క్రికెట్లో టీమ్ సెలెక్షన్ అనేది ఎప్పుడూ వార్తల్లో నిలిచే అంశమనే చెప్పాలి. అందులోనూ భారత్ లాంటి క్రికెట్ అంటే ప్రాణం ఇచ్చే ఫ్యాన్స్ ఉన్న దేశంలో టీమ్ సెలెక్షన్ ఎక్కువగా వివాదాస్పదం అవుతూ ఉంటుంది. ఒక్క ప్లేయర్‌ను పక్కన పెట్టినా పెద్ద ఎత్తున విమర్శలు వస్తాయి. ఇప్పుడు ఆసియా కప్ టోర్నీ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించినప్పటి నుంచి సోషల్ మీడియా వేదికగా చర్చకు తెరలేచింది. ఈ టీమ్ సూపర్బ్‌గా ఉందని కొందరు మెచ్చుకుంటే.. మరికొందరు స్క్వాడ్‌పై పెదవి విరిచారు. ఈ జట్టులో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సహా మణికట్టు మాంత్రికుడు యుజ్వేంద్ర చాహల్‌కు చోటు దక్కలేదు.
మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్‌తో పాటు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఆసియా కప్ టీమ్‌కు సెలెక్ట్ అయ్యారు. దీంతో వీరిని ఐపీఎల్ పెర్ఫార్మెన్స్ ఆధారంగానే ఎంపిక చేశారనే విమర్శలు వచ్చాయి. దీనిపై తాజాగా అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో స్పందించాడు. ఐర్లాండ్ టూర్లో ఇప్పటిదాకా జరిగిన రెండు మ్యాచుల్లోనూ తిలక్ సరిగా ఆడలేదన్న అశ్విన్.. అతడు మొదటి నుంచి దూకుడుగా ఆడాలనే లక్ష్యంతో ఉన్నాడని తెలిపాడు. ఇప్పటితరం యంగ్ ప్లేయర్లు చాలా స్పష్టమైన ఆలోచనలతో క్రీజ్‌లోకి వస్తున్నారని చెప్పాడు. తిలక్ సెలెక్షన్ టీమ్‌లో కొత్తదనం తీసుకొస్తుందని అశ్విన్ పేర్కొన్నాడు. అతడ్ని బ్యాకప్ కోసమే తీసుకున్నట్లు తెలుస్తోందన్నాడు.
‘భారత జట్టు రెండోసారి వన్డే ప్రపంచ కప్ గెలిచేందుకు ప్రధాన కారణం ప్లేయర్లపై నమ్మకం ఉంచి మద్దతుగా నిలవడమే. ఆటగాళ్లు ఫామ్‌లోకి వచ్చే వరకు బాసటగా ఉండాలి. సూర్య ఎంత ప్రమాదకార బ్యాటర్ అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు ఐపీఎల్ గురించి చర్చ జరుగుతోంది. ఐపీఎల్ ముగిస్తే ప్రతి ఒక్కరూ టీమిండియా ప్లేయరే. ఆ లీగ్‌లో తమ జట్టు కోసం అద్భుతంగా ఆడి.. జాతీయ జట్టు కోసం విఫలమైతే ఐపీఎల్ ముగిసినా ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఆటగాళ్లను ఎలా ఎంపిక చేయాలో సెలెక్టర్లకు బాగా తెలుసు. టీమ్‌లో తమకు ఇష్టమైన ప్లేయర్లు లేకపోతే వెంటనే కామెంట్లు చేసేస్తున్నారు. ఇతర ఆటగాళ్లను తక్కువ చేసి మాట్లాడటం సరికాదు. ప్లేయర్లను అవమానించడం ఆపండి’ అని అభిమానులను అశ్విన్ కోరాడు.
Ashwin said “When you get into the World cup, we should see all our players as representatives of India – once IPL gets over, put a cloth, move on & once the player plays for India, accept he did well in IPL – so if your favourite is not in the squad, just not degrade others”.… pic.twitter.com/rGFjq2V2KL
— Johns. (@CricCrazyJohns) August 23, 2023