VIDEO: రన్నప్‌లో కిందపడిన బౌలర్‌ టవల్‌! బ్యాటర్‌ను నాటౌట్‌గా ప్రకటించిన అంపైర్‌

సాధారణంగా క్రికెట్‌లో చాలా రకాలుగా బ్యాటర్లు అవుట్‌ అవుతూ ఉంటారు. బౌల్డ్‌, క్యాచ్‌ అవుట్‌, రనౌట్‌.. కొన్ని రేర్‌ సందర్భాల్లో హిట్‌ వికెట్‌ కూడా అవుతుంటారు. అయితే.. బ్యాటర్‌ బౌల్డ్‌, క్యాచ్‌ అవుటైన సందర్భాల్లో ఆ బాల్‌ నో బాల్‌ అయిఉంటే.. బ్యాటర్‌ను అంపైర్లు నాటౌట్‌గా ప్రకటిస్తారు. కానీ, తాజాగా ఓ మ్యాచ్‌లో నో బాల్‌ కాకపోయినా.. క్యాచ్‌ అవుటైన బ్యాటర్‌ను నాటౌట్‌గా ప్రకటించారు అంపైర్లు. ఈ విచిత్ర సంఘటన ఆస్ట్రేలియాలో జరుగుతున్న డొమెస్టిక్‌ టోర్నీ మార్ష్‌ వన్డే కప్‌లో చోటు చేసుకుంది.

సిటీ పవర్‌ సెంటర్‌ స్టేడియంలో న్యూసౌత్‌ వెల్స్‌-టాస్మానియా టైగర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఛేజింగ్‌కు దిగిన న్యూసౌత్‌ వెల్స్‌ ఓపెనర్‌ డేనియల్ హ్యూస్, టాస్మానియా టైగర్స్‌ బౌలర్‌ రిలే మెరెడిత్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ చివరి బంతికి కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. అంపైర్‌ సైతం అవుట్‌గా ప్రకటించడంతో టైగర్స్‌ టీమ్‌ సభ్యులు సంబురాలు చేసుకున్నారు. కానీ, బ్యాటర్‌ డేనియల్ మాత్రం.. అంపైర్‌కు ఏదో చెప్పాడు. బౌలర్‌ రన్నప్‌లో ఉండగా.. అతని టవల్‌ కింద పడిందని, దాంతో తన ఏకాగ్రత దెబ్బతిన్నట్లు వెల్లడించాడు.

దీంతో అంపైర్లు రీప్లేలో పరిశీలించి.. బౌలర్‌ రన్నప్‌లో ఉండగా అతని టవల్‌ కిందపడటం, పైగా అది వైట్‌ కలర్‌లో ఉండటంతో అంపైర్లు తమ నిర్ణయం మార్చుకుని బ్యాటర్‌ డేనియల్‌ను నాటౌట్‌గా ప్రకటించారు. టైగర్స్‌ జట్టు కెప్టెన్‌ మాత్రం అంపైర్లు అవుట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడాన్ని తప్పుబట్టాడు. అయితే.. బాల్‌ వైట్‌ కలర్ కావడం, బౌలర్‌ టవల్‌ కూడా వైట్‌ కలర్‌లోనే ఉండటం, సరిగ్గా బాల్‌ రిలీజ్‌ చేసే కొద్ది క్షణాల ముందే టవల్ జారి కిందపడటంతో బ్యాటర్‌ ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఉందనే ఉద్దేశంతో నాటౌట్‌గా ప్రకటించినట్లు అంపైర్లు అతనికి వివరించారు. అయితే.. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బౌలర్‌ టవల్‌ను తన ప్యాంట్‌లో వెనుక వైపు పెట్టుకున్నాడు. అనుకోకుండా అది జారీ కిందపడింది. దీంతో బ్యాటర్‌ అవుటైనా.. వికెట్‌ దక్కకుండా పోయింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: యువరాజ్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును బ్రేక్ చేసిన నేపాల్ బ్యాటర్!

Show comments