iDreamPost
android-app
ios-app

AFG vs SA: పసికూన చేతిలో సౌతాఫ్రికా చిత్తు.. చరిత్ర సృష్టించిన ఆఫ్గాన్!

  • Published Sep 21, 2024 | 8:02 AM Updated Updated Sep 21, 2024 | 8:02 AM

Afghanistan beat South Africa: వరుసగా రెండో వన్డేలో సౌతాఫ్రికాను చిత్తు చేసి సిరీస్ ను ఎగరేసుకుపోయింది పసికూన ఆఫ్గానిస్థాన్ టీమ్. షార్జా వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఏకంగా 177 పరుగుల తేడాతో ఆఫ్గాన్ రికార్డు విజయాన్ని నమోదు చేసింది.

Afghanistan beat South Africa: వరుసగా రెండో వన్డేలో సౌతాఫ్రికాను చిత్తు చేసి సిరీస్ ను ఎగరేసుకుపోయింది పసికూన ఆఫ్గానిస్థాన్ టీమ్. షార్జా వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఏకంగా 177 పరుగుల తేడాతో ఆఫ్గాన్ రికార్డు విజయాన్ని నమోదు చేసింది.

AFG vs SA: పసికూన చేతిలో సౌతాఫ్రికా చిత్తు.. చరిత్ర సృష్టించిన ఆఫ్గాన్!

వరల్డ్ క్రికెట్ లో సరికొత్త సంచలనం నమోదు అయ్యింది. ప్రపంచ క్రికెట్ దేశాలు సైతం ఆశ్చర్యపడేలా సౌతాఫ్రికాను చిత్తు చేసి.. వన్డే సిరీస్ ను ఎగరేసుకుపోయింది పసికూన ఆఫ్గానిస్థాన్. తొలి వన్డేలో 6 వికెట్లతో సఫారీ టీమ్ కు ఊహించని షాకిచ్చిన ఆఫ్గాన్.. రెండో వన్డేలో సైతం అదే జోరుతో ఏకంగా 177 పరుగుల తేడాతో చిత్తు చేసింది. దాంతో మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్ లో ఆఫ్గాన్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్భాజ్(105) సెంచరీతో ప్రత్యర్థి బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు.

ప్రపంచ క్రికెట్ లో పసికూనగా ముద్రపడ్డ ఆఫ్గానిస్థాన్.. సౌతాఫ్రికా జట్టుకు ఊహించని షాకిచ్చింది. మూడు వన్డేల సిరీస్ ను 2-0తో మరో మ్యాచ్ ఉండగానే కైవసం చేసుకుంది. షార్జా వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్గాన్ కు ఓపెనర్లు గుర్బాజ్-రియాజ్ హసన్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ప్రోటీస్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ.. తొలి వికెట్ కు 88 పరుగుల పార్ట్ నర్ షిప్ ను నెలకొల్పారు. అనంతరం హసన్(29) పరుగుల స్కోర్ వద్ద పెవిలియన్ చేరాడు. ఇక ఆ తర్వాత వచ్చిన ఆప్గాన్ ప్లేయర్లు మరింతగా రెచ్చిపోయారు. మరీ ముఖ్యంగా గుర్భాజ్ తన క్లాసిక్ ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే కెరీర్ లో 7వ సెంచరీని నమోదు చేసుకున్నాడు. 110 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సులతో 105 రన్స్ చేసి ఔటయ్యాడు గుర్బాజ్.

ఇక మిగతా వారిలో రహ్మద్ షా(50), ఒమర్జాయ్(86*) పరుగులతో రాణించడంతో.. ఆఫ్గాన్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 311 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం 312 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన సఫారీ టీమ్ ఏ దశలోనూ లక్ష్యం వైపు కొనసాగలేదు. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ దెబ్బకు ప్రోటీస్ టీమ్ అతలాకుతలం అయ్యింది. రషీద్ 5 వికెట్లు, ఖటేరో 4 వికెట్లతో చెలరేగడంతో.. 34.2 ఓవర్లలో కేవలం 134 రన్స్ కే ఆలౌట్ అయ్యింది. దాంతో 177 పరుగుల భారీ తేడాతో ఆఫ్గాన్ విజయం సాధించింది. జట్టులో కెప్టెన్ టెంబా బవుమా 38 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక ఈ విజయంతో ఆఫ్గానిస్థాన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ గెలుపుతో సేనా దేశాలపై(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్) విజయం సాధించిన జట్టుగా రికార్డును సొంతం చేసుకుంది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే? ఈ విజయాలు ఈ మధ్యనే కావడం విశేషం. కాగా.. గత వరల్డ్ కప్ నుంచి ఆఫ్గాన్ అద్భుతమైన ఆటతీరును కనబరుస్తూ వస్తోంది. టీ20 వరల్డ్ కప్ 2024లో సైతం గొప్పగా ఆడి సెమీ ఫైనల్స్ కు చేరుకున్న విషయం తెలిసిందే.  మరి సౌతాఫ్రికాను ఓడించి.. వన్డే సిరీస్ ను కైవసం చేసుకున్న ఆఫ్గానిస్థాన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.