iDreamPost
android-app
ios-app

వరల్డ్ కప్ లో అద్భుతం.. జగజ్జేతకు షాకిచ్చిన పసికూన!

  • Author Soma Sekhar Published - 07:43 AM, Mon - 16 October 23
  • Author Soma Sekhar Published - 07:43 AM, Mon - 16 October 23
వరల్డ్ కప్ లో అద్భుతం.. జగజ్జేతకు షాకిచ్చిన పసికూన!

‘బండ్లు ఓడలవుతాయి.. ఓడలు బండ్లు అవుతాయి, హీనంగా చూడకు ఘోరంగా దెబ్బతింటావ్’ ఈ రెండు డైలాగ్స్ వరల్డ్ కప్ లో జరిగిన తాజా మ్యాచ్ కు కరెక్ట్ గా సెట్ అవుతాయి. వరల్డ్ కప్ 2023లో పెను సంచలనం నమోదు అయ్యింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ కు షాకిచ్చింది పసికూన ఆఫ్ఘానిస్థాన్. న్యూఢిల్లి వేదికగా జరిగిన మ్యాచ్ లో 69 పరుగుల తేడాతో జగజ్జేతను చిత్తు చేసింది. ఆఫ్ఘాన్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లాండ్ ను మట్టికరిపించింది. మ్యాచ్ ప్రారంభం నుంచి ఏ దశలోనూ ఛాంపియన్ జట్టు గెలుపు దిశగా పయనించలేదు. సంచలన మ్యాచ్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

ఇంగ్లాండ్-ఆఫ్ఘాన్ మధ్య మ్యాచ్.. అందరూ డిఫెండింగ్ ఛాంపియన్ జట్టే విజేతగా నిలుస్తుందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా చెలరేగిన పసికూన జగజ్జేత టీమ్ కు భారీ షాకిచ్చింది. న్యూఢిల్లి వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగింది ఆఫ్ఘాన్. 49.5 ఓవర్లలో 284 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ.. గుర్భాజ్ కేవలం 57 బంతుల్లోనే 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 80 పరుగులు చేశాడు. మిగతా ఆటగాళ్లలో అలీఖిల్(58), జద్రాన్(28), రషీద్ ఖాన్(23) పరుగులతో రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్ల లో ఆదిల్ రషీద్ ఒక్కడే 3 వికెట్లు తీసి సత్తా చాటగా.. స్టార్ బౌలర్లు అయిన క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, సామ్ కర్రన్ ధారళంగా పరుగులు సమర్పించుకున్నారు.

అనంతరం 285 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ను ఆదిలోనే దెబ్బకొట్టాడు ఆఫ్గాన్ బౌలర్ ఫారుఖీ. విధ్వంసకర బ్యాటర్ బెయిర్ స్టో(2)ను తక్కువ పరుగులకే అవుట్ చేసి.. జట్టుకు బ్రేక్ త్రూ అందించాడు. ఆ తర్వాత వెంటవెంటనే ఇంగ్లాండ్ వికెట్లు కోల్పోతూ.. ఏ దశలోనూ లక్ష్యం వైపు సాగలేదు. పసికూన బౌలర్లు సమష్టిగా బౌలింగ్ చేస్తూ.. ప్రత్యర్థిని కట్టడి చేశారు. ముఖ్యంగా స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ 37 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అతడికి తోడు ముజీబ్ రహ్మన్ 3 వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించారు. వీరి ధాటికి ఇంగ్లాండ్ 40.3 ఓవర్లలో 215 పరుగులకే ఆలౌట్ అయ్యి 69 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇంగ్లీష్ జట్టులో బ్రూక్ ఓక్కడే 66 పరుగులతో రాణించాడు. మిగతా బ్యాటర్లు అందరూ మూకుమ్మడిగా విఫలం కావడంతో.. ఛాంపియన్ జట్టుకు ఓటమి తప్పలేదు. మరి ఇంగ్లాండ్ కు షాకిచ్చిన ఆఫ్గాన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.