iDreamPost
android-app
ios-app

Saamanyudu Review : సామాన్యుడు రివ్యూ

  • Published Feb 04, 2022 | 10:02 AM Updated Updated Feb 04, 2022 | 10:02 AM
Saamanyudu Review : సామాన్యుడు రివ్యూ

చాలా ఏళ్ళ క్రితం పందెం కోడితో సూపర్ హిట్ సాధించి ఇక్కడంటూ ఒక మార్కెట్ ఏర్పరుచుకున్న విశాల్ ఆ తర్వాత చేసిన కొన్ని మాస్ సినిమాలు మంచి మార్కెట్ ని తీసుకొచ్చాయి. కానీ వరస ఫ్లాపులు దాన్ని ఎక్కువ కాలం నిలబెట్టలేకపోయాయి. అయినా కూడా తన సినిమాలో ఏదో చెప్పుకోదగ్గ కంటెంట్ ఉంటుందన్న ప్రేక్షకుల నమ్మకం అంతో ఇంతో ఓపెనింగ్స్ ని తెస్తూనే ఉంది. గత ఏడాది చక్ర నిరాశపరిచినా వసూళ్లు మరీ దారుణంగా రాలేదు. ఈ నేపధ్యంలో అసలే అంచనాలు లేకుండా రిలీజైన సినిమా సామాన్యుడు. గతంలో జగపతిబాబు నటించిన హిట్ మూవీ టైటిల్ ఇది. మరి ఇది కొంతైనా మెప్పించేలా ఉందో లేదో రివ్యూలో చూద్దాం

కథ

స్విగ్గిలో డెలివరీ బాయ్ గా పని చేసే పోరస్(విశాల్)పోలీస్ ఉద్యోగం కోసం ప్రిపేరవుతూ ఉంటాడు. తండ్రి కానిస్టేబుల్. చెల్లెలు ద్వారక(రవీనా రవి) వీళ్ళుండే అపార్ట్మెంట్ లోనే ఓ అబ్బాయిని ప్రేమిస్తే అతనితోనే సంబంధం ఖాయం చేస్తారు. కెమికల్ ఫ్యాక్టరీ ద్వారా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న యజమాని(బాబురాజ్ జాకబ్)ఆగడాలకు వ్యతిరేకంగా నీలకంఠం పోరాటం చేస్తుంటాడు. అతన్ని హత్య చేసే క్రమంలో ద్వారకాను, ఆమె ప్రియుడిని కూడా చంపేస్తారు. దీంతో పోరస్ ఈ దుర్మార్గం వెనుక ముఠాను ఛేదించే క్రమంలో పద్మవ్యూహంలోకి దిగుతాడు. ఒక్కో తీగను పట్టుకుంటూ విలన్ ని చేరుకుంటాడు. ఆ తర్వాత జరిగేదే మీరు ఊహించేదే

నటీనటులు

విశాల్ మంచి నటుడే అయినప్పటికీ రాను రాను మరీ రొటీన్ అవుతున్నాడన్న మాట వాస్తవం. ప్రధాన కారణం అతను ఎంచుకుంటున్న కథలే. ఏదో అభిమన్యుడు ఆడేసింది కదాని పదే పదే అదే దారిలో వెళ్తే బోల్తా పడక తప్పదు. సామాన్యుడులో జరిగింది అదే. పాత్రలో ఎంత ఇంటెన్సిటీ ఉన్నా చాలా సార్లు చూసేసిన ఫీలింగ్ కలగడంతో ఏ దశలోనూ కనెక్ట్ కాకపోవడం విశాల్ యాక్టింగ్ ని ఫీల్ కాకుండా అడ్డుపడింది. పైగా ఇందులో విశాల్ ఎప్పుడూ కనిపించేంత ఎనర్జీతో లేడు. క్యారెక్టర్ డిమాండ్ చేసిందే అయినప్పటికీ అవసరం లేని సీన్లలో కూడా ఏదో పోగొట్టకున్నవాడిలా ముభావంగా అనిపిస్తాడు. బహుశా టేకింగ్ కూడా కారణం కావొచ్చు.

డింపుల్ హయతి మొక్కుబడిగా రెండు రొమాంటిక్ సీన్లు ఒక పాట కోసం తీసుకున్నారు. రెమ్యునరేషన్ ఇచ్చారు కాబట్టి సెకండ్ హాఫ్ లో అక్కడక్కడా కనిపించేలా మేనేజ్ చేశారు కానీ కేసుకు సంబంధించి ఒక చిన్న క్లూ కోసం తప్ప తనెందుకూ ఉపయోగపడలేదు. గ్లామర్ అండ్ ఎక్స్ ప్రెషన్లు రెండూ సోసోనే. విలన్ బాబురాజ్ జాకబ్ విగ్రహపుష్టిగా ఉన్నాడు. తలాతోకా లేని ఆ పాత్ర చిత్రణ డబ్బింగ్ తో మేనేజ్ అయిపోయింది. యోగిబాబు తన మీద పెట్టుకునే అంచనాలకు తగ్గట్టు అక్కడక్కడా నవ్వించాడు. సిరివెన్నెల గారి అబ్బాయి రవిని నెగటివ్ షేడ్స్ లో చూపించినా అది అంతగా అతకలేదు. తులసి తదితరులవి రెగ్యులర్ పాత్రలే

డైరెక్టర్ అండ్ టీమ్

ఒకప్పుడు ఏమో కానీ ఇప్పుడు మాత్రం ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లో ఏం చూపించినా ఓపికగా కూర్చునే పరిస్థితిలో లేరు. పాత చింతకాయ పచ్చడిని పదే పదే రుద్దుతామంటే ఆ మాత్రం దానికి హాలు దాకా ఎందుకు టీవీలోనో ఓటిటిలోనో చూసుకుంటాం కదా అంటారు. వందల కోట్ల మార్కెట్ ఉన్న స్టార్లు ఈ విషయంలో ఎక్కువ తక్కువ చేసినా ఫాలోయింగ్ సహాయంతోనో ఫ్యాన్స్ సపోర్ట్ తోనో గట్టెక్కిపోవచ్చు కానీ విశాల్ లాంటి హీరోలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఈ సామాన్యుడులో అదేమీ కనిపించదు. కేవలం రెండు మూడు ట్విస్టులు ఎగ్జైట్టింగ్ గా అనిపించి విశాల్ గుడ్డిగా ఓకె చెప్పినట్టు అనిపిస్తుంది సినిమా మొత్తం అయ్యాక.

దర్శకుడు తుపా శరవణన్ తీసుకున్న కథలో మచ్చుకైనా కొత్తదనం కనిపించదు. కొన్ని వందల సినిమాల్లో అరిగిపోయిన కెమికల్ ఫ్యాక్టరీ ప్రహసనానికి హీరో చెల్లెలి మర్డర్ ని లింక్ చేసి ఎవరూ ఊహించని ట్విస్టులు రాసుకున్నానని భ్రమపడ్డారు కాబోలు. కానీ తెరమీదకు వచ్చేటప్పటికీ జరిగింది వేరు. ఆడియన్స్ ని ఎంత కన్ఫ్యూజ్ చేస్తే అంత చిరాకు పుడుతుంది. ట్విస్టులతో థ్రిల్ చేయడమంటే అంత సులభం కాదు. దానికి చాలా హోమ్ వర్క్ చేయాలి. ఎక్కడిక్కడ లూజ్ ఎండ్స్ ని టైట్ చేసుకుంటూ పోవాలి. కానీ శరవణన్ ఎంతసేపూ ఒకే ట్విస్టుని పదే పదే తిప్పి విసిగిస్తున్నానని చూసుకోకపోవడం సినిమాని బాగా దెబ్బ తీసింది

ఇతని నాసిరకం టేస్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. హీరోయిన్ కి ఆమె తండ్రి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాడు. హీరో తన ఫ్రెండ్ తో కలిసి అక్కడి వచ్చి అమ్మాయిని బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లి కొన్ని శబ్దాలు వచ్చేలా చేస్తాడు. ఇవి విని సంబంధం కోసం వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు. కట్ చేస్తే సదరు హీరోయిన్ బయటికి చీర సర్దుకుంటూ తల్లి ముందుకు వచ్చి ఒక డబుల్ మీనింగ్ డైలాగు విసురుతుంది. చదవడానికే మీకేదోలా అనిపిస్తే ఈ సన్నివేశాన్ని చెప్పేటప్పుడు శరవణన్ ఎంత టాలెంట్ ఉపయోగించి వర్ణించి ఉంటాడో ఊహకందదు. ఇదేదో దారుణమని చెప్పడం లేదు. కేవలం నిడివి కోసం ఇలాంటి అర్థం లేని సీన్లను ఎందుకు ఇరికించాలి.

ఇన్వెస్టిగేషన్ ని బేస్ చేసుకుని క్రైమ్ థ్రిల్లర్ చూపించాలనుకున్నప్పుడు స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ గా ఉండాలి. సీన్లు రిపీట్ కాకూడదు. కానీ శరవణన్ ఏ దశలోనూ మెప్పించేలా చేయలేదు. కొన్ని లాజిక్స్ ని చాలా తేలికా వదిలేశాడు. హీరో తండ్రి స్వయానా పోలీస్ అయినప్పుడు అతని కూతురు తనకొచ్చిన సమస్యని నాన్నకు చెప్పే ప్రయత్నం చేయదు. పైగా హీరో ఇంటర్వెల్ అయ్యాక కూడా అటు ఇటు పరిగెత్తడం తప్ప తానుగా సాధించేది చేదించేది ఏమి ఉండదు. క్లైమాక్స్ కు ముందు ఓ హ్యకర్ వచ్చి ఫోన్ కాల్ రికార్డింగ్ ని తీసుకొచ్చే వరకు శూన్యంగానే ఉంటాడు. సడన్ గా కొన్ని సార్లు ఫైట్లు గట్రా చేస్తుంటాడు.

ఇక విశాల్ కు అతని చెల్లికి మధ్య ఎమోషన్ సరిగా ఎస్టాబ్లిష్ చేయకపోవడంతో ఆమె చనిపోయాక జరిగే తంతు సానుభూతి తేకపోగా ఇదంతా అవసరమా అనిపిస్తుంది. హీరో విలన్ ని చివరి దాకా కలపకుండా డ్రామా నడపాలనుకోవడం దగ్గరే శరవణన్ రాంగ్ స్టెప్ వేశాడు. ఏదో ధృవ టైపులో వెళ్తోందనుకున్నాడు కానీ అది కాస్తా జై చిరంజీవా లా నీరసం తెప్పించేసింది. కథ ఏదైనా అందులో మలుపులు బలం ఉండాలి. అంతే తప్ప వరసగా పాత్రలను చంపుకుంటూ పోయి హీరోని నిస్సహాయుడిని చేస్తే జనం ఎగ్జైట్ అవుతారనుకుంటే అది అమాయకత్వమే. ఈ సామాన్య అభిమన్యుడు అసలు పద్మవ్యూహంలోకి వెళ్లకుండానే ఓడిపోయాడు

యువన్ శంకర్ రాజా సంగీతంలో ఎలాంటి ప్రత్యేకత లేదు. తెలుగు వెర్షన్ రీ రికార్డింగ్ లోపమో ఏమిటో కానీ సంభాషణలు కొన్నిచోట్ల సింక్ సౌండ్ తరహాలో సరిగా వినిపించలేదు. బిజిఎమ్ కూడా సోసోనే. కెవిన్ రాజా ఛాయాగ్రహణం గురించి పెద్దగా చెప్పడానికి ఏమి లేదు. బడ్జెట్ పరిమితులు స్పష్టంగా కనిపించాయి. అందుకే రాజీ పడినట్టు అనిపిస్తుంది. ఎడిటర్ ఎస్ బి శ్రీకాంత్ ల్యాగ్ ని తగ్గించే ప్రయత్నం చేసి ఉంటే బాగుండేది. విశాల్ ఓన్ ప్రొడక్షన్ కావడంతో చాలా తెలివిగా ఖర్చుని కంట్రోల్ లో పెట్టేందుకు ప్రయత్నించారు. దాని వల్లే పెద్దగా రిచ్ నెస్ కానీ చెప్పుకోదగ్గ ప్రొడక్షన్ వేల్యూస్ కానీ కనిపించవు

ప్లస్ గా అనిపించేవి

చెప్పుకోదగ్గవి లేవు

మైనస్ గా తోచేవి

విపరీతమైన నిడివి
క్యారెక్టరైజేషన్లు
కన్ఫ్యూజ్ చేసే ట్విస్టులు
రొటీన్ కథా కథనాలు

కంక్లూజన్

విశాల్ సినిమాలంటే మాస్ కి మినిమమ్ గ్యారెంటీ అనే స్థాయిలో ఉండేవి. ఓసారి చూడొచ్చులే అనే అభిప్రాయంతో జనం థియేటర్ కు వచ్చేవాళ్ళు. కానీ క్రమంగా నవ్యత కోల్పోతున్న ఇతని చిత్రాలు యాక్షన్ డ్రామాలోనూ రొటీన్ కంటే కిందకు వెళ్తుండటం విచారకరం. తన ఇమేజ్ కి బాడీ లాంగ్వేజ్ కి తగ్గ కథలనే ఎంచుకుంటున్న విశాల్ వాటిలో సరైన పాళ్ళలో అన్ని అంశాలు ఉన్నాయో లేవో చెక్ చేసుకోవడం లేదు. ఫలితంగానే ఈ సామాన్యుడు లాంటి అతి సామాన్యమైన సినిమాలు వస్తున్నాయి. అతని వీరాభిమానులు అయితే తప్ప ఇంకే కారణమూ దీన్ని రికమండ్ చేయడానికి కనిపించడం లేదు. బెటర్ లక్ నెక్స్ట్ టైం

ఒక్క మాటలో – సరుకు లేని సామాన్యుడు

 Also Read : Good Luck Sakhi Review : గుడ్ లక్ సఖి రివ్యూ