గౌతం గంభీర్.. క్రికెట్‌కు భారత్ అందించిన ఆణిముత్యాల్లో ఒకడు. టీమిండియాకు ఆడిన అత్యుత్తమ లెఫ్టాండర్ బ్యాటర్లలో గౌతీ ఒకడని నిస్సందేహంగా చెప్పొచ్చు. మూడు ఫార్మాట్లలోనూ భారత్‌కు అతడు అందించిన సేవలు అపూర్వం. టీ20, వన్డే వరల్డ్ కప్స్ గెలిచిన టీమిండియాలో అతడు కీలక సభ్యుడు. టెస్టుల్లోనూ జట్టులో ముఖ్య భూమిక పోషించాడు. సహచర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌తో కలసి ఎన్నో అద్భుతమైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. భారత జట్టులోని బ్యాటర్లు అందరూ విఫలమైన అనేక మ్యాచుల్లో గంభీర్ ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు.
టీ20 ప్రపంచ కప్-2007 ఫైనల్లో దాయాది పాకిస్థాన్‌పై 54 బంతుల్లో 75 రన్స్ చేసిన గంభీర్‌ను ఎవరూ మర్చిపోలేరు. అలాగే సొంతగడ్డపై శ్రీలంకతో వన్డే వరల్డ్ కప్-2011 ఫైనల్లో తీవ్రమైన ఒత్తిడిలోనూ 122 బంతులు ఎదుర్కొని విలువైన 97 రన్స్ చేశాడు. వరల్డ్ కప్స్ గెలవడంలో ఈ రెండు ఇన్నింగ్స్‌లు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి గంభీర్ ఒక మ్యాచ్‌లో మాత్రం ఒత్తిడిని అధిగమించలేకపోయాడట. కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా ఉన్న టైమ్‌లో 2014లో వరుసగా మూడుసార్లు డకౌట్ అయ్యాడు గౌతీ. దీంతో నాలుగో మ్యాచ్‌లో ఓపెనింగ్ చేయాలంటే అతడికి భయం వేసిందట.
ఐపీఎల్-2014లో కేకేఆర్ ఆడిన నాలుగో మ్యాచ్‌లో తనకు బదులుగా ఓపెనింగ్ చేయమని మనీశ్ పాండేను అడిగాడట గంభీర్. తనలో ఉన్న భయం, తీవ్ర ఒత్తిడి కారణంగానే మనీష్‌ను ప్రమోట్ చేశానని తాజాగా గౌతీ రివీల్ చేశాడు. ఈ పని చేసినందుకు ఇప్పటికీ తాను సిగ్గుపడుతున్నానని అన్నాడు. ఆ మ్యాచ్‌లో మనీశ్ డకౌట్‌గా వెనుదిరిగాడని.. తాను కూడా ఒక్క రన్‌కే ఔట్ అయ్యానని గంభీర్ గుర్తుచేసుకున్నాడు. మ్యాచ్ తర్వాత మనీశ్‌ను పిలిచి ఈ తప్పు ఇంకెప్పుడూ చేయనని చెప్పానని ఒక స్పోర్ట్స్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతీ పేర్కొన్నాడు. కాగా, ఐపీఎల్-2014లో గంభీర్ టీమ్ ఛాంపియన్‌గా నిలిచిన విషయం విదితమే.