | 8:13 PMUpdated Sep 27, 2024 | 4:51 PM
క్రికెట్​లో మోస్ట్ కాంట్రవర్షియల్ మ్యాచ్.. సచిన్​ను కోర్టుకు లాగిన ఘటన! ఏంటీ మంకీగేట్?

క్రికెట్​ ఫీల్డ్​లో గొడవలు కొత్తేమీ కాదు. హై-ఇంటెన్స్ మ్యాచుల్లో ఆటగాళ్ల మధ్య ఘర్షణలు జరగడం కామన్. తిట్టుకోవడాలు, ఒకరిపై ఒకరు దూసుకెళ్లడాలు, రెచ్చగొట్టుకోవడాలు చూస్తూనే ఉంటాం. ఇది పార్ట్ ఆఫ్ గేమ్​గా మారిపోయింది. ఇలాంటి వివాదాల్లో ఇరుక్కున్న ప్లేయర్లు బ్యాడ్ ఇమేజ్​తో కెరీర్​లో అనవసర మచ్చ తెచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. క్రికెట్​లో ఎన్ని వివాదాలు ఉన్నా.. మోస్ట్ కాంట్రవర్షియల్ మ్యాచ్ అంటే మాత్రం ఠక్కున గుర్తుకొచ్చేది సిడ్నీ టెస్టే. 2008లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఈ మ్యాచ్​ను క్రికెట్ వరల్డ్ ఎప్పటికీ మర్చిపోదు. ‘మంకీగేట్’ వివాదం జరిగింది ఈ మ్యాచ్​లోనే. సుదీర్ఘ కెరీర్​లో ఒక్క రీమార్క్ కూడా లేని బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్​ను కోర్టుకు లాగిన ఘటన ఇదే మ్యాచ్​లో చోటుచేసుకుంది. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుందాం..

2008లో నాలుగు టెస్టుల సిరీస్ కోసం ఆస్ట్రేలియా టూర్​కు వెళ్లింది టీమిండియా. అయితే మొదటి టెస్ట్​లోనే భారత్​కు గట్టి షాక్ తగిలింది. ఏకంగా 337 పరుగుల భారీ తేడాతో కంగారూల చేతుల్లో ఓడిపోయింది మెన్ ఇన్ బ్లూ. దీంతో రెండో టెస్ట్​లో ఆసీస్​ను మట్టికరిపిద్దామనుకుంటే చెత్త అంపైరింగ్ మన జట్టుకు శాపంగా మారింది. అయినా భారత ఆటగాళ్లు పట్టుదలతో ఆడారు. ఎలాగైనా గెలవాలనే కసితో ఆడారు. సిడ్నీ టెస్ట్ తొలి ఇన్నింగ్స్​లో కంగారూ టీమ్ 463 రన్స్​ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన కుంబ్లే సేన ఒక దశలో 116 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 451 పరుగులతో పటిష్టంగా ఉంది. అప్పటికే సెంచరీ కంప్లీట్ చేసి మంచి ఊపు మీదున్నాడు సచిన్ టెండూల్కర్. ఆ దశలో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. టర్బనేటర్ హర్భజన్ సింగ్, ఆసీస్ ఆల్​రౌండర్ ఆండ్రూ సైమండ్స్ మధ్య జరిగిన వాదులాట కాస్తా బిగ్ కాంట్రవర్సీగా మారి క్రికెట్ వరల్డ్​ను ఊపేసింది.

టీమిండియా బాగా ఆడుతుండటం, సచిన్ ఎంతకీ ఔట్ కాకపోవడంతో ఆస్ట్రేలియా జట్టు టెన్షన్ పడసాగింది. ఈ తరుణంలో భజ్జీ దగ్గరకు వచ్చిన సైమండ్స్ ఏదో అన్నాడు. హర్భజన్ కూడా వెనక్కి తగ్గలేదు. ఆల్​రౌండర్​కు ఇచ్చిపడేశాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి అది కాస్తా జాతి వివక్ష వివాదంగా మారింది. ఆ టైమ్​లో భజ్జీతో పాటు మరో ఎండ్​లో ఉన్న సచిన్ గొడవ చూసి వెంటనే హర్భజన్​ను ఆపేందుకు ప్రయత్నించాడు. సైమండ్స్​కు కూడా సర్దిచెప్పాలని చూశాడు. అయితే ఆసీస్ టీమ్ ఆ ఫైట్​ను అక్కడితో వదిలేయలేదు. ఆ తర్వాత కంగారూ కెప్టెన్ రికీ పాంటింగ్ వచ్చి భజ్జీని గెలికాడు. సైమండ్స్​ను ఏం అన్నావని అడిగాడు. మాథ్యూ హేడెన్ కూడా జోక్యం చేసుకున్నాడు. సైమండ్స్​పై రేసియల్ కామెంట్స్ చేశావని అన్నాడు. ఈ మొత్తం ఉదంతాన్ని సచిన్ కళ్లారా చూశాడు. భజ్జీ తప్పు చేయలేదని నమ్మి ఆఖరి వరకు అతడికి సపోర్ట్​గా నిలబడ్డాడు.

సిడ్నీ టెస్ట్ ముగిసిన తర్వాత హర్భజన్​పై అంపైర్లకు కంప్లయింట్ చేసింది ఆసీస్ టీమ్. సైమండ్స్​ను అతడు మంకీ అని సంబోధించాడని, ఇది జాతి వివక్ష అంటూ ఫిర్యాదు చేసింది. తమ ప్లేయర్​ను అవమానించారంటూ కోపంతో ఊగిపోయిందా టీమ్. మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ ఘటనపై రిఫరీ మైక్ ప్రోక్టర్ 4 గంటల పాటు విచారణ జరిపాడు. ఈ ఇన్వెస్టిగేషన్​కు ఆసీస్ నుంచి సైమండ్స్​తో పాటు పాంటింగ్, క్లార్క్, హేడెన్ అటెండ్ అయ్యారు. భారత టీమ్ నుంచి సచిన్, భజ్జీ హాజరయ్యారు. విచారణ తర్వాత ప్రోక్టర్ తన డెసిషన్ చెప్పాడు. హర్భజన్ తప్పు చేశాడని, ఐసీసీ కోడ్ ఆఫ్​ కండక్ట్​లోని లెవల్ 3ను ఉల్లంఘించాడని తేల్చాడు. ఈ నేరం కింద అతడి మీద మూడు టెస్టుల పాటు బ్యాన్ విధిస్తున్నట్లు ప్రకటించాడు. దీన్ని భారత మేనేజ్​మెంట్ ఊహించలేదు.

భజ్జీపై బ్యాన్​ను భారత టీమ్ మేనేజ్​మెంట్ సీరియస్​గా తీసుకుంది. దీని మీద కోర్టులో అప్పీల్ చేసింది. కోర్టుకు వెళ్లే ముందు సిరీస్ నుంచి వైదొలుగుతామని ఆసీస్ బోర్డుకు వార్నింగ్ కూడా ఇచ్చింది. ఆ తర్వాత అడిలైడ్ ఫెడరల్ కోర్టులో ఈ కేసుపై అధికారిక విచారణ జరిగింది. ఇక్కడ కూడా సైమండ్స్​ తరఫున విట్నెస్​గా పాంటింగ్, హేడెన్, క్లార్క్ వచ్చారు. భజ్జీకి సాక్ష్యంగా సచిన్ అటెండ్ అయ్యాడు. భారత స్పిన్నర్ తప్పు చేయలేదని సచిన్ సాక్ష్యం చెప్పాడు. అతడికి అండగా నిలబడ్డాడు. ఈ కేసులో విచారణ తర్వాత హర్భజన్​ను నిర్దోషిగా ప్రకటించింది కోర్టు. అతడిపై విధించిన బ్యాన్​ను కూడా ఎత్తివేసింది. దానికి బదులు మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించారు. ఈ ఘటనలో తప్పు ఎవరిదనే ప్రశ్న ఇప్పటికీ క్రికెట్ లవర్స్​కు వస్తూ ఉంటుంది. అయితే సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఈ కేసును కోర్టు డిస్మిస్ చేసింది.

భజ్జీ నిజంగానే సైమండ్స్​పై జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడా అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. అప్పటి భారత జట్టు ప్లేయర్లు హర్భజన్ రేసియల్ కామెంట్స్ చేయలేదని అంటూ వచ్చారు. అటు ఆసీస్ ఆటగాళ్లు మాత్రం భజ్జీ తప్పు చేశాడని, కోర్టు తీర్పు మీద కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఐపీఎల్ జరగడంతో ఈ వివాదం సద్దుమణిగింది. కొన్నాళ్ల తర్వాత ముంబై ఇండియన్స్​కు కలసి ఆడుతూ సైమండ్స్-భజ్జీ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. అయితే కొన్ని ఇంటర్వ్యూలో ఆసీస్ ఆల్​రౌండర్ మాట్లాడుతూ.. హర్భజన్​ను తాను క్షమించలేదని, అతడు రేసియల్ కామెంట్స్ చేశాడని అన్నాడు. దురదృష్టవశాత్తూ రెండేళ్ల కింద సైమండ్స్ చనిపోయాడు. అయినా రెండు జట్ల మధ్య యుద్ధ వాతావరణం రాజేసిన ఈ మంకీగేట్ కాంట్రవర్సీని మాత్రం క్రికెట్ లవర్స్ ఇంకా మర్చిపోలేదు.