భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఇరు దేశాల అభిమానులతో పాటు మొత్తం క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. దాయాదులు కొదమసింహాల్లా తలపడుతుంటే చూడాలని ఎవరికి ఉండదు చెప్పండి! ఇప్పటికే ఆసియా కప్-2023లో రెండు మార్లు భారత్, పాక్‌లు ముఖాముఖి తలపడ్డాయి. ఇందులో ఒక మ్యాచ్ మధ్యలోనే ఆగిపోగా.. ఇంకో మ్యాచ్ రిజర్వ్ డేకు వెళ్లింది. సూపర్-4లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో పాక్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది. ఆ తర్వాత తమ నెక్స్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంకను ఓడించిన భారత్.. టోర్నమెంట్లో ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.
పాకిస్థాన్-శ్రీలంకకు మధ్య గురువారం జరిగే మ్యాచ్‌లో గెలిచే జట్టు ఫైనల్లో భారత్‌తో తలపడేందుకు అర్హత సాధిస్తుంది. గత మ్యాచ్‌లో ఇండియాపై చివరి వరకు టఫ్ ఫైట్ ఇవ్వడం, స్పిన్నర్లు చెలరేగడంతో పాక్‌తో మ్యాచ్‌లో లంక కాన్ఫిడెంట్‌గా కనిపిస్తోంది. మరోవైపు పాక్ మాత్రం బ్యాటర్ల వైఫల్యం.. హారిస్ రౌఫ్, నసీమ్ షా లాంటి టాప్ పేసర్లు గాయాలపాలవ్వడంతో వాళ్ల ప్లేసులో కొత్తవారిని తీసుకుంది. ఆందోళనలో కనిపిస్తున్న పాక్.. లంకపై గెలవగలదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు వర్షం కూడా భయపెడుతోంది. ఒకవేళ వాన వల్ల మ్యాచ్ రద్దయితే పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిందే. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
భారత్-పాక్ ఆసియా కప్ ఫైనల్లో తలపడటం ఇప్పటివరకు జరగలేదని.. ఈసారీ అలాగే జరుగుతుందన్నాడు ఆకాశ్ చోప్రా. ‘లంక-పాక్ మ్యాచ్ పరిస్థితులను గమనిస్తే ఈ విషయం పూర్తిగా అర్థమైపోతుంది కదా! భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు మాత్రమే రిజర్వ్ డే కేటాయించడం చూస్తుంటే.. ఇది కేవలం ఈ రెండు టీమ్స్ కోసమే నిర్వహిస్తున్న టోర్నీలా అనిపిస్తోంది. భారత్, పాక్‌ను టోర్నీ ఫైనల్‌కు పంపాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఈ రెండు జట్లు తుదిపోరులో తలపడటం టోర్నీ చరిత్రలోనే లేదు. అందుకు పరిస్థితులు అనుకూలించవు కూడా. అదంతే’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. మరి.. ఆకాశ్ చోప్రా చెప్పిన మాటలు నిజమవుతాయో? లేదా భారత్-పాక్ ఫైనల్లో తలపడతాయో మరికొన్ని గంటలు ఆగితే తేలిపోతుంది.
ఇదీ చదవండి: బ్యాటర్లకు కొత్త రూల్.. తప్పకుండా పాటించాల్సిందే!