iDreamPost

బ్యాటర్లకు కొత్త రూల్.. పాటించకపోతే ఆంక్షలు తప్పవు!

  • Author singhj Published - 12:11 PM, Thu - 14 September 23
  • Author singhj Published - 12:11 PM, Thu - 14 September 23
బ్యాటర్లకు కొత్త రూల్.. పాటించకపోతే ఆంక్షలు తప్పవు!

అన్ని ఆటల్లోలాగే క్రికెట్​లోనూ చాలా రూల్స్ ఉన్నాయి. ఏ జట్టైనా, ఎంతటి ప్లేయర్ అయినా నియమ నిబంధనలకు లోబడే ఆడాల్సి ఉంటుంది. కాదని రూల్స్​ను మీరితే క్రమశిక్షణ చర్యలను ఎదుర్కోక తప్పదు. అయితే ఇష్టం వచ్చినట్లు ఏ రూల్​ను పడితే ఆ రూల్​ను ఆటగాళ్లపై రుద్దకుండా.. క్రికెట్​కు, క్రికెటర్లకు మంచివనే నిబంధనలను తీసుకొస్తే మంచిదని విశ్లేషకులు అంటుంటారు. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఒక కొత్త రూల్​ను తీసుకొచ్చింది. ఇకపై ఆసీస్ తరఫున డొమెస్టిక్ క్రికెట్​తో పాటు ఇంటర్నేషనల్ మ్యాచ్​లు ఆడే ప్లేయర్లు నెక్ గార్డ్​ను ధరించాల్సిందేనని క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టం చేసింది.

క్రికెటర్లు నెక్ గార్డ్ పెట్టుకోవాలనే నిబంధనను అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తెలిపింది. ఈ రూల్​ను పాటించకపోతే ప్లేయర్లపై ఆంక్షలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. నెక్ గార్డ్ అంటే బ్యాటింగ్ చేసేటప్పుడు ధరించే హెల్మెట్​కు వెనుక భాగంలో రక్షణగా వేసుకునేది. నెక్ గార్డ్ వల్ల పేస్ బౌలర్లు వేసే బౌన్సర్ల వల్ల మెడ భాగంలో గాయం తగలకుండా తప్పించుకోవచ్చు. ఒకవేళ నెక్ గార్డ్​కు బాల్ తగిలినా పెద్ద గాయమేమీ కాదని విశ్లేషకులు అంటున్నారు. బ్యాట్స్​మెన్​ సేఫ్టీ కోసం నెక్ గార్డ్​ను తప్పకుండా ధరించాలని 2014 నుంచి క్రికెట్ ఆస్ట్రేలియా మొత్తుకుంటోంది.

ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ ఫిలిప్ హ్యూజ్ అప్పట్లో ఇలాగే ఓ రాకాసి బౌన్సర్ దెబ్బకు కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన విషయం గుర్తుండే ఉంటుంది. హ్యూజ్ మరణంతో బ్యాటర్లు తప్పకుండా నెక్ గార్డ్ వాడాలని ఆసీస్ బోర్డు చెబుతూ వస్తోంది. కానీ దీన్ని ఎవరూ పెద్దగా సీరియస్​గా తీసుకోలేదు. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ లాంటి టాప్ కంగారూ ప్లేయర్లు కూడా నెక్ గార్డ్ ధరించకపోవడం గమనార్హం. ఒకసారి ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ వేసిన బౌన్సర్​కు నెక్ గార్డ్ లేకపోవడంతో స్మిత్ తలకు గాయమై తల్లడిల్లాడు. అయినా అతడు నెక్ గార్డ్​ను వాడలేదు.

ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్​లో ఆసీస్ ఆల్​రౌండర్ కామెరాన్ గ్రీన్ కూడా ఇదే రీతిలో కగిసో రబాడ వేసిన బౌన్సర్​కు గాయాలపాలై దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో నెక్ గార్డ్ వినియోగించాల్సిందేనని కొత్తగా నిబంధనను తీసుకొచ్చింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. బ్యాట్స్​మెన్ నెక్ గార్డు ధరించడం వల్ల వారి మెడకు రక్షణ లభిస్తుందని క్రికెట్ ఆస్ట్రేలియా హెడ్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ పీటర్ రోచ్ తెలిపారు. కంగారూ క్రికెటర్లందరూ అక్టోబర్ 1 నుంచి ఈ రూల్​ను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. మరి.. బ్యాటర్లు నెక్ గార్డ్ ధరించాల్సిందేనంటూ క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకొచ్చిన కొత్త రూల్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ధోని కాదు.. బౌలర్లకు ఆసలైన పీడకల ఆ బ్యాటరే: కోహ్లీ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి