iDreamPost
android-app
ios-app

ప్రపంచ రికార్డులు బద్దలుకొడుతున్న IPLపై తీవ్ర విమర్శలు! కారణం..?

  • Published Apr 27, 2024 | 8:10 AM Updated Updated Apr 27, 2024 | 8:10 AM

IPL 2024, BCCI: ఒక వైపు ఐపీఎల్‌లో ప్రపంచ రికార్డులు బద్దలు అవుతుంటే.. మరో వైపు క్రికెట్‌ అభిమానులు ఇదో చెత్త ఐపీఎల్‌ అంటూ విమర్శలు చేస్తున్నారు. మరి వారి విమర్శలకు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

IPL 2024, BCCI: ఒక వైపు ఐపీఎల్‌లో ప్రపంచ రికార్డులు బద్దలు అవుతుంటే.. మరో వైపు క్రికెట్‌ అభిమానులు ఇదో చెత్త ఐపీఎల్‌ అంటూ విమర్శలు చేస్తున్నారు. మరి వారి విమర్శలకు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Apr 27, 2024 | 8:10 AMUpdated Apr 27, 2024 | 8:10 AM
ప్రపంచ రికార్డులు బద్దలుకొడుతున్న IPLపై తీవ్ర విమర్శలు! కారణం..?

ఐపీఎల్‌ 2024ను పరుగుల వరద కాదు.. పరుగుల ఉప్పెన ముంచెత్తుతోంది. 20 ఓవర్లలో 200 రన్స్‌ చేయడం చాలా కామన్‌ అయిపోయింది. ఈ సీజన్‌లో నమోదు అయిన స్కోర్లు చూస్తే.. చాలా మంది క్రికెట్‌ అభిమానులు నమ్మలేకపోతున్నారు. 261, 262, 262, 266, 272, 277, 287… ఇలా గతంలో ఊహించని విధంగా అన్ని ఐపీఎల్‌ టీమ్స్‌ విధ్వంసం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కోల్‌కత్తా నైట్ రైడర్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, పంజాబ్‌ కింగ్స్‌ జట్లు అయితే.. 200 కొట్టడం అలవాటుగా మార్చుకుంటున్నాయి. ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్దేశించిన 288 పరుగుల టార్గెట్‌ను ఛేజ్‌ చేస్తూ.. ఆర్సీబీ 262 పరుగుల వరకు కొట్టేసింది. శుక్రవారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 262 పరుగుల టార్గెట్‌ను పంజాబ్‌ కింగ్స్‌ 18.4 ఓవర్లలోనే ఊదిపారేసింది.

ఈ బ్యాటింగ్‌ విధ్వంస చూసి.. క్రికెట్‌ అభిమానులు షాక్‌ అవుతుంటే, క్రికెట్‌ నిపుణులు, బౌలర్లు, కొంతమంది మాజీ క్రికెటర్లు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది నెటిజన్లు ఇదో చెత్త ఐపీఎల్‌ అంటూ సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. జీవం లేని ఫ్లాట్‌ పిచ్‌లను రూపొందించి, బౌండరీ లైన్స్‌ను దగ్గరగా పెట్టి, ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌ అంటూ అర్థంలేని రూల్స్‌ తెచ్చి.. బౌలర్లను బలి చేస్తున్నారని క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో లేని ఈ ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ను ఐపీఎల్‌లో ఎందుకు పెట్టారని, దీన్ని తీసేయాలని ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు బహిరంగంగానే విమర్శలు చేశారు. అలాగే ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో పిచ్‌లపై బాగా విమర్శలు వస్తున్నాయి.

కేవలం బ్యాటర్లను మాత్రమే దృష్టిలో ఉంచుకుని, బాల్‌ ఈజీగా బ్యాట్‌పైకి వచ్చేలా పిచ్‌లను హైవేలా తయారు చేస్తున్నారని, ఇది క్రికెట్‌ మనుగడకే ప్రమాదం అంటూ క్రికెట్‌ నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్‌ అనేది బ్యాటర్లు, బౌలర్లకు మధ్య జరిగి యుద్ధం అని, అంతే కానీ, కేవలం రెండు టీమ్స్‌లోని బ్యాటర్ల మధ్య జరిగే పోరు కాదని అంటున్నారు. ఐపీఎల్‌పై ఉన్న మరో విమర్శ ఏంటంటే.. బౌండరీ లైన్స్‌ చాలా దగ్గరగా ఉన్నాయని, ఈ విషయంపై టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ స్పందిస్తూ.. బౌండరీ లైన్స్‌ను మరో రెండు, మూడు మీటర్లు వెనక్కి జరిపినా నష్టం లేదని, మరీ దగ్గరగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. ఫ్లాట్‌ పిచ్‌లు, బౌండరీ లైన్‌ దగ్గరగా ఉండటం, ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌.. వీటి వల్లే ఇంత భారీ స్కోర్లు నమోదు అవుతున్నాయని క్రికెట్‌ అభిమానులు ఆరోపిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.