iDreamPost
android-app
ios-app

పాకిస్థాన్​ ఫైనల్​కు రాదు.. టోర్నమెంట్ రాతే అంత: భారత మాజీ క్రికెటర్!

  • Author singhj Published - 01:19 PM, Thu - 14 September 23
  • Author singhj Published - 01:19 PM, Thu - 14 September 23
పాకిస్థాన్​ ఫైనల్​కు రాదు.. టోర్నమెంట్ రాతే అంత: భారత మాజీ క్రికెటర్!

భారత్ వర్సెస్ పాకిస్థాన్​ మ్యాచ్ అంటే ఇరు దేశాల అభిమానులతో పాటు మొత్తం క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. దాయాదులు కొదమసింహాల్లా తలపడుతుంటే చూడాలని ఎవరికి ఉండదు చెప్పండి! ఇప్పటికే ఆసియా కప్-2023లో రెండు మార్లు భారత్, పాక్​లు ముఖాముఖి తలపడ్డాయి. ఇందులో ఒక మ్యాచ్ మధ్యలోనే ఆగిపోగా.. ఇంకో మ్యాచ్ రిజర్వ్ డేకు వెళ్లింది. సూపర్-4లో భాగంగా జరిగిన మ్యాచ్​లో పాక్​పై టీమిండియా ఘన విజయం సాధించింది. ఆ తర్వాత తమ నెక్స్ట్ మ్యాచ్​లో ఆతిథ్య శ్రీలంకను ఓడించిన భారత్.. టోర్నమెంట్​లో ఫైనల్స్​కు దూసుకెళ్లింది.

పాకిస్థాన్-శ్రీలంకకు మధ్య గురువారం జరిగే మ్యాచ్​లో గెలిచే జట్టు ఫైనల్లో భారత్​తో తలపడేందుకు అర్హత సాధిస్తుంది. గత మ్యాచ్​లో ఇండియాపై చివరి వరకు టఫ్ ఫైట్ ఇవ్వడం, స్పిన్నర్లు చెలరేగడంతో పాక్​తో మ్యాచ్​లో లంక కాన్ఫిడెంట్​గా కనిపిస్తోంది. మరోవైపు పాక్ మాత్రం బ్యాటర్ల వైఫల్యం.. హారిస్ రౌఫ్, నసీమ్ షా లాంటి టాప్ పేసర్లు గాయాలపాలవ్వడంతో వాళ్ల ప్లేసులో కొత్తవారిని తీసుకుంది. ఆందోళనలో కనిపిస్తున్న పాక్​.. లంకపై గెలవగలదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు వర్షం కూడా భయపెడుతోంది. ఒకవేళ వాన వల్ల మ్యాచ్ రద్దయితే పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిందే. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

భారత్-పాక్ ఆసియా కప్ ఫైనల్లో తలపడటం ఇప్పటివరకు జరగలేదని.. ఈసారీ అలాగే జరుగుతుందన్నాడు ఆకాశ్ చోప్రా. ‘లంక-పాక్ మ్యాచ్ పరిస్థితులను గమనిస్తే ఈ విషయం పూర్తిగా అర్థమైపోతుంది కదా! భారత్-పాకిస్థాన్​ మ్యాచ్​కు మాత్రమే రిజర్వ్ డే కేటాయించడం చూస్తుంటే.. ఇది కేవలం ఈ రెండు టీమ్స్ కోసమే నిర్వహిస్తున్న టోర్నీలా అనిపిస్తోంది. భారత్, పాక్​ను టోర్నీ ఫైనల్​కు పంపాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఈ రెండు జట్లు తుదిపోరులో తలపడటం టోర్నీ చరిత్రలోనే లేదు. అందుకు పరిస్థితులు అనుకూలించవు కూడా. అదంతే’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. మరి.. ఆకాశ్ చోప్రా చెప్పిన మాటలు నిజమవుతాయో? లేదా భారత్-పాక్ ఫైనల్లో తలపడతాయో మరికొన్ని గంటలు ఆగితే తేలిపోతుంది.

ఇదీ చదవండి: బ్యాటర్లకు కొత్త రూల్.. తప్పకుండా పాటించాల్సిందే!