Tirupathi Rao
ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ ఆడేందుకు టీమిండియా సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కోహ్లీ స్థానాన్ని ఎవరు భర్తీ చేయబోతున్నారు అనే ప్రశ్న వినిపిస్తోంది.
ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ ఆడేందుకు టీమిండియా సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కోహ్లీ స్థానాన్ని ఎవరు భర్తీ చేయబోతున్నారు అనే ప్రశ్న వినిపిస్తోంది.
Tirupathi Rao
హైదరాబాద్ వేదికగా ఇంగ్లాండ్ తో టీమిండియా టెస్టు సిరీస్ ప్రారంభం కాబోతోంది. కానీ, టీమిండియా అభిమానులకు మాత్రం కోహ్లీ రూపంలో బిగ్ షాక్ అయితే తగిలింది. అతను హైదరాబాద్, విశాఖ వేదికగా జరగనున్న తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. తన వ్యక్తిగత కారణాల దృష్ట్యా రెండు టెస్టుల నుంచి విరాట్ కోహ్లీ ఉపసంహరించుకున్నాడు. అతని నిర్ణయాన్ని గౌరవిస్తూ బీసీసీఐ కూడా అతడిని తొలి రెండు టెస్టులకు పక్కన పెట్టింది. అయితే ఇప్పుడు కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తోంది. అందుకోసం చాలానే పేర్లు వినిపిస్తున్నా.. ఒక యంగ్ స్టర్ మాత్రం ఆ ఛాన్స్ కొట్టేశాడు అని వార్తలు వస్తున్నాయి.
జనవరి 25న హైదరాబాద్ వేదికగా భారత్- ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టుకు మాత్రమే కాకుండా రెండో టెస్టుకు కూడా కోహ్లీ దూరమయ్యాడు. కారణం ఏదైనా కూడా కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయాల్సిన బాధ్యత అయితే బీసీసీఐ మీద పడింది. అదే పనిలో ఇప్పుడు బీసీసీఐ నిమగ్నమైంది. అయితే నిన్నటి వరకు కోహ్లీ స్థానంలో ఛతేశ్వర్ పుజారా, రజిత్ పాటీదార్ పేర్లను పరిశీలిస్తున్నారు అంటూ వార్తలు వచ్చాయి. కానీ, వాళ్లందరినీ పక్కన పెడుతూ ఒక యువ ఆటగాడి పేరు పరిశీలనలోకి వచ్చింది. దాదాపుగా అతడికే అవకాశం దక్కనుందని చెబుతున్నారు. అతను మరెవరో కాదు.. రంజీ ట్రోఫీలో నిప్పులు చెరుగుతున్న గోవా ఆటగాడు సుయాస్ ప్రభుదేశాయ్.
ప్రస్తుతం రంజీ ట్రోఫీ- 2024లో సుయాస్ అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు సుయాస్ ఈ రంజీ ట్రోఫీలో 3 మ్యాచులు ఆడాడు. ఈ మూడు మ్యాచుల్లో 386 పరుగులు చేశాడు. వాటిలో 2 శతకాలు ఉండటం విశేషం. అలాగే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో కూడా సుయాస్ ప్రభుదేశాయ్ కి మంచి రికార్డు ఉంది. అతను 29 మ్యాచుల్లో 47.97 యావరేజ్ తో ఏకంగా 2015 పరుగులు చేశాడు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకునే కోహ్లీ స్థానంలో సుయాస్ కి స్థానం కల్పించాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సుయాస్ వైపే మొగ్గు చూపిస్తున్నట్లు సమాచారం. మరోవైపు సర్ఫరాజ్ ఖాన్ పేరు కూడా వినిపిస్తోంది. మరి.. సెలక్టర్లు ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి.
ఇంక ఇంగ్లాండ్ సిరీస్ విషయానికి వస్తే.. జనవరి 25న ఉప్పల్ స్టేడియం వేదికగా 5 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టు జనవరి 25 నుంచి 29 మధ్య జరగనుంది. రెండో టెస్టు విశాఖపట్నం వేదికగా ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 6 మధ్య జరగనుంది. ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 19 మధ్య రాజ్ కోట్ వేదికగా ఇంగ్లాండ్- టీమిండియా మూడో టెస్టు జరుగుతుంది. నాలుగో టెస్టు ఫిబ్రవరి 23 నుంచి 27 మధ్య రాంచీ వేదికగా జరగనుంది. మార్చి 7 నుంచి 11 మధ్య ఈ టెస్టు సిరీస్ లో అఖరిది అయిన ఐదో టెస్టు జరుగుతుంది. ఈ సిరీస్ లో సత్తా చాటాలని ఇంగ్లాండ్ కూడా ఉవిళ్లూరుతోంది. ఇంగ్లాండుకు కళ్లెం వేసేందుకు బీసీసీఐ గట్టి ప్రణాళికలే వేస్తోంది. మరి.. కోహ్లీ స్థానంలో ఎవరిని ఆడిస్తే బాగుంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.