వరల్డ్ కప్ 2023.. మరికొన్ని రోజుల్లో ఈ విశ్వసమరానికి తెరలేవనుంది. దీంతో మాజీ క్రికెటర్లు, దిగ్గజాలు తమతమ అభిప్రాయాలను తెలియపరుస్తున్నారు. ఇక మరికొంత మంది ఆటగాళ్లు గత వరల్డ్ కప్స్ కు సంబంధించిన అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా 2011 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ సభ్యుడు అయిన గౌతమ్ గంభీర్ మరోసారి ధోనిపై సంచలన కామెంట్స్ చేశాడు. 2011 వరల్డ్ కప్ విన్నింగ్ క్రెడిట్ అంతా ధోని కొట్టేశాడని ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు గంభీర్. తాజాగా మరోసారి మిస్టర్ కూల్ పై రెచ్చిపోయాడు. ధోని ఒక్కడి వల్లే ఇండియాకు ప్రపంచ కప్ రాలేదని, ఎంతో మంది ఆటగాళ్లు రాణిస్తేనే వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
మహేంద్రసింగ్ ధోని-గౌతమ్ గంభీర్.. ఈ ఇద్దరి మధ్య ఎలాంటి గెట్టు తగాదాలు లేవు, పైగా ఇద్దరివి పక్కపక్క ఇల్లు కూడా కావు. కానీ వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే.. భగ్గు మన్నంత వైరం ఉన్నట్లు భావిస్తుంటారు అందరు. ఎక్కువగా టీమిండియా మాజీ క్రికెటర్,భాజాపా ఎంపీ గౌతమ్ గంభీర్.. ధోనిపై విమర్శలు గుప్పిస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. కాగా.. గంభీర్ చేసే కామెంట్స్ పై ధోని పెద్దగా రియాక్ట్ అయిన సందర్భాలు లేవనే చెప్పాలి. తాజాగా మరోసారి ధోనిపై హాట్ కామెంట్స్ చేశాడు గౌతమ్ గంభీర్.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గంభీర్ మాట్లాడుతూ..”మీరు అనుకుంటున్నట్లుగా ఏ ఒక్క ఆటగాడు కూడా టోర్నీని గెలవలేడు. అలాగే జరిగి ఉంటే.. ఇప్పటి వరకు జరిగిన అన్ని వరల్డ్ కప్ లను టీమిండియానే గెలుచుకుని ఉండేది. ఇక 2011 వరల్డ్ కప్ ఫైనల్లో నేను చేసిన 97 పరుగుల గురించి మాట్లాడకండి. కానీ యువరాజ్ సింగ్, సురేష్ రైనా, జహీర్ ఖాన్, మునాఫ్ పటేల్ లాంటి ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. అదీకాక ఈ వరల్డ్ కప్ లో సచిన్ రెండు సెంచరీలు బాదిన విషయం ఎంతమందికి గుర్తుంది?” అంటూ ప్రశ్నించాడు గంభీర్. అయితే వీటి గురించి ఎవరూ మాట్లాడరు గానీ.. ధోని కొట్టిన ఒక్క సిక్సర్ గురించే అందరు మాట్లాడుకుంటున్నారు, దానికి కారణం మీడియా, సోషల్ మీడియానే అని చెప్పుకొచ్చాడు గంభీర్. ధోని ఒక్కడి వల్లే ఇండియాకు వరల్డ్ కప్ రాలేదని కాస్త ఘాటుగానే ఈ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
కాగా.. గౌతమ్ గంభీర్ ఇలా ధోనిపై విమర్శలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో చాలా సార్లు 2011 వరల్డ్ కప్ విన్నింగ్ క్రెడిట్ ధోని ఒక్కడిదే కాదని బల్లగుద్ది మరి చెప్పుకొచ్చాడు. ఈ ఫైనల్ మ్యాచ్ లో గంభీర్ అమూల్యమైన 97 పరుగులు చేసి టీమిండియాకు వరల్డ్ కప్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. అటు యువరాజ్ సింగ్ సైతం తన ఆల్ రౌండ్ షోతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డును సొంతం చేసుకున్నాడు. మరి ధోనిపై గంభీర్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదికూడా చదవండి: ఉత్కంఠ మ్యాచ్ లో.. పాకిస్థాన్ కు చుక్కలు చూపించిన ఆఫ్ఘానిస్థాన్!