iDreamPost
android-app
ios-app

యువీ 6 సిక్సుల విధ్వంసానికి 16 ఏళ్లు పూర్తి! గెలికి మరీ కొట్టించుకున్నారు..

  • Published Sep 19, 2023 | 11:21 AM Updated Updated Sep 19, 2023 | 11:21 AM
  • Published Sep 19, 2023 | 11:21 AMUpdated Sep 19, 2023 | 11:21 AM
యువీ 6 సిక్సుల విధ్వంసానికి 16 ఏళ్లు పూర్తి! గెలికి మరీ కొట్టించుకున్నారు..

టీమిండియా మాజీ డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌. ఈ పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఆరు బంతుల్లో ఆరు సిక్సుల అద్భుతం. 2007.. సౌతాఫ్రికా వేదికగా మొట్టమొదటి టీ20 వరల్డ్‌ కప్‌ జరుగుతోంది. డర్బన్‌లో ఇండియా-ఇంగ్లండ్‌ మధ్య మ్యాచ్‌.. ఓపెనర్లు వీరేందర్‌ సెహ్వాగ్‌-గౌతమ్‌ గంభీర్‌ భారత్‌కు మంచి స్టార్ట్‌ ఇచ్చారు. కానీ, అసలు సిసలు విధ్వంసం మాత్రం యువీ సృష్టించాడు. ఇంగ్లండ్‌ యువ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌ను చీల్చిచెండాడుతూ.. కనీవిని ఎరుగని రీతిలో ఆరు బంతుల్లో వరుసగా ఆరు సిక్సులు బాది చరిత్ర సృష్టించాడు. ఆ ఇన్నింగ్స్‌తో కేవలం 12 బంతుల్లోనే అత్యంత వేగవంతమైన హాఫ్‌ సెంచరీ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా.. యువీ సృష్టించిన ఆ విధ్వంసానికి నేటితో సరిగ్గా 16 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా అసలు ఆ రోజు ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకుందాం..

గెలికి మరీ కొట్టించుకున్నారు..
సహజంగా ఇండియన్‌ క్రికెటర్లు అందరితో స్నేహంగా ఉంటారు. కావాలని ఎవరినీ ఏమి అనరు. కానీ, ప్రత్యర్థులు కవ్విస్తే మాత్రం జూల్చువిదిల్చిన సింహాల్లా రెచ్చిపోతారు. ఈ విషయాన్ని నిజం చేశాడు. 144 పరుగుల వద్ద గౌతమ్‌ గంభీర్‌ అవుటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చాడు యువరాజ్‌. అంతలోనే టీమిండియా మరో వికెట్‌ కూడా కోల్పోయింది. యువీ-ధోని క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ ఫ్లింటాఫ్‌ ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో 5వ బంతికి యువీ ఫోర్‌ బాదాడు. దాంతో ఫ్లింటాఫ్‌ ఇగో హర్ట్‌ అయింది. తన బౌలింగ్‌లో ఫోర్‌ కొట్టాడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఫ్లింటాఫ్‌.. యువీని ఏదో అన్నాడు. అసలే ఉడుకురక్తం.. అందులోనా టీమిండియా స్టార్‌ ప్లేయర్‌ అయిన యువీ ఊరుకుంటాడా? నోరు పారేసుకున్న ఫ్లింటాఫ్‌పైకి దూసుకెళ్లాడు. అతనికి గట్టి వార్నింగ్‌ ఇచ్చాడు. మధ్యలో అంపైర్‌ వచ్చిన ఇద్దర్ని సర్ది చెప్పాడు.

కానీ, యువీలో కోపం మాత్రం తగ్గలేదు. ఫ్లింటాఫ్‌కు మాటతో కాదు బ్యాట్‌తో సమాధానం చెప్పాలని బలంగా ఫిక్స్‌ అయ్యాడు. ఆ గొడవ తర్వాత.. యువ పేసర్‌ బ్రాడ్‌ బౌలింగ్‌కు వచ్చాడు. ఆ సమయంలో యువీకి బ్రాడ్‌ కనిపించలేదు.. ఫ్లింటాఫ్‌ మాత్రమే కనిపిస్తున్నాడు. ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో తొలి బంతిని కౌవ్‌ కర్నర్‌ వైపు భారీ సిక్స్‌ బాదాడు. రెండో బంతిని బ్యాక్‌వర్డ్‌ స్క్వౌర్‌లెగ్‌ వైపు ఫ్లిక్‌ షాట్‌తో మరో సిక్స్‌. ఇక ఇంగ్లండ్‌ ఆటగాళ్లకు అర్థమైపోయింది. యువీ కావాలని కసితో కొడుతున్నాడని, ఇంగ్లండ్‌ కెప్టెన్‌ పాల్‌ కాలింగ్‌వుడ్‌.. బౌలర్‌ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి.. అతన్ని కామ్‌ చేసే ప్రయత్నం చేశాడు.

అయినా కూడా లాభం లేకపోయింది. మూడో బంతి కూడా భారీ సిక్స్‌. ఈ సారి ఎక్స్‌ట్రా కవర్స్‌ పైనుంచి వెళ్లింది. వరుసగా మూడు బంతుల్లో మూడు సిక్సులు. బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న ఫ్లింటాఫ్‌ తెల్లముఖం వేశాడు. యువీని అనవసరంగా గెలికినట్టు ఉన్నానే అనే ఫీలింగ్‌ అతని ఫేస్‌లో కనిపించింది. ఇంగ్లండ్‌ ఆటగాళ్లు కూడా.. సిక్సులు కొడుతున్న యువీపై కాకుండా.. అతన్ని రెచ్చిగొట్టిన ఫ్లింటాఫ్‌పైనే కోపంతో ఉన్నారు. మూడు బంతుల్లో మూడు భారీ సిక్సులు బాదిన యువీ కోపం తగ్గలేదు. మిగిలిన మూడు బంతులను కూడా భారీ సిక్సులు బాదీ చరిత్ర సృష్టించిన తర్వాత.. అప్పుడు నవ్వాడు. ఫ్లింటాఫ్‌పై కోపంతో కొట్టినా.. తర్వాత అది యువీ ఎలాంటి ఆటగాడో ప్రపంచానికి చాటి చెప్పింది. ఆ ఒక్క మ్యాచ్‌తోనే యువీ విధ్వంసం ఆగిపోలేదు. టీమిండియా మొట్టమొదటి టీ20 ఛాంపియన్‌గా నిలిపే దాకా సాగింది. ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టిన ఏకైక భారత బ్యాటర్‌గా యువీ పేరు చరిత్రలో నిలిచిపోయింది. 16 ఏళ్లుగా ఆ రికార్డు చెక్కుచెదరకుండా ఉండిపోయింది. మరి యువీ సృష్టించిన ఆ విధ్వంసం గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: తొలిసారి ధోని గురించి పాజిటివ్‌గా మాట్లాడిన గంభీర్‌! నిజంగానే నమ్మండి..