Raj Mohan Reddy
Prabhas's Salaar Movie Review & Rating in Telugu: ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందంటే..
Prabhas's Salaar Movie Review & Rating in Telugu: ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందంటే..
Raj Mohan Reddy
పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. కెజీయఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం సలార్. డిసెంబర్ 22న విడుదలైన ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చింది. సలార్ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్, హిందీ భాషల్లో స్ట్రీమ్ అవుతోంది. మరి.. ఈ సలార్ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటోంది? ఓటీటీలో ఎలాంటి రికార్డులు బ్రేక్ చేయబోతోంది? ఇలాంటి అన్నీ విషయాలను ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
ముందుగా సలార్ కథ విషయానికి వస్తే.. దేవా(ప్రభాస్) తన తల్లితో(ఈశ్వరి రావు) కలిసి అస్సాంలోని ఓ మైన్స్ ఏరియాలో సాధారణ జీవితం గడుపుతూ ఉంటాడు. ఇలాంటి సమయంలో విదేశాల్లో ఉండే కృష్ణ కాంత్ కుమార్తె ఆధ్య (శృతి హాసన్) ఇండియాకి వస్తుంది. ఆధ్య తండ్రినిని చంపడానికి 7 ఏళ్లుగా ఎదురుచూస్తున్న గ్యాంగ్స్.. ఆధ్యని టార్గెట్ చేస్తాయి. ఇలాంటి సమయంలోఆధ్యని దేవా కాపాడాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే “కాన్సార్” నుండి వచ్చిన ట్రక్స్ దేవా కారణంగా ఆగిపోతాయి.
ఆ సమయంలోనే దేవాని చూసిన కాన్సార్ గ్యాంగ్ సైతం భయపడి పారిపోతారు. అక్కడ తన ట్రక్స్ ఆపింది దేవానే అన్న విషయం వరదాకి (పృథ్వీరాజ్) తెలుస్తుంది. ఇంతకీ అసలు దేవాకి “కాన్సార్” కి ఉన్న లింక్ ఏమిటి? వరదా స్నేహం కోసం దేవా ఏమి చేశాడు? దేవా కారణంగా “కాన్సార్” లో వచ్చిన మార్పులు ఏమిటి? వరదా తండ్రి రాజ మున్నార్ (జగపతిబాబు) దేవ గురించి తెలుసుకున్న నిజం ఏమిటి అన్నదే మిగిలిన కథ.
కొన్ని కథలు వింటే భయం వేస్తుంది. కొన్ని కథలు చూస్తే భయం వేస్తుంది. కానీ.. కొన్ని కథలు డైరెక్షన్ చేయాల్సి వస్తే దర్శకులకి భయం వేస్తుంది. అచ్చంగా సలార్ ఇలాంటి కథే. వెయ్యేళ్ళ చరిత్ర ఉన్న ఓ దారుణమైన ప్రాంతం, అక్కడ ఇద్దరి మధ్య అద్భుతమైన స్నేహం, ఆ మిత్రుడి కోసం పాతికేళ్ల తర్వాత.. అదే ప్రాంతంలోకి హీరో తిరిగి అడుగు పెట్టడం, ఇలాంటి కథలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరో అవ్వడం.. తలుచుకుంటేనే రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి. ప్రశాంత్ నీల్ ఈ ఎమోషన్ ని, ప్రభాస్ కటౌట్ ని నమ్ముకునే.. ధైర్యంగా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు. అవుట్ లైన్ లో హీరోయిన్ చుట్టూ ఉన్న కాంఫ్లిక్ట్ లోకి హీరో క్యారెక్టర్ ని ఎంటర్ చేయించి, ప్రశాంత్ నీల్ అక్కడ నుండి కథకి కావాల్సిన ఎమోషన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ రావడం మెచ్చుకోదగ్గ విషయం. దీంతో.. ఇంటర్వెల్ బ్యాంగ్ ఓ విస్ఫోటనంలా పేలింది. ముఖ్యంగా ఇక్కడ ప్రశాంత్ నీల్ మార్క్ టేకింగ్, గూస్ బంప్స్ తెప్పించే డైలాగ్స్ కి ప్రభాస్ మాస్ కటౌట్ యాడ్ కావడంతో ఇంటర్వెల్ సీక్వెన్స్ అదిరిపోయింది.
కాన్సార్ కథ చెప్పడానికే ప్రశాంత్ నీల్ ఫస్ట్ హాఫ్ ని ఎస్టాబ్లిష్ మెంట్ గా వాడుకున్నాడు. అయితే.. కథ కాన్సార్ లో అడుగు పెట్టగానే నీల్ మూవీని పరుగులు పెట్టించాడు. లెక్కకు మించిన క్యారెక్టర్స్, భారీ కాస్టింగ్ ఇంతకుమించిన భారీ సెట్టింగ్స్.. వీటన్నిటి మధ్య కథ, కథలోని ఎమోషన్ ట్రాక్ తప్పకుండా నీల్ మూవీని హ్యాండిల్ చేసిన విధానం బాగుంది. అయితే.. ఈ మొత్తం వ్యవహారంలో ప్రశాంత్ నీల్ కి వజ్రాయుధంగా దొరికింది మాత్రం ప్రభాస్ ఊర మాస్ లుక్ అండ్ యాక్షన్. ప్రభాస్ స్క్రీన్ పై అలా కనిపిస్తే చాలు.. ఎలాంటి ఎమోషన్ అయినా ఇట్టే పండుద్ది అని రాజమౌళి ఎందుకు అన్నారో సలార్ సినిమా చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఇందుకే బాహుబలి తర్వాత వచ్చిన ప్రభాస్ సినిమాల్లో సలార్.. ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ లాంటి మూవీ అని చెప్పుకోక తప్పదు.
కథ పరంగా చూసుకుంటే సలార్ చాలా పెద్దది. కచ్చితంగా దీన్ని రెండు పార్ట్స్ గా చెప్పాల్సిందే. కాకపోతే.. ఆ రెండు పార్ట్స్ అన్న నిబంధన మూవీలో కాస్త వేగాన్ని తగ్గించింది. అది కూడా జెన్యూన్ ఎమోషన్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి తీసుకునే సమయం. రెగ్యులర్ గా రాజమౌళి సినిమాలో కనిపించే ఈ ట్రీట్మెంట్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ కూడా ఫాలో అయ్యాడు. కాకుంటే.. ఈ ఒక్క విషయంలో మాత్రం జక్కన్నని మ్యాచ్ చేయలేకపోయాడు. కానీ.., ఏ యాక్షన్ సీక్వెన్స్ కోసం అయితే.. రెబల్ ఫ్యాన్స్ ఇన్నాళ్లు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో.. ఆ యాక్షన్ సీక్వెన్స్ లే సలార్ స్థాయిని పెంచాయి. అంటే..ఇందులో రెబలోడి ఊచకోత ఏ రేంజ్ లో సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ మాస్ క్యాలిక్యులేషన్ తెలుసు కాబట్టే.. ప్రశాంత్ నీల్ సలార్ కథని రెండు పార్ట్స్ గా చెప్పడానికి ధైర్యం చేసి సక్సెస్ అయ్యాడు.
సలార్ సినిమా మొత్తం మీద గొప్పగా చెప్పుకోవాల్సింది ప్రభాస్ నటన గురించే. పేరుకి దేవా అనేది ఒక క్యారెక్టర్ అయినా.. ఇందులో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. కథ అంతా తాను మోస్తూ.. ఎక్కడ ఏ మేరకు ఎమోషన్ పలికించాలో ప్రభాస్ అలా నటించి మెప్పించాడు. ప్రభాస్ తరువాత పృథ్విరాజ్ గురించి చెప్పుకోవాలి. వరద పాత్ర స్క్రీన్ స్పేస్ తక్కువే అయినా.. పృథ్వీరాజ్ సెటిల్డ్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. ఇక ఫస్ట్ ఆఫ్ లో శృతిహాసన్ ఎక్కువ సేపే కనిపించడంతో ఆమె క్యారెక్టర్ కూడా ఆకట్టుకుంది. ఇక జగపతిబాబు, బ్రహ్మాజీ, శ్రీయా రెడ్డి, వంటి వారు తమ నటనతో ఆకట్టుకున్నారు.
సలార్ మూవీ కథ పరంగా, ఎమోషనల్ గా ఎంత స్ట్రాంగ్ గా నిలిచిందో.. టెక్నీకల్ గా కూడా అంతే బలంగా ఉంది. భువన్ గౌడ సినిమాటోగ్రఫి, రవి బస్రూర్ మ్యూజిక్ సినిమా స్థాయిని పెంచేశాయి. ప్రధానంగా రవి బస్రూర్ బ్యాగ్రౌండ్ స్కోర్ కి మెంటల్ ఎక్కిపోద్ది. ఇలాంటి సినిమాలకి నిర్మాతలు ఎంత బలంగా నిలబడాలో హోంబలే బ్యానర్ మరోసారి ఋజువు చేసింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రశాంత్ నీల్.. కెజీయఫ్ ఫ్రాంచైజీతో తనకి దక్కిన సక్సెస్ కి కారణం లక్ కాదు, తన టాలెంట్ అని సలార్ తో నిరూపించుకున్నాడు.
చివరి మాట: సలార్ కటౌట్ కి తగ్గ సినిమా (అసలు కథ ఇకపై..)