నలుగురు నడిచే దారిలో అందరూ నడిస్తే ప్రపంచంలో ఇన్ని రకాల ఆలోచనలు ఎందుకు వుంటాయి.
నలుగురు నడిచే దారిలో అందరూ నడిస్తే ప్రపంచంలో ఇన్ని రకాల ఆలోచనలు ఎందుకు వుంటాయి.
వి రాజా
నలుగురు నడిచే దారిలో అందరూ నడిస్తే ప్రపంచంలో ఇన్ని రకాల ఆలోచనలు ఎందుకు వుంటాయి. చిత్రకళలో, నవల రచనలో, కవిత్వంలో భిన్న ధోరణులు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ సినిమా రూపకల్పనలో అంత వైవిధ్యం కనిపించదు. వైవిధ్యం లేదా అంటే వుంటుంది. ఎప్పుడో దశాబ్దానికి ఓసారి అన్నట్లు. ఎందుకంటే సినిమా మేకింగ్ అనేది వ్యాపారం కనుక, వ్యాపారంలో ప్రయోగాలు అంత సులువు కాదు కనుక.
అయినా వెంకటేష్ మహా లాంటి దర్ళకులు తమ తపన తీర్చుకోవడం కోసం అడపా దడపా ఇలాంటి సినిమాలు తీస్తుంటారు. కవిత్వంలో అధివాస్తవికత లేదా సర్రయలిస్టిక్ పోయెట్రీ ఎలా వుందో, చిత్రకళలో కూడా వుంది. కానీ సినిమాల్లో వుందా అంటే కాస్త ఎక్కువ ఆలోచించాల్సిందే. ముఖ్యంగా తెలుగు సినిమాల్లో. బాలీవుడ్ హర్రర్ సినిమా తుంబాడ్ లో ఈ సర్రయలిస్టిక్ ఛాయలు కొంత వరకు కనిపిస్తాయి.
ఈవారం విడుదలైన రావు బహదూర్ సినిమా పూర్తి స్థాయి అధివాస్తవిక చిత్రం అనుకోవచ్చు. చిన్న పాయింట్..ఓ అనుమానం పురుగు మెదడును దొలిస్తే..ఓ మనిషి జీవితం ఎలా ప్రభావితం అవుతుంది అన్న పాయింట్ తో తీసిన సినిమా. ఈ సినిమా తొలి సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ప్రతీ సీన్ వెనుక దర్శకుడి ఆలోచన ఏదో వుంటుంది. ప్రేక్షకుడు దాన్ని పట్టుకోవాలి. అప్పుడు నచ్చేస్తుంది సినిమా.
రావుబహదూర్ సినిమా మొత్తం కొత్తగా వుంటుంది. ఆ పాయింట్ పాతది కావచ్చు. కానీ ఆ పాయింట్ చుట్టూ అల్లిన సినిమా సరికొత్తది. కేవలం సినిమా కొత్తది అంటే సరిపోదు. సినిమా లైటింగ్ దగ్గర నుంచి నటన, గెటప్ లు, కెమేరా వర్క్, బ్యాక్ గ్రవుండ్ స్కోర్,ఇలా ప్రతి ఒక్కటీ కొత్తదే. సినిమాలో ఇలా ప్రతి ఒక్కటీ గమనిస్తే దర్శకుడు వెంకటేష్ మహా ఈ స్క్రిప్ట్ మీద ఎంతలా వర్క్ చేసారో అర్థం అవుతుంది.
ఇవ్వాళ రేపు ప్రతి ఒక్కరు పీరియాడిక్ సినిమా అంటూ రెడీ అవుతున్నారు. కేవలం గెటప్ లు, సెట్ ల వరకే చూసుకుంటారు. కానీ ఈ సినిమా స్పెషాలిటీ ఏమిటంటే సంభాషణల రచనలో, పలకడంలో కూడా పీరియాడిక్ టచ్ వుండడం.
సినిమా ఆరంభంలోనే అనుమానం పురుగు దొలిచేయడం, జడలు విప్పిన అనుమానం, చిన్న విత్తు కాస్తా కడవంత గుమ్మడికాయగా మారడం ఇవన్నీ కథ గురించి చెప్పేస్తాయి. పంజరంలో డ్యాన్స్ చేయడానికి ముందు హీరో ఓమాట అంటాడు..నన్నెందుకు పంజరంలోకి తోస్తారు అని. అంటే అప్పటికి అతగాడు అంత బ్రాడ్ గా వుంటాడు. పైగా పంజరంలో అతగాడు డ్యాన్స్ చేసిన డ్యాన్సర్ బాగా అంటే బాగా నల్లగా వుంటుంది. సినిమా కథ పూర్తిగా తెలిసిన తరువాత ఈ డ్యాన్సర్ ను దర్శకుడు ఎందుకు పెట్టాడు అన్నది అర్థం అవుతుంది. నిజానికి రెగ్యులర్ డ్యాన్సర్ లను పెట్టొచ్చు. ఆ టైమ్ కి హీరోకి ఈ కలర్ సమస్య లేదు అని చెప్పడం కోసం అనుకోవాలి.
అలా అక్కడ మొదలైన డీ కోడింగ్ సినిమా లాస్ట్ సీన్ వరకు అవసరం పడుతూనే వుంటుంది. మృత శరీరాన్ని కట్టె అని కూడా అంటారు. కాటికాపరి నోట..ఆ కట్టెకు కాదు..ఈ కట్టెకా? అని అనిపించడం వెనుక దర్శకుడి ఆలోచన అదే. కోర్ట్ వున్న ఊరికి విశ్వనాడు అని పేరు పెట్టడం, మనిషి రెండు కాళ్ల మీద నడిచి, ప్రపంచం చూడడం మొదలుపెట్టాకే అంతరాలు అని పేర్కొనడం, ఇలా చాలా చాలా వున్నాయి. చక్రవర్తుల కథలు చిన్న పిల్లలకు పాఠాలుగా చెప్పినంత కాలం పరిస్థితి మారదని చెప్పడం దర్శకుడి సామాజిక దృష్టి కోణానికి అద్దం పడుతుంది.
చూసిన జనాలకు తొలిసగం కన్నా మలిసగం ఎక్కువ నచ్చుతుంది. ఎందుకంటే తొలిసగం అంతా ప్రేక్షకుడికి ప్రాక్టీస్ సెషన్ అనుకోవాలి. ఇది దర్శకుడి విజన్, ఇది మ్యూజిక్ డైరక్టర్ స్టయిల్, ఇది ఈ తరహా సినిమా అని ఆకళింపు చేసుకోవడానికే అంత సమయం తీసుకుంటుంది. ఆ తరువాత సెకండాఫ్ లో ప్రేక్షకుడు వెయిట్ చూసి,తెలుసుకోవడానికి ఓ పాయింట్ అంటూ వుంటుంది. దాని చుట్టూ కథ నడవడం వుంటుంది. అందువల్ల మలిసగం ఎక్కువ నచ్చుతుంది.
ఈ సినిమా ఇంత స్లో టేకింగ్ ఎందుకు? ఇలాగే ఎందుకు తీయాలి? చిన్న పాయింట్ పట్టుకుని మూడు గంటలు సాగదీసారు అనే మాటలు చెప్పేవారికి సమాధానం ఒకటే.. ఇలా కూడా తీయచ్చు..అన్నదే దర్శకుడి ఆలోచన అనుకోవాలి. సినిమా ఆరంభంలో హీరో పాత్ర రొటీన్ అనిపిస్తుంది..తరువాత తరువాత ఇదెక్కడి మెంటల్ అనిపిస్తుంది. కానీ చివరకు వెళ్లే కొద్దీ చాలా తెలివైన పాత్ర అనిపిస్తుంది. అదే గమ్మత్తు.
ఇలా రాసుకుంటూ వెళ్తే చాలా అంటే చాలా వుంది. ఇంత కొత్తగా తీసిన సినిమాలో పాయింట్ పాదతే.. చివరకు ఇచ్చిన మెసేజ్ చాలా పాతదే..నాది నాది అనుకున్నది నీది కాదురా..చివరకు రాయన్నది రత్నమవునురా..అనే పాట చెప్పేదే ఈ సినిమా కూడా చెబుతుంది.
నటుడు సత్యదేవ్ అద్భుతంగా చేసాడు అని అందరూ అంటారు. కానీ సత్యదేవ్ మాత్రమే కాదు, సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా చేసారు. సినిమా కలర్, లైటింగ్ అలవాటైన సినిమాల మాదిరిగా వుండదు. బ్యాక్ గ్రవుండ్ స్కోర్ పూర్తిగా కొత్త శబ్దాలను వినిపిస్తుంది. మాటల్లో బలమైన అర్థాలు తొంగి చూస్తాయి.
కానీ ఇవన్నీ అనుభవించి పలవరించాలి అంటే అభిరుచి వుండాలి..ఓపిక వుండాలి. కష్టపడి, ఓపిగ్గా ఎంత లోతుకు తవ్వితే అంత మంచి నీరు దొరుకుతుంది..ఈ సినిమా కూడా అంత ఓపికగానూ చూడాల్సిందే.