మరికొన్ని రోజుల్లో క్రికెట్ మహా సంగ్రామం ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో పలు జట్లకు షాకుల మీద షాకులు తగులుతూ ఉన్నాయి. ఇప్పటికే పలువురు ఆటగాళ్లు గాయంతో టోర్నీకి, టోర్నీలోని పలు మ్యాచ్ లకు దూరం కాగా.. మరికొంత మంది ప్లేయర్లు వివిధ కారణాలు, గాయాల వల్ల వరల్డ్ కప్ కు దూరం కావాల్సి వస్తోంది. తాజాగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లకు భారీ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గాయం కారణంగా టోర్నీ మెుత్తానికే దూరం అయినట్లు తెలుస్తోంది. ఇక బవుమా సైతం కొన్ని మ్యాచ్ లకు అందుబాటులో ఉండడని సమాచారం.
వరల్డ్ కప్ ముంగిట ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌంటర్ అష్టన్ అగర్ గాయంతో టోర్నీ మెుత్తానికే దూరం కానున్నట్లు తెలుస్తోంది. అగర్ కాలి కండరాల గాయంతో ప్రస్తుతం బాధపడుతుండగా.. ఆసీస్ మీడియా కథనాల ప్రకారం అతడు పూర్తిగా కోలుకునేందుకు కనీసం నాలుగు వారాల సమయం పడుతుందని సమాచారం. దీంతో అతడు వన్డే వరల్డ్ కప్ కు దాదాపుగా దూరం అయ్యినట్లే. ఇక తన భార్య ప్రసవం కోసం సౌతాఫ్రికా పర్యటన మధ్యలోనే స్వదేశానికి పయనమైయ్యాడు అగర్. ఇప్పటికే స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ ప్రపంచ కప్ కు దూరం కాగా.. ఇప్పుడు అగర్ రూపంలో ఆసీస్ కు భారీ షాక్ తగిలింది.
ఇదిలా ఉండగా.. సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా కూడా స్వదేశానికి ప్రయాణం అయ్యాడు. వ్యక్తిగత కారణాల వల్ల అతడు వరల్డ్ కప్ ముందు జరిగే రెండు వామప్ మ్యాచ్ లకు దూరం కానున్నాడు. తన కుటుంబంలో ఒకరికి తీవ్ర అనారోగ్యంగా ఉండటంతో అతడు ఆఫ్గానిస్తాన్, న్యూజిలాండ్ తో జరిగే వామప్ మ్యాచ్ లకు అందుబాటులో ఉండటం లేదని తెలుస్తోంది. దీంతో తాత్కాలిక కెప్టెన్ గా ఎయిడెన్ మార్క్రమ్ జట్టును నడిపించనున్నాడు. అయితే వరల్డ్ కప్ తొలి మ్యాచ్ కు బవుమా అందుబాటులో ఉంటాడని క్రికెట్ సౌతాఫ్రికా ప్రకటించింది.