iDreamPost
android-app
ios-app

విహారి ఈ నిజాలు ఎలా మరిచావు? వివాదంలో అసలు వాస్తవం!

  • Published Feb 27, 2024 | 7:03 PM Updated Updated Feb 27, 2024 | 7:03 PM

హనుమ విహారి కాంట్రవర్సీ ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్​నే కాదు.. ఏపీ రాజకీయాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వివాదంలో అసలు వాస్తవం ఏంటనేది ఇప్పుడు చూద్దాం..

హనుమ విహారి కాంట్రవర్సీ ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్​నే కాదు.. ఏపీ రాజకీయాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వివాదంలో అసలు వాస్తవం ఏంటనేది ఇప్పుడు చూద్దాం..

  • Published Feb 27, 2024 | 7:03 PMUpdated Feb 27, 2024 | 7:03 PM
విహారి ఈ నిజాలు ఎలా మరిచావు? వివాదంలో అసలు వాస్తవం!

హనుమ విహారి వివాదం ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్​ను మాత్రమే కాదు.. రాష్ట్ర రాజకీయాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో నిజానిజాలు తెలియని, తెలుసుకోని, తెలుసుకోవాల్సిన అవసరం లేదని భావించిన టీడీపీ నాయకులు, జనసేన కార్యకర్తలు విహారీకి అన్యాయం జరిగింది అంటూ తెగ గోల చేస్తూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. కానీ.. అక్కడ జరిగిన గొడవని పరిశీలించినా, మొదటి నుంచి ఆంధ్ర అసోసియేషన్​తో విహారి ప్రయాణాన్ని కాస్త తెలుసుకున్నా అసలు వాస్తవాలు ఇట్టే అర్థమైపోతాయి. కాకినాడకు చెందిన విహారి.. తన రంజీ కెరీర్ స్టార్ట్ చేసింది మాత్రం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి.

ఇక, 2015-2016 సీజన్ నుంచి మాత్రమే ఆంధ్రకు ఆడటం మొదలు పెట్టాడు విహారి. ఆటగాడిగా అతడికి అద్భుతమైన ఫ్లాట్ ఫామ్ పడింది ఇక్కడే. అతని కెరీర్​లో అద్భుతమైన ఇన్నింగ్స్ లు వచ్చింది కూడా ఈ కాలంలోనే. తనకి ఇన్ని అవకాశాలను కల్పించిన ఆంధ్ర అసోసియేషన్​ను వదిలి.. 2021-22 సీజన్ కోసం మళ్లీ హైదరాబాద్ జట్టులో చేరిపోయాడు విహారి. ఆ మరుసటి సీజన్ అంటే 2022-23లో మళ్లీ ఆంధ్రకు ఆడతానని రిటర్న్ వచ్చేశాడు. ఇప్పుడు మళ్లీ అసోసియేషన్ మీద పొలిటికల్ ముద్ర వేసి.. ఇక జీవితంలో ఆంధ్ర తరుపున ఆడనంటూ మంగమ్మ శపథాలు చేస్తున్నాడు.

2022-23 సీజన్​లో కూడా ఏపీలో వైసీపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. విహారి నిందలు వేస్తున్న సదరు రాజకీయ నాయకుడు ఆ పార్టీలోనే ఉన్నాడు. అతని కొడుకు క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. మరి.. ఆ సీజన్​లో విహారీని ఎందుకు కెప్టెన్​గా తొలగించలేదు? అసోసియేషన్​ను విమర్శిస్తున్న వారిలో ఎవరైనా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా? విహారి ఈ మధ్య కాలంలో టెస్ట్ జట్టులో స్థానం కోల్పోయాడు. ఇప్పట్లో తిరిగి స్థానం సంపాదించుకునే మార్గం కూడా కనిపించడం లేదు. అతని కన్నా సామర్థ్యం ఉన్న ఆటగాళ్లు టీమ్​లోకి దూసుకొచ్చారు. ఈ ఫ్రస్టేషన్ విహారీని కూల్​గా ఉంచలేకపోయింది.

ప్లేయింగ్ 11లో కాక.. 17వ ఆటగాడిగా ఉన్న ప్లేయర్​ను నిందించాల్సిన అవసరం విహారీకి ఏమొచ్చింది? అన్నదే ఇక్కడ ప్రశ్న. అతన్ని నిందించినందుకే తనను కెప్టెన్సీ నుంచి తప్పించారని స్వయంగా విహారి చెప్తున్నాడు. అసలు అలా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? కుర్రాళ్లకు అంతగా సూచనలు ఇవ్వాలంటే సపోర్టింగ్ స్టాఫ్ ఎలాగూ ఉండనే ఉంటుంది. అలా కాదని జట్టులో లేని ఆటగాడ్ని వ్యక్తిగతంగా దుర్భాషలాడాల్సిన అవసరం ఏమిటి? అసోసియేషన్ ఈ విషయాన్ని సీరియస్​గా తీసుకుంది. అంతే తప్ప ఆ ఆటగాడి తండ్రి కార్పొరేటర్ అని విహారీని కెప్టెన్సీ నుంచి తప్పించలేదు. జట్టులో ప్రతి ప్లేయర్ సమానమనే భావన పోతే.. కొత్త కుర్రాళ్లు ఎలా ఎదగగలరు? ఇదే అసోసియేషన్ నిర్ణయానికి కారణం. విహారి ఈ విషయాన్ని మాత్రం తొక్కి పెట్టి సింపతీ గేమ్స్ స్టార్ట్ చేస్తున్నాడు.

కాసేపు.. విహారి వెర్షన్ కరెక్ట్ అనుకుందాం. ఓ కార్పొరేటర్ చెప్తే.. ఏకంగా జట్టు సారథి కెప్టెన్సీ పోతుందనే అనుకుందాం. అలాంటప్పుడు ఆ కార్పొరేటర్ కొడుకు టీమ్​లో అనామకుడిలా 17వ ఆటగాడిగా ఆడాల్సిన అవసరం ఏంటి? కెప్టెన్​ను తొలగించగలిగిన ఆ నాయకుడు.. తన కొడుకుని ప్లేయింగ్ 11లో ఉంచుకోవచ్చు కదా? మరి.. అలా ఎందుకు జరగలేదు. అసోసియేషన్​లో వైసీపీ నాయకుల ప్రమేయం ఉన్నట్లయితే.. ఇవన్నీ జరగాలి కదా? అలా ఎందుకు జరగలేదు? ఆ కుర్రాడు 17వ ప్లేయర్​గా మాత్రమే ఎందుకు మిగిలిపోయాడు? విహారితో ఎందుకు చివాట్లు తిన్నాడు? వీటన్నింటికీ విహారి మాత్రమే సమాధానం చెప్పాలి. లేదా గుడ్డిగా అతనికి సపోర్ట్ చేస్తూ.. రాష్ట్ర ప్రతిష్టపై రాజకీయ విషం కక్కుతున్న నాయకులైనా జవాబు చెప్పాలి.

ఈ విషయంపై ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ అధికారికంగా స్పందించింది. ‘విహారి చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. కెప్టెన్ తనను తిట్టాడంటూ ఒక క్రికెటర్‌ ఏసీఏకు ఫిర్యాదు చేశాడు. నిజానికి విహారీపై ఇలాంటి ఫిర్యాదు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా విహారి తీరు మీద కంప్లయింట్స్ అందాయి. జట్టులోని ఆటగాళ్లు అంతా సమానమే. అయినప్పటికీ విహారీని కెప్టెన్సీ నుంచి తీసేయడానికి ఇది కారణం కాదు. ఆంధ్రాకు వచ్చినప్పటి నుంచి కూడా విహారి చూపంతా జట్టు మారడం పైనే ఉంది. అతను ఇప్పటికే చాలా ఎన్‌ఓసీలు అడిగాడు. ఈ సీజన్​కు కూడా పూర్తిగా అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఈ కారణంగానే రికీ భుయ్​ను కెప్టెన్​గా నియమించాం. తాజా ఘటనపై విచారణ జరిపించి తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్పష్టం చేసింది. విహారి కెప్టెన్సీ పోవడానికి ఇన్ని కారణాలు కనిపిస్తుంటే దానికి రాజకీయ రంగు పులమడం ఎంత వరకు కరెక్ట్? మరి.. కెప్టెన్​గా నిలకడ లేమితో బాధపడుతున్న విహారీని మార్చడంలో తప్పు ఏముంది? ఇక్కడ రాజకీయ ప్రమేయం ఎక్కడ ఉంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: CSK బౌలర్ ఊచకోత.. 78 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు రిపీట్!