iDreamPost
android-app
ios-app

పాక్‌పై గెలిచి.. గ్రౌండ్‌ అంతా కార్‌లో తిరిగిన భారత ప్లేయర్లు @39 ఏళ్లు!

  • Published Mar 10, 2024 | 5:01 PM Updated Updated Mar 10, 2024 | 5:01 PM

1985 World Championship of Cricket: అంతర్జాతీయ క్రికెట్‌పై తమదైన ముద్ర వేసిన టీమిండియా.. రెండేళ్ల తర్వాత ఆ ముద్రను మరింత పదిలం చేసింది. పైగా పాకిస్థాన్‌ లాంటి చిరకాల శత్రువుపై గెలిచి చరిత్ర సృష్టించింది. ఆ చరిత్ర గురించే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం..

1985 World Championship of Cricket: అంతర్జాతీయ క్రికెట్‌పై తమదైన ముద్ర వేసిన టీమిండియా.. రెండేళ్ల తర్వాత ఆ ముద్రను మరింత పదిలం చేసింది. పైగా పాకిస్థాన్‌ లాంటి చిరకాల శత్రువుపై గెలిచి చరిత్ర సృష్టించింది. ఆ చరిత్ర గురించే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం..

  • Published Mar 10, 2024 | 5:01 PMUpdated Mar 10, 2024 | 5:01 PM
పాక్‌పై గెలిచి.. గ్రౌండ్‌ అంతా కార్‌లో తిరిగిన భారత ప్లేయర్లు @39 ఏళ్లు!

తొలిసారి రంగుల జెర్సీలో టీమిండియా అదరగొట్టింది. అంతకంటే రెండేళ్ల ముందే వరల్డ్‌ కప్‌ గెలిచి విశ్వవిజేతగా అవతరించింది. అదేదో లక్కులో వచ్చిన విజయం కాదని నిరూపిస్తూ.. సరిగ్గా రెండేళ్ల తర్వాత మరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది భారత క్రికెట్‌ జట్టు. ఇండియన్‌ క్రికెట్‌ చరిత్రలో కొన్ని ఏడాదులు అలా గుర్తుండి పోతాయి. 1983, 2003, 2007, 2011, 2023… వీటిలో మరో ఏడాది కూడా ఎప్పుడు నిలిచి ఉంటుంది. అదే 1985. 1983లో కపిల్‌ దేవ్‌ కెప్టెన్సీలో టీమిండియా వరల్డ్‌ కప్‌ గెలిచిన విషయం తెలిసిందే. అలాగే 2003లో గంగూలీ కెప్టెన్సీలో టీమిండియా వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ వరకు వెళ్లింది. ఫైనల్లో ఓడినా.. ఆ వరల్డ్‌ కప్‌లో టీమిండియా ఆటతీరుపై ఇప్పటికీ ప్రశంసలు కురుస్తుంటాయి.

ఇక 2007లో ధోని సారథ్యంలోని యువ భారత జట్టు మొట్టమొదటి టీ20 వరల్డ్‌ కప్‌ను గెలిచింది. అలాగే ధోని కెప్టెన్సీలోనే 2011లో రెండో సారి వరల్డ్‌ కప్‌ గెలిచి విశ్వవిజేతగా అవతరించింది. మళ్లీ 2023లో రోహిత్‌ కెప్టెన్సీలో వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ వరకు వెళ్లి 2003 సీన్‌ను రిపీట్‌ చేసింది టీమిండియా. అందుకే ఈ ఏడాదులు భారత క్రికెట్‌ అభిమానుల హృదయాల్లో అలా నిలిచిపోయి ఉంటాయి. అలాగే 1985 కూడా చాలా స్పెషల్‌. ఈ తరం క్రికెట్‌ అభిమానులకు తెలియని ఒక అద్భుతం. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించన మధుర క్షణం. గ్రౌండ్‌ మొత్తం కార్లో తిరుగుతూ.. భారత ఆటగాళ్లు చేసిన రచ్చ. అబ్బో.. అవి సంబరాలు కాదు.. అంతకు మించి. అలాంటి చరిత్రకు నేటితో 39 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా ఆ గొప్ప విజయాన్ని, ఆ మధుర క్షణాలను మరోసారి గుర్తుచేసుకుందాం..

1985 ఫిబ్రవరి 17న ఆస్ట్రేలియా వేదికగా ‘బెన్సన్ & హెడ్జెస్ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ ఆఫ్‌ క్రికెట్‌’ టోర్నీ ప్రారంభమైంది. తొలి సారి రంగుల దుస్తుల్లో ఒక వన్డే వరల్డ్‌ కప్‌ లాంటి టోర్నీ జరిగింది. ఈ టోర్నీలో టెస్టు హోదా ఉన్న 7 జట్లు.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, ఇండియా, వెస్టిండీస్‌, పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌, శ్రీలంక పాల్గొన్నాయి. ఈ టోర్నీ కంటే రెండేళ్ల ముందే ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న ఆస్ట్రేలియాను ఓడించి.. కపిల్‌ దేవ్‌ సారథ్యంలోని టీమిండియా ప్రపంచ కప్‌ను గెలిచింది. అయినా కూడా ఈ టోర్నీలో వెస్టిండీసే హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగింది. వరల్డ్‌ కప్‌ గెలిచినా.. టీమిండియాపై పెద్దగా అంచనాలు లేవు.

ఈ సారి సునీల్‌ గవాస్కర్‌ కెప్టెన్సీలో టీమిండియా టోర్నీలో అడుగుపెట్టింది. ఓటమి ఎరుగని జట్టుగా.. ఫైనల్‌ వరకు దూసుకొచ్చింది. తొలి సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించిన భారత్‌ ఫైనల్‌కు వెళ్లింది. ఈ ఫైనల్లో కూడా వెస్టిండీస్‌తో తలపడాల్సి వస్తుందని అంతా భావించారు. ఎందుకంటే.. రెండో సెమీ ఫైనల్‌ పాకిస్థాన్‌, వెస్టిండీస్‌ మధ్య జరిగింది. పెద్దగా అంచనాలు లేని పాకిస్థాన్‌ అనూహ్యంగా వెస్టిండీస్‌పై గెలిచి ఫైనల్‌కు వచ్చింది. ఇక ఇండియా-పాకిస్థాన్‌ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. 1985 మార్చి 10న ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో ఫైనల్‌ మ్యాచ్‌. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 176 పరుగులు మాత్రమే చేసింది. టీమిండియా బౌలర్లలో కపిల్‌ దేవ్‌ 3, లక్ష్మణ్‌ శివరామకృష్ణణ్‌ 3 వికెట్లతో సత్తా చాటారు. చేతన్‌ శర్మ, రవిశాస్త్రి చెరో వికెట్‌ పడగొట్టారు.

ఇక 177 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత బ్యాటర్లు.. పాక్‌ బౌలర్లను ఊచకోత కోశారు. ఓపెనర్లు రవిశాస్త్రి, కృష్ణమాచారి శ్రీకాంత్‌ చెలరేగి బ్యాటింగ్‌ చేశారు. తొలి వికెట్‌కు ఏకంగా 103 పరుగులు జోడించి విజయం ఖాయం చేశారు. శ్రీకాంత్‌ 77 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 67 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. వన్‌ డౌన్‌లో వచ్చిన అజహరుద్దీన్‌ 26 బంతుల్లో 3 ఫోర్లతో 25 రన్స్‌ చేసి అవుట్‌ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ 18 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఓపెనర్‌ రవిశాస్త్రి 63 పరుగులతో నాటౌట్‌గా నిలిచి టీమిండియాను ఛాంపియన్‌గా నిలిపాడు. మొత్తంగా 47.1 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయిన టీమిండియా టార్గెట్‌ను ఛేధించి.. వరల్డ్‌ ఛాంపియన్‌గా అవతరించింది. 1983లో వచ్చిన విజయం ఏదో లక్కులో వచ్చింది కాదని ప్రపంచానికి చాటి చెప్పింది. ఆ తర్వాత భారత ఆటగాళ్లు చేసుకున​ సంబరాలు అయితే.. ఇప్పటికే భారత క్రికెట్‌ అభిమానుల గుండెల్లో చెరగని ముద్రను వేసుకున్నాయి. ముఖ్యంగా ఆడి కారుపై టీమిండియా క్రికెటర్లు గ్రౌండ్‌ మొత్తం చక్కర్లు కొడుతున్న ఫొటోలు అప్పుట్లో ప్రకంపనలు సృష్టించాయి. మరి ఆ అద్భుత విజయానికి, విజయోత్సవాలకు 39 ఏళ్లు నిండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.