iDreamPost
android-app
ios-app

ఉప్పెన రివ్యూ

  • Published Feb 12, 2021 | 8:06 AM Updated Updated Feb 12, 2021 | 8:06 AM
ఉప్పెన రివ్యూ

ఎంత మెగా సపోర్ట్ ఉన్నా ఒక డెబ్యూ హీరో సినిమాకు ఇంత హైప్ రావడం బహుశా ఉప్పెన విషయంలోనే జరిగిందనే మాట వాస్తవం. ఏడాదికి పైగా థియేట్రికల్ రిలీజ్ కోసమే ఆగిన ఈ సముద్ర తీరపు ప్రేమ కథకు ఆ కారణంగానే ఇవాళ భారీ ఓపెనింగ్స్ దక్కాయి. దర్శకుడు బుచ్చిబాబు కొత్తవాడైనప్పటికీ సుకుమార్ తో పాటు మైత్రి మూవీ మేకర్స్ లాంటి అగ్రనిర్మాణ సంస్థ అండదండలు తోడవ్వడంతో ఉండాల్సిన దాని కన్నా అంచనాలు చాలా పెరిగిపోయాయి. మ్యూజికల్ గా ఎప్పుడో బ్లాక్ బస్టర్ అందుకున్న ఉప్పెన ఆల్బమ్ మరి సినిమా పరంగానూ అంత బలమైన కంటెంట్ తో వచ్చిందా లేదా రివ్యూలో చూద్దాం పదండి

కథ

ఇది 2002లో జరిగే కథ. సముద్రతీర ప్రాంతమైన ఉప్పాడలో చేపలు పడుతూ జీవనం సాగించే ఆసి అలియాస్ ఆశీర్వాదం(వైష్ణవ్ తేజ్)చిన్నతనం నుంచే బేబమ్మ ఉరఫ్ సంగీత(కృతి శెట్టి)ని ఇష్టపడతాడు. ఆ అమ్మాయి కాలేజీ వయసుకొచ్చాక ఇద్దరూ ప్రేమించుకోవడం మొదలుపెడతారు. ప్రాణం కన్నా పరువే ముఖ్యంగా భావించే ఊరిపెద్ద బేబమ్మ తండ్రి శేషా రాయనం(విజయ్ సేతుపతి)కి వీళ్ళ వ్యవహారం తెలిసిపోతుంది. ఆ తర్వాత జరిగే ఊహించని పరిణామాలు, ఆసి, బేబమ్మ ప్రేమకథ ఏ తీరానికి చేరుకుంది లాంటి ప్రశ్నలకు సమాధానం తెరమీదే చూడాలి.

నటీనటులు

ఏ నటుడికైనా మొదటి సినిమాలో నటించినప్పుడు, కెమెరాను ఫేస్ చేస్తున్నప్పుడు కొంత బెరుకు ఉండటం సహజం. అందులోనూ వైష్ణవ్ తేజ్ లాంటి హీరో మీద మెగా స్టాంప్ ఉంది కాబట్టి సహజంగానే ఇతన్నుంచి ప్రేక్షకులు కాస్త ఎక్కువ ఆశిస్తారు. అది బాగా గుర్తుంచుకున్నాడు కాబట్టి వీలైనంతలో తనవరకు యాక్టింగ్ విషయంలో వైష్ణవ్ మరీ నెగటివ్ ఇంప్రెషన్స్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. ఫిజికల్ గా ఇతనిలో పెద్దగా మైనస్సులు లేకపోవడం వల్ల అందరి దృష్టి సహజంగానే నటనవైపుకు వెళ్తుంది. ఈ అంశంలో వైష్ణవ్ తేజ్ పాస్ మార్కులతో గట్టెక్కాడు. ముఖ్యంగా ఛాలెంజింగ్ గా అనిపించే సెకండ్ హాఫ్ లో ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టుండాల్సింది.

అసలు ఈ సినిమా రిలీజ్ కు ముందే వరస ఆఫర్లు పట్టేస్తున్న కృతి శెట్టి ఊహించినట్టే బుట్టబొమ్మగా అందంతో పాటు అభినయాన్ని కూడా మోసుకొచ్చింది. కాకపోతే కొన్ని సన్నివేశాల్లో ఎక్స్ ప్రెషన్స్ పరంగా చేయాల్సిన హోమ్ వర్క్ ఇంకా ఉందనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు ఇంత క్రేజ్ రావడానికి మరొక ప్రధాన కారణమైన విజయ్ సేతుపతి రాయనంగా యాక్టింగ్ కంటే బాడీ లాంగ్వేజ్ తో చెలరేగిపోయాడు. రవిశంకర్ డబ్బింగ్ తో ఎక్కువ మేనేజ్ అయిపోయింది. ఫిదా, సైరా తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ సాయి చంద్ కి మరో మంచి పాత్ర దొరికింది. ఆర్టిస్టులు ఇంకా ఉన్నప్పటికీ వీళ్ళే గుర్తుండిపోతారు.

డైరెక్టర్ అండ్ టీమ్

కథలో కీలకమైన ట్విస్టు తప్పించి మిగిలిందంతా గతంలో వచ్చిన ఎన్నో సినిమాల ఛాయల్లో ఉందనిపించే ఉప్పెనని తన విజువలైజేషన్ తో ఆసక్తి రేపే స్థాయిలో తెరకెక్కించడానికి దర్శకుడు బుచ్చిబాబు గట్టిగానే ప్రయత్నించాడు. ఇతని మీద గురువు సుకుమార్ ప్రభావం అడుగడుగునా కనిపించే ఉప్పెనలో డ్రామా కన్నా ఎక్కువగా ఎమోషన్లను జొప్పించారు. స్టోరీపరంగా కొత్తగా ఏమి ఉండదనే అభిప్రాయాన్ని ప్రమోషన్ల రూపంలో ముందు నుంచే చెప్పుకున్నారు కాబట్టి దానికి అనుగుణంగానే ప్రిపేర్ అయ్యి చూడాలి. హృద్యమైన ప్రేమకథగా పబ్లిసిటీ చేయడం ఓపెనింగ్స్ పరంగా ప్లస్ అయితే అదే మైనస్ అయ్యేలా కూడా ఉంది.

పెద్దింటి అమ్మాయి, ఓ వెనుకబడిన కులం అబ్బాయి మధ్య లవ్ ని బేస్ చేసుకుని భారతీరాజా సీతాకోకచిలుక నుంచి ఓటిటిలో వచ్చిన కలర్ ఫోటో దాకా చాలా వచ్చాయి. అన్నిట్లో లైన్ ఒకటే ఉంటుంది. బుచ్చిబాబు అందుకే శరీర సాంగత్యం కన్నా మానసికంగా ధైర్యాన్నిచ్చే తోడు ముఖ్యమనే సందేశాన్ని గ్రాండియర్ గా చూపించాలన్న ఆలోచనతో ఉప్పెన కథ రాసుకున్న మాట వాస్తవం. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ప్రేమ సన్నివేశాలు, ఆ సముద్రపు బ్యాక్ డ్రాప్ ఇవన్నీ కొంత ఫ్రెష్ గానే అనిపించినా అసలైన తడబాటు రెండో సగంలో జరిగింది.కీలక మలుపులు, మంచి పాటలు నాలుగు అన్నీ ఇంటర్వెల్ ముందే వచ్చేశాయి. అందుకే మిగిలిన సగాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలో తెలియని అయోమయం బుచ్చిబాబుని ఇబ్బంది పెట్టడం కనిపిస్తుంది.

ఏ ప్రేమకథకైనా భావోద్వేగాలు చాలా ముఖ్యం. అవి ఎంత గొప్పగా పండాయనే దాన్ని బట్టే ప్రేక్షకులు వాటిని విపరీతంగా ఆదరించాలా వద్దా అనేది నిర్ణయించుకుంటారు. మరో చరిత్రలో ట్రాజెడీని ఒప్పుకున్నా, జయంలో కమర్షియల్ ప్రేమను ఎంజాయ్ చేసినా కారణం ఎమోషన్లు సరైన పాళ్ళలో ఉండటం. అయితే ఉప్పెనలో అతి ముఖ్యంగా చెప్పుకునే మలుపు తప్ప మిగిలినదంతా సాధారణంగానే అనిపిస్తుంది. ముఖ్యంగా బేబమ్మ, ఆసిలు ఇతర ఊళ్ళకు వెళ్లి నానా కష్టాలు పడటం చాలాసార్లు చూసేసిన వ్యవహారమే. అక్కడ బలమైన సన్నివేశాలు, ఉద్వేగానికి గురి చేసే సీన్లు కానీ ఏమి ఉండవు. ఉప్పెనలో ప్రధానమైన మైనస్ ఇదే.

బుచ్చిబాబు పూర్తిగా సుకుమార్ ఫార్మాట్ నే ఫాలో అయ్యాడు. హీరోకు ‘గ’ అక్షరం పలకలేని లోపం, సాయి చంద్ చనిపోయినప్పుడు పెట్టిన పాథోస్ సాంగ్ ఇదంతా రంగస్థలంలో చూసిన ఫార్ములానే. ఇక రాయనం అంత దుర్మార్గుడైనప్పుడు చివరిలో చాలా సులభంగా మార్పు చెందడం పూర్తి కన్విన్సింగ్ గా అనిపించదు.పైగా బేబమ్మ అంత ఎమోషనల్ గా చెబుతున్న డైలాగులు డెప్త్ పరంగా బాగున్నాయి అనిపిస్తాయే తప్ప అబ్బ ఈ సీన్ ఎంత గొప్పగా ఉందని మాత్రం అనిపించలేదంటే అది కథనంలోని మైనస్సే. ఆర్టిస్టులు బలంగా ఉండటంతో చాలా తేలికైన సీన్లు కొన్ని నిలబడ్డాయి.

దర్శకుడిలో కంటెంట్ ఉంది. ఇందులో అనుమానం లేదు. కానీ అతని ప్రతిభ మొత్తం చూపించేంత బలమైన మెటీరియల్ ఉప్పెనలో పూర్తి స్థాయిలో లేదు. కాకపోతే ఇదేం సినిమా అనిపించకుండా డీసెంట్ గా ఓ మాదిరి సంతృప్తితో బయటికి వచ్చేలా చేయడంలో మాత్రం సక్సెస్ అయ్యాడు. మ్యూజిక్, ఆర్ట్ డైరెక్షన్, కెమెరా వర్క్ ఈ మూడింట్లో ఏ ఒక్కటి బలహీనంగా ఉన్నా ఉప్పెనను భరించడం ఇంకా కష్టమయ్యేది. టీమ్ వర్క్ కి నిదర్శనంగా డైరెక్టర్ కంటే ఎక్కువగా ఇవి కష్టపడ్డాయి కాబట్టి చాలా మటుకు వీక్ నెస్ లు తగ్గడానికి ఉపయోగపడ్డారు. మొత్తానికి ఉప్పెనతో బుచ్చిబాబు స్టేట్ ఫస్ట్ వస్తాడనుకుంటే స్కూల్ ర్యాంకు దగ్గరే ఆగిపోయాడు

ఉప్పెనకు ఈ స్థాయి బజ్ రావడంలో తనదే కీలక పాత్ర ఉండేలా చేసుకున్న దేవిశ్రీ ప్రసాద్ అంచనాలకు తగ్గట్టే దీనికి ప్రాణంగా నిలిచాడు. చాలా కాలం తర్వాత అటు పాటలు ఇటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రెండింటిలోనూ తనదైన మార్కు చూపించాడు. తనకు మాత్రమే సాధ్యమయ్యే సిగ్నేచర్ మ్యూజిక్ తో విభిన్నతను చూపించాడు. మోనికా రామకృష్ణ ఆర్ట్ వర్క్ ప్రత్యేకంగా అభినందించాల్సిందే. సహజమైన లొకేషన్లను తలపించేలా ఇంటీరియర్లను డిజైన్ చేసిన తీరు రంగస్థలం తర్వాత బెస్ట్ వర్క్ అనిపించేలా చేసింది.

శ్యాం దత్ సైనుద్దీన్ ఛాయాగ్రహణం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఉప్పాడ అందాలను, సముద్రంలో తీవ్రతను, ఆసి బేబమ్మల అందమైన ప్రేమను చూపించిన తీరు గొప్ప స్టాండర్డ్ లో ఉంది. విజువల్స్ అద్భుతంగా వచ్చాయి. నవీన్ నూలి ఎడిటింగ్ అక్కడక్కడా కొంచెం జాగ్రత్త పడి ఉంటే వేగం పెరిగేది. సుకుమార్ లాగే బుచ్చిబాబులోనూ మంచి డైలాగ్ రైటర్ ఉన్నాడు. సంభాషణలు చాలా చోట్ల పేలాయి. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరో అయినప్పటికీ వైష్ణవ్ తేజ్ మీద ఇంత భారీ బడ్జెట్ పెట్టేందుకు సాహసించిన మైత్రి మూవీ మేకర్స్ అందరికన్నా ఎక్కువ ప్రశంసలకు అర్హులు.

ప్లస్ గా అనిపించేవి

వైష్ణవ్-కృతిల జోడి ప్లస్ నటన
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం
శ్యామ్ దత్ ఛాయాగ్రహణం
విజయ్ సేతుపతి పాత్ర

మైనస్ గా తోచేవి

కథ రొటీనే
సెకండ్ హాఫ్
అనుకున్న స్థాయిలో ఎమోషన్లు పండకపోవడం

కంక్లూజన్

పేద ధనిక ప్రేమకథలు ఎప్పుడూ ఒకే ఫార్ములాలో ఉంటాయి. వాటిని నిలబెట్టేనా కిందకు తోసేసినా అందులో ఉండే ఎమోషన్లు, ప్రేక్షకులను ఎంగేజ్ చేయడానికి కావాల్సిన డ్రామా ఎలిమెంట్లే కారణం. ఇవన్నీ సరిగ్గా బాలన్స్ కుదిరినప్పుడు ఇలాంటి సినిమాలు కల్ట్ క్లాసిక్ గా మిగిలిపోతాయి. కానీ ఉప్పెన విషయంలో అన్నీ సమపాళ్ళలో కుదరలేదు. విలన్ వల్ల హీరో వైపు జరిగే విపరీత నష్టం అనే ఒక్క థ్రెడ్ ను తీసుకుని ఇంత భారీ బడ్జెట్ తో బుచ్చిబాబు చేసిన సాహసం సంపూర్ణంగా సంతృప్తిపరచలేకపోవడంతో పర్వాలేదు అనే మాట దగ్గరే ఆగిపోవడం విచారకరం. ప్రేమకథలను విపరీతంగా ప్రేమించే వాళ్ళు ఛాయస్ గా పెట్టుకోవచ్చు.

ఒక్కమాటలో – వేగం తగ్గిన ఉప్పెన