iDreamPost

కివీస్ బౌలర్లను ఊచకోతకోస్తూ.. స్టోక్స్ రికార్డు శతకం!

  • Author Soma Sekhar Updated - 10:01 PM, Wed - 13 September 23
  • Author Soma Sekhar Updated - 10:01 PM, Wed - 13 September 23
కివీస్ బౌలర్లను ఊచకోతకోస్తూ.. స్టోక్స్ రికార్డు శతకం!

వన్డే క్రికెట్ కు అతడు వీడ్కోలు పలికాడు. కానీ అంతలోనే తాను సాధించాల్సింది ఏదో ఉందని అనుకున్నాడు కాబోలు.. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. అతడు తీసుకున్న నిర్ణయమే సరైందని నిరూపిస్తూ.. ఇంగ్లాండ్ జట్టుకు వెన్నముకగా నిలుస్తూ వస్తున్నాడు స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్. గత వరల్డ్ కప్ గెలవడంలో బెన్ స్టోక్స్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో కూడా చెలరేగిపోతున్నాడు స్టోక్స్. తాజాగా కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో జరిగిన మూడో వన్డేలో కివీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. 15 ఫోర్లు, 9 సిక్సర్లతో 182 పరుగులతో చెలరేగాడు స్టోక్స్. దీంతో కివీస్ ముందు ఇంగ్లాండ్ 369 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.

ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య మూడో వన్డే జరుగుతోంది. టాస్ గెలిచిన కివీస్ బౌలింగ్ ను ఎంచుకుంది. కివీస్ సారథి తీసుకున్న నిర్ణయాన్ని వమ్ముచేయకుండా తొలి బంతికే ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ బెయిర్ స్టో(0) ను డకౌట్ గా పంపించాడు బౌల్ట్. ఆ వెంటనే రూట్(4)ను అద్భుతమైన బంతితో బౌల్డ్ చేశాడు. దీంతో 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఇంగ్లీష్ జట్టు. అప్పుడు వచ్చాడు క్రీజ్ లోకి బెన్ స్టోక్స్. డేవిడ్ మలన్ తో జతకలిసిన స్టోక్స్.. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ను గాడిన పెట్టాడు. తొలుత నిదానంగా బ్యాటింగ్ ప్రారంభిచాడు స్టోక్స్. ఒకానొక దశలో 19 బాల్స్ లో 13 రన్స్ తో ఉన్న స్టోక్స్ 76 బంతుల్లో తన సెంచరీ పూర్తి చేశాడంటే.. ఏ స్థాయిలో కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. గ్రౌండ్ నలువైపులా ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ.. స్కోర్ బోర్డ్ ను హోరెత్తించాడు.

మరోవైపు మలన్ కూడా బాధ్యతాయుత ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. తృటిలో సెంచరీ చేజార్చుకున్నప్పటికీ స్టోక్స్ కు అండగా నిలిచాడు. 96 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మలన్ ను బౌల్ట్ అవుట్ చేశాడు. దీంతో 199 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అయితే స్టోక్స్ మాత్రం ఎక్కడా తగ్గలేదు.. తన జోరును కొనసాగిస్తూ.. 76 బంతుల్లో సెంచరీ, 107 బంతుల్లో 150 మార్క్ ను చేరుకున్నాడు. అప్పటికీ ఇంకో 10 ఓవర్లు మిగిలే ఉన్నాయి. దీంతో స్టోక్స్ ఈరోజు వరల్డ్ రికార్డు బద్దలు కొట్టేలా కనిపించాడు. కానీ 124 బంతుల్లో 15 ఫోర్లు, 9 సిక్సర్లతో 182 పరుగులు చేసి 45వ ఓవర్ లో 6వ వికెట్ గా వెనుదిరిగాడు.

ఈ క్రమంలోనే ఓ రికార్డును క్రియేట్ చేశాడు స్టోక్స్. ఇంగ్లాండ్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన బ్యాటర్ గా నిలిచాడు. ఈ రికార్డు ఇంతకు ముందు జేసన్ రాయ్ పేరిట ఉండేది. అతడు ఆస్ట్రేలియాపై ఈ ఘనత సాధించాడు. ఇక కివీస్ బౌలర్లలో బౌల్ట్ 5 వికెట్లతో రాణించాడు. అనంతరం 369 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు 24 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. మరి మాటలకందని స్టోక్స్ విధ్వంసంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


ఇదికూడా చదవండి: మ్యాంగో మ్యాన్​ నవీన్​కు గోల్డెన్ ఛాన్స్.. కోహ్లీతో పార్ట్-2 చూస్తామా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి