iDreamPost
iDreamPost
లాక్ డౌన్ ఎత్తేశాక పెద్ద సినిమాలు సాహసం చేయకపోవడం వల్ల మీడియం రేంజ్ చిత్రాలు భారీ విడుదలను దక్కించుకుని మంచి ఓపెనింగ్స్ కి దారులు వేసుకుంటున్నాయి. అందులో భాగంగా వచ్చిందే శ్రీదేవి సోడా సెంటర్. మహేష్ బాబు ఫ్యాన్స్ అండదండలు ఉన్నా డిఫరెంట్ సబ్జెక్టులతో బాగానే కష్టపడుతున్న సుధీర్ బాబు హీరోగా తెలుగమ్మాయి ఆనందిని హీరోయిన్ గా పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ విలేజ్ డ్రామాని కాస్త ఎక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తేనే అర్థమైపోయింది. మరి ఇంత హైప్ లో ఈ సోడాలో గ్యాస్ సరిపడినంత ఉందా రుచి ఎలా ఉంది లాంటివి రివ్యూలో చూసేద్దాం
కథ
అమలాపురం దగ్గరలో ఉన్న ఊరిలో కరెంటు పనులు చేసే సూరిబాబు(సుధీర్ బాబు)దేవుడి జాతరలో సోడాల కొట్టు నడుపుకునే శ్రీదేవి(ఆనందిని)ని చూసి తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆమె తండ్రి(నరేష్)కు వీళ్ళ వ్యవహారం ఇష్టం ఉండదు. అప్పటికే సూరిబాబుతో వైరం ఉన్న తమ కులానికే చెందిన కాశి(పావెల్)సహాయం కోరతాడు. అందులో భాగంగా కుట్రలు జరిగి సూరిబాబు జైలుకు వెళ్తాడు. తప్పించుకుని వచ్చాక ఊహించని విషయాలు తెలుస్తాయి. శ్రీదేవిని వెతుక్కుంటూ కాశీని వెంటపడి మరీ చంపేందుకు సిద్ధపడతాడు. అసలు శ్రీదేవి ఏమయ్యింది, ఇద్దరూ కలిశారా లేదా అనేది తెరమీద చూడాలి
నటీనటులు
సుధీర్ బాబు గొప్ప ఎక్స్ ప్రెషనల్ ఆర్టిస్టు అనలేం కానీ ఆ దిశగా తనను తాను అల్ రౌండర్ గా మలుచుకునేందుకు కావాల్సినదంతా చేస్తున్నాడు. కఠినమైన సిక్స్ ప్యాక్ బాడీని డెవలప్ చేసుకోవడం, ఇలాంటి సీరియస్ డ్రామాలు ఎంచుకోవడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సూరి బాబు క్యారెక్టర్ లో సుధీర్ ఒదిగిపోయిన తీరు ప్రశంసలకు అర్హమే. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో గతంలో కంటే కాస్త ఎక్కువ పరిణితిని చూపించాడు. కాకపోతే ఆరు పలకల దేహం ఉంది కాబట్టి దాన్ని హై లైట్ చేసేందుకు కొన్ని ఫైట్స్ ని డిజైన్ చేయడం అంతగా ప్లస్ అవ్వలేదు. సుధీర్ బాబు ఇప్పటిదాకా చేసినవి ఒక ఎత్తు అయితే ఇది ప్రత్యేకంగా నిలుస్తుంది.
తెలుగు అమ్మాయే అయినా ఇక్కడ కంటే కోలీవుడ్ లో ఎక్కువ అవకాశాలు పట్టేస్తున్న ఆనందినికి పర్వాలేదనిపించే పాత్ర దొరికింది. బహుశా ఈ రోల్ కు సంబంధించిన ట్విస్టు వల్లే వేరే అమ్మాయిలు ఒప్పుకోలేదో లేక సహజంగా ఉండాలని దర్శకుడు తనని తీసుకున్నాడో చెప్పలేం కానీ మొత్తానికి ఒకటి రెండు సీన్లు తప్ప తనకు గొప్పగా దక్కిందేమి లేదు. విలన్ గా చేసిన పావెల్ నవగీతన్ కు స్పేస్ ఎక్కువ ఇచ్చారు కానీ ఆ పాత్రకు ఉండాల్సిన క్రూరత్వం కావాల్సినంత డోస్ లో పండించలేకపోయాడు. రఘు కుంచె డబ్బింగ్ కూడా అంతగా అతకలేదు. రఘుబాబు, సత్యం రాజేష్, నరేష్ తదితరులు అందరివీ రెగ్యులర్ గా అనిపించేవే.
డైరెక్టర్ అండ్ టీమ్
కులాంతర ప్రేమకథలను ప్రతిసారి ఫ్రెష్ గా ఫీలవ్వలేం. అందులో చూపించే సహజత్వం, ఎమోషన్స్ ని జొప్పించిన తీరుని బట్టి ప్రేక్షకులు వాటిని హిట్ చేస్తారా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. సీతాకోకచిలుకతో మొదలుపెట్టి ఉప్పెన దాకా ఎన్నో సినిమాలు ఈ విషయాన్ని ఋజువు చేశాయి. వాటిలో అధిక శాతం క్లైమాక్స్ లు సుఖాంతాలే. తాను అలాగే చేస్తే శ్రీదేవి సోడా సెంటర్ ఒక రొటీన్ పల్లెటూరి ప్రేమకథగా మారిపోతుందని గుర్తించిన కరుణ కుమార్ షాక్టింగ్ ట్విస్టుని బేస్ చేసుకుని ఇంటెన్స్ డ్రామాగా దీన్ని ప్రెజెంట్ చేయడానికి సిన్సియర్ గా కష్టపడినట్టు కనిపిస్తుంది. కానీ ఆ ఒక్క పాయింట్ ఇంత బరువు మోయలేకపోయింది
ఎంత నిజాయితీగా తీసినా బడ్జెట్ విషయంలో హీరో మార్కెట్ ని మించి రిస్క్ చేస్తున్నప్పుడు కమర్షియల్ ఫ్లేవర్ చాలా అవసరం. అందుకే కరుణ కుమార్ ఆ వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకునే శ్రీదేవి సోడాలో అన్ని హంగులు ఉండేలా చూసుకున్నాడు. కాకపోతే తన మేకింగ్ స్టైల్ నెమ్మదిగా ఉంటుంది. కథను విడమరిచి చెప్పే క్రమంలో సన్నివేశాలు చాలా సాగతీతకు గురవుతాయి. ఇది పలాసలోనూ కనిపించింది. డిటైల్డ్ గా వెళ్తేనే ఎమోషన్ బలంగా రిజిస్టర్ అవుతుందని నమ్మే దర్శకుల కోవలోకే కరుణ కుమార్ చేరతారు. అందుకే శ్రీదేవి సోడా సెంటర్ లో గ్యాస్ పేలినంత వేగంగా స్క్రీన్ ప్లే పరుగులు పెట్టదు.
మనం పాత్రల తాలూకు ఎమోషన్ ని ఫీలవ్వాలంటే వాళ్లకు సంబంధించిన లవ్ ఎపిసోడ్ చాలా బలంగా ప్లస్ ఎంటర్ టైనింగ్ గా ఉండాలి. కానీ ఇందులో అది తేలిపోయింది. సీన్లు చాలా తేలికగా వెళ్తాయి. అటు నవ్వించవు ఇటు టైం పాస్ చేయించవు. అలా వచ్చి వెళ్తూ ఉంటాయి. సూరి శ్రీదేవిలు ఒక్కటయ్యే సన్నివేశాన్ని చిన్న పాటతో అసభ్యత లేకుండా సింపుల్ గా కట్ చేయడం బాగుంది. అయినా కూడా ఠక్కున ఉప్పెన గుర్తుకు వస్తే అది చూసేవాళ్ల తప్పు కాదు. ఇంటెన్స్ డ్రామా పండాలంటే చక్కని విజువల్స్, షాకింగ్ క్లైమాక్స్ ఒకటే సరిపోదు. దానికి ముందు వెనుకా బలమైన సపోర్టింగ్ మెటీరియల్ ఉండాలి. సోడాలో ఇది మిస్ అయ్యింది.
ఏ సినిమా అయినా పదేళ్ల తర్వాత క్లాసిక్ అనిపించుకుని లాభం లేదు. ఇప్పుడు చూస్తున్న ఆడియన్స్ ని మెప్పించాలి. అప్పుడే సక్సెస్ అయినట్టు. కరుణ కుమార్ హీరో హీరోయిన్ కులాల మధ్య అంతరాన్ని బలంగా చెప్పలేనప్పుడు కనీసం పాత్రల మధ్య సంఘర్షణని, ఆసక్తి కలిగించేలా కొన్ని కీలక మలుపులను సెట్ చేసుకుని ఉంటే బాగుండేది. అక్కడక్కడా తప్ప మిగిలిన కథనమంతా ఈజీగా గెస్ చేసేలాగే సాగడం ఇందులో ప్రధానమైన మైనస్. అలా అని అన్నీ మైనస్సులు ఉన్నాయని కాదు. టెక్నికల్ గా కరుణ కుమార్ తన టీమ్ సహాయంతో తెరమీదకు మంచి క్వాలిటీనే ఇచ్చాడు. కానీ అది శెభాష్ అనిపించుకునే స్థాయిలో లేదు.
రంగస్థలం తరహాలో కమర్షియల్ రా డ్రామాను నడిపించాలనుకుంటే కనీసం అందులో ఏవి జనానికి కనెక్ట్ అయ్యాయో ఆలోచించాలి. అంతే తప్ప ఒక మీటర్ ప్రకారం లవ్ ట్రాక్, ఐటెం సాంగ్, ఫైట్ సీన్, హీరో విలన్ రెగ్యులర్ క్లాష్, సరదా ప్రేమకథ ఇలా ఊరికే రాసుకుంటూ వెళ్తే బ్యాలన్స్ తప్పే ప్రమాదం ఉంది. శ్రీదేవి సోడా సెంటర్ లో ఈ పొరపాటు జరిగింది. అయితే నేటివిటీని బాగా ప్రెజెంట్ చేసిన తీరు మరీ విసుగు రాకుండా చేసింది కానీ ల్యాగ్ విషయంలో ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బోర్ తగ్గి కాస్త ఊరట కలిగేది. సీరియస్ డ్రామాలను విపరీతంగా ఇష్టపడే వాళ్లకు ఈ సోడా ఓకే కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కి గొంతులో దిగడం కష్టమే
సంగీత దర్శకుడు మణిశర్మ స్థాయి పనితనం ఇందులో కనిపించలేదు. ఒకటి రెండు పాటలు పర్వాలేదు అనిపించినా కీలకమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో అక్కడక్కడా తప్పించి పెద్దగా మెరుపులు లేవు. ఏదో డెడ్ లైన్ పెట్టుకుని హడావిడి పడినట్టు అనిపిస్తుంది. శ్యామ్ దత్ సైనుద్దీన్ ఛాయాగ్రహణంకు డిస్టింక్షన్ మార్కులు ఇవ్వొచ్చు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ మొహమాటపడటం వల్ల లెన్త్ పెరిగిపోయింది. రామకృష్ణ మౌనిక ఆర్ట్ వర్క్ బాగుంది. సహజత్వం తీసుకొచ్చారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఖర్చు వెనుకాడకపోవడం వల్ల రిచ్ అవుట్ ఫుట్ తెరమీద కనిపించింది.
ప్లస్ గా అనిపించేవి
సుధీర్ బాబు
విజువల్స్
ఛాయాగ్రహణం
ప్రీ క్లైమాక్స్ షాక్
మైనస్ గా తోచేవి
సాగతీత సన్నివేశాలు
లవ్ ట్రాక్
ఫ్లాట్ గా వెళ్లే కథనం
పాటలు
కంక్లూజన్
కులం కార్డు ప్రేమకథలు ప్రతిసారి గొప్ప ఫలితాన్ని అందివ్వవు. స్టోరీ ఎంత రొటీన్ గా ఉన్నా ట్రీట్మెంట్ ఫ్రెష్ గా డిఫరెంట్ గా ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. అంతే తప్ప క్లైమాక్స్ ట్విస్ట్ ని నమ్ముకుని ముందుదంతా పాత పద్ధతిలో నడిపిస్తామంటే రెండున్నర గంటల పాటు ఆడియన్స్ దాన్ని అంగీకరించడం అంత సులభం కాదు. శ్రీదేవి సోడా సెంటర్ లో అన్ని అంశాలు ఉన్నట్టు అనిపించినా చివరిదాకా ఏదో మిస్సవుతోందన్న ఫీలింగ్ కలగడానికి కారణం ఇదే. అయినా కూడా పూర్తిగా బాలేదని అనిపించుకోదు కానీ కానీ టైటిల్ ని బట్టో లేక ట్రైలర్ ని బట్టో మరీ ఎక్కువ ఊహించేసుకుంటే మాత్రం నిరాశ తప్పదు
ఒక్కమాటలో – కూలింగ్ తగ్గిన సోడా
Also Read : రాజరాజ చోర రివ్యూ