iDreamPost
android-app
ios-app

నాగశౌర్య నటించిన ‘రంగబలి’ మూవీ రివ్యూ!

  • Author ajaykrishna Updated - 11:56 AM, Fri - 7 July 23
  • Author ajaykrishna Updated - 11:56 AM, Fri - 7 July 23
నాగశౌర్య నటించిన ‘రంగబలి’ మూవీ రివ్యూ!

యూత్ ని బాగా ఆకట్టుకునే టాలీవుడ్ యంగ్ హీరోలలో నాగశౌర్య ఒకరు. శౌర్య ఏ సినిమాతో వచ్చినా మినిమమ్ బజ్ అయితే క్రియేట్ అవుతుంది. క్లాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరైనప్పటికీ.. మెల్లగా మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడు. ఛలో మూవీ తర్వాత ఆ రేంజ్ కాకపోయినా ‘కృష్ణ వ్రిందా విహారి’ మూవీతో మెప్పించాడు. కానీ.. ఆ తర్వాత చేసిన ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. దీంతో ఇప్పుడు రంగబలి అనే యాక్షన్ కామెడీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తాజాగా థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమాని పవన్ బాసంశెట్టి అనే డెబ్యూ డైరెక్టర్ తెరకెక్కించారు. శౌర్య సరసన యుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది. మరి ట్రైలర్, సాంగ్స్ తో పాటు ప్రమోషన్స్ తోనూ బజ్ క్రియేట్ చేసుకున్న రంగబలి మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం!

కథ:

సొంతూరు రాజవరంలో అందరూ తనను చూడాలని పోజులు కొడుతూ బతికేస్తుంటాడు శౌర్య అలియాస్ షో(నాగశౌర్య). లోకల్ ఎమ్మెల్యే పరశురామ్(శైన్ టామ్ చాకో)తో మంచి పరిచయం ఉంటుంది. ఓవైపు శౌర్య తండ్రి విశ్వం (గోపరాజు రమణ) ఊర్లో మెడికల్ షాప్ నడుపుతుంటాడు. అయితే.. శౌర్య ఊర్లోని రంగబలి సెంటర్ కి వెళ్ళినప్పుడల్లా ఓ సంఘటన జరుగుతుంది. ఇంతలో ఓ పనిమీద వైజాగ్ కి వెళ్లిన శౌర్యకి మెడికల్ కాలేజీ స్టూడెంట్ సహజ(యుక్తి) పరిచయం అవుతుంది. ఆ తర్వాత పరిచయం ప్రేమగా మారుతుంది. కట్ చేస్తే.. వీరి ప్రేమకు ఊర్లోని రంగబలి సెంటర్ అడ్డు పడుతుంది. మరి శౌర్య లవ్ స్టోరీకి రంగబలి సెంటర్ ఎలా అడ్డు వచ్చింది? దానికి శౌర్య లవ్ కు ఉన్న లింకేంటి? చివరికి ఏమైంది? అనేది తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ:

రంగబలి మూవీ టీజర్ ట్రైలర్స్.. ప్రమోషన్స్ తో చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. హీరోకి తోడు కమెడియన్ సత్య తనదైన శైలిలో ప్రమోషన్స్ చేశాడు. ఇక సినిమా విషయానికి వస్తే.. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ, కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటుంది. ఎక్కడ బోర్ కొట్టకుండా దర్శకుడు పవన్ ఫస్టాఫ్ బాగానే రాసుకున్నాడు. అంటే.. కథలో కొత్తదనం కనిపించకపోయినా అలా సత్య కామెడీతో.. కొన్ని ఆకట్టుకునే సన్నివేశాలతో సాగిపోతుంది. అలా ఇంటర్వెల్ ట్విస్టు వరకు మూవీ సరదాగా సాగింది. అయితే.. అసలు చిక్కు సెకండాఫ్ లో మొదలవుతుంది.

క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్.. కథలో మోటివ్.. కామెడీ.. ఇలా ఫస్టాఫ్ ఎంజాయ్ చెసేలా ఉన్నా.. సెకండాఫ్ లో దర్శకుడు మూవీని పక్కదారి పట్టించాడని అనిపిస్తుంది. ముందు ఉన్న జోష్.. సెకండాఫ్ లో లేకపోవడం మైనస్ అయ్యిందనే చెప్పాలి. అందులోనూ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కూడా అంత ఆసక్తిగా చూపించలేదు. పైగా ఇదివరకే చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా హీరోలతో చెప్పించే సోషల్ మెసేజ్ లు ఇప్పుడున్న జనరేషన్ ఆడియన్స్ కి పెద్దగా ఎక్కవని చెప్పాలి. కానీ.. క్లైమాక్స్ కి వచ్చేసరికి డైరెక్టర్ హీరోతో అలాంటి పనే చేయించాడు. మంచిని స్ప్రెడ్ చేద్దాం అనే విధంగా డైరెక్టర్ ప్రయత్నాలు చేశాడు.

ఇక ఎప్పుడైనా సినిమా ఎండింగ్ కి వస్తుందంటే.. క్లైమాక్స్ లో నెక్స్ట్ లెవెల్ ఇంటరెస్ట్, రక్తికట్టించే సన్నివేశాలు పడాలి. రంగబలిలో క్లైమాక్స్ కి వచ్చేసరికి కొంచం డీలా పడిపోయిన ఫీలింగ్ వస్తుంది. అయితే.. హీరో శౌర్య, యుక్తిల మధ్య కెమిస్ట్రీ బాగుంది. కానీ.. సినిమానే చివరికి కరెక్ట్ రూట్ లో వెళ్ళలేదేమో అని ప్రేక్షకులకు అనిపిస్తుంది. పవన్ సిహెచ్ పాటలు పర్వాలేదు. అక్కడక్కడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. అయితే.. ఈ మూవీకి మేజర్ ప్లస్ సత్య కామెడీ. అతను లేకపోతే రంగబలి ఇంకాస్త బోర్ కొట్టేదేమో. కామెడీ పంచులు బాగున్నాయి.

ఇక సినిమాలో నటీనటులు అందరూ తమ తమ క్యారెక్టర్స్ కి న్యాయం చేశారు. కానీ.. దర్శకుడు పవన్ బాసంశెట్టి ఎంచుకున్న కథకు.. స్క్రిప్ట్ పరంగా న్యాయం జరగలేదేమో అనిపించింది. ఫస్టాఫ్ బాగా రాసుకున్నా సెకండాఫ్ లో విఫలం అయ్యాడు. ఇక సినిమా ఎడిటింగ్ లో కూడా సెకండాఫ్ లో అనవసరం అనిపించే సీన్స్ కట్ చేస్తే బాగుండేది. కెమెరా వర్క్, ఆర్ట్ వర్క్ బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి. శౌర్య మరోసారి తన కామెడీ, లుక్స్ తో ఆకట్టుకున్నాడు. అయితే.. ఇదేం కొత్త రకం పాత్ర కాదు. హీరోయిన్ యుక్తి ఓకే. కమెడియన్ సత్య ఈ సినిమాను గట్టెక్కించే ప్రయత్నం చేశాడని చెప్పాలి. మలయాళం నటుడు శైన్ టామ్ చాకో పాత్ర పర్వాలేదు.

ప్లస్ లు:

  • ఫస్టాఫ్
  • నాగ శౌర్య
  • కామెడీ

మైనస్ లు:

  • పట్టుతప్పిన కథనం
  • సెకండాఫ్

చివరిమాట: రంగబలి.. కామెడీ లేకుంటే నిజంగానే బలి!

రేటింగ్: 2/5

(నోట్ ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)