iDreamPost
android-app
ios-app

పాగల్ రివ్యూ

  • Published Aug 14, 2021 | 8:35 AM Updated Updated Aug 14, 2021 | 8:35 AM
పాగల్ రివ్యూ

ఈ సినిమా ఆడకపోతే నా పేరు మార్చుకుంటా, దీంతో మూసేసిన థియేటర్లన్నీ తెరుచుకుంటాయని స్టేజి మీద ఓపెన్ ఛాలెంజ్ చేసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న విశ్వక్ సేన్ నటించిన పాగల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లాక్ డౌన్ వల్ల వచ్చిన అనూహ్యమైన పరిస్థితుల వల్ల కెరీర్లోనే అతి పెద్ద రిలీజ్ దక్కించుకున్న ఈ హీరో దీని మీద ముందు నుంచి చాలా నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ వచ్చాడు. దిల్ రాజు ప్రొడక్షన్, గ్రాండ్ రిలీజ్, ట్రైలర్ కట్ యూత్ ని ఆకట్టుకునేలా ఉండటం లాంటి కారణాలు హైప్ పెరగడానికి కారణం అయ్యాయి. నరేష్ కుప్పిలి దర్శకత్వం వహించిన ఈ లవ్ డ్రామా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం

కథ

చిన్నతనంలోనే తల్లి(భూమిక)ని కోల్పోయిన ప్రేమ్(విశ్వక్ సేన్)ఆ ప్రేమను మళ్ళీ తన జీవితంలో రాబోయే అమ్మాయిలోనే దొరుకుతుందనే ఫ్రెండ్ సలహాతో హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తాడు. కానీ అక్కడ ముగ్గురితో బ్రేకప్ అయ్యాక ఇక లాభం లేదని స్థానికంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న రాజారెడ్డి(మురళీశర్మ)కు లవ్ ప్రపోజ్ చేసి షాక్ ఇస్తాడు. దానికి బదులుగా అవమానాలు దెబ్బలు కూడా తింటాడు. ఈ క్రమంలోనే ప్రేమ్ కో ఫ్లాష్ బ్యాక్ ఉందని అందులో తీర(నివేత పేతురాజ్)తో లవ్ స్టోరీ ఉందనే విషయం తెలుస్తుంది. ఈ చిక్కుముడులన్నీ తెలియాలంటే స్క్రీన్ మీద చూసేందుకు టికెట్ కొనాల్సిందే

నటీనటులు

యాక్టర్ గా విశ్వక్ సేన్ లో మంచి స్పార్క్ ఉంది. అది ఫలక్ నుమా దాస్ తో ప్రపంచానికి తెలిసింది. డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలి ఉండటం వల్ల హైట్ కాస్త తక్కువగా ఉన్న లోపాన్ని ఈజీగా మేనేజ్ చేసుకుంటున్నాడు. పాగల్ తనలో నటుడికి మరింత ఛాలెంజ్ విసిరిన పాత్రని చెప్పొచ్చు. కామెడీ, సెంటిమెంట్, ఎమోషన్స్ ఇలా అన్నీ కలగలసిన క్యారెక్టర్ దక్కడంతో తనవరకు ఏ లోపం లేకుండా సిన్సియర్ అవుట్ ఫుట్ ఇచ్చాడు. సెకండ్ హాఫ్ లో బరువైన సన్నివేశాల్లోనూ ఇబ్బంది లేకుండా నటించాడు. ప్రేమ్ ని ఎంత ప్రేమించి ఇష్టపడ్డాడో చాలా ఫ్రేమ్స్ లో అర్థమవుతుంది

సెకండ్ హాఫ్ లో ఎంట్రీ ఇచ్చే మెయిన్ హీరోయిన్ నివేత పేతురాజ్ కు మరీ గొప్పగా చెప్పుకునే గుర్తుంచుకునే పాత్ర కాదు కానీ ఉన్నంతలో తనకు దర్శకుడు చెప్పింది చేసుకుంటూ పోయింది. మొదటి సగంలో వచ్చే లవర్స్ గా సిమ్రాన్ చౌదరి, మేఘాలేఖలు ఒదిగిపోయారు. మురళీశర్మకు ఇది కాస్త డిఫరెంట్ టైపు కానీ అసలు ట్విస్ట్ రివీల్ అయ్యాక అదీ రొటీన్ గానే మారిపోతుంది. రాహుల్ రామకృష్ణ, మహేష్ ఆచంట తదితరులు కామెడీ కోసం పనికొచ్చారు. ఎక్కువ క్యాస్టింగ్ లేకపోవడంతో ఇంకెవరి ప్రస్తావన అక్కర్లేకుండా పోయింది. ఇదంతా విశ్వక్ సేన్ వన్ మ్యాన్ షోగా తీర్చిదిద్దారు

డైరెక్టర్ అండ్ టీమ్

దర్శకుడు నరేష్ కుప్పిలికి వచ్చిన ఆలోచన మంచిదే. అమ్మప్రేమకు ఏడేళ్ల వయసులోనే దూరమైన ఓ అనాథ దాన్ని భార్యగా వచ్చే అమ్మాయిలో రూపంలో దక్కించుకోవాలనే పాయింట్ లో వెయిట్ ఉంది. కానీ అది హీరోకి స్క్రిప్ట్ నెరేట్ చేస్తున్నప్పుడు ఎగ్జైట్ చేయడానికి పనికొచ్చిందేమో కానీ ఆ సింగల్ అజెండాతో రెండుగంటల ఇరవై నిమిషాలకు సరిపడా ఎంగేజింగ్ డ్రామాని పండించడానికి మాత్రం సరిపోలేదు. ప్రేమకథలను వినూత్నంగా చెప్పకపోయినా పర్లేదు కానీ వీలైనంత భావోద్వేగంతో చూపించేందుకు ప్రయత్నించాలి. అంతేకాని ఓ గంట సేపు లవ్ స్టోరీని సాగదీసినంత మాత్రాన ఆడియన్స్ ఆ ప్రేమను ఫీల్ కారు.

కథ ఎలాంటిదైనా మెయిన్ లీడ్స్ కు అందులోనూ ముఖ్యంగా హీరోకు క్యారెక్టరైజేషన్ చాలా ముఖ్యం. నరేష్ ఈ విషయంలో సరిగా శ్రద్ధ తీసుకోలేదనిపిస్తుంది. టిసిఎస్ లో నెలకు లక్ష రూపాయలు జాబు సంపాదించుకున్న హీరోకు కనీస తెలివితేటలు ఉండవు. దారిన పోయే ప్రతి అమ్మాయి తన అమ్మ ప్రేమను ఇస్తుందని అంత గుడ్డిగా ఎలా ఆలోచిస్తాడో ఎంత జుత్తు పీక్కున్నా అర్థం కాదు. పైగా స్నేహితులు ఏది చెబితే అది ఏ మాత్రం ఆలోచించకుండా ఫాలో అయిపోయే ఇతగాడిలో మినిమమ్ మెచ్యూరిటీ కూడా కనిపించదు. కాసేపు చంటిగా కాసేపు బొబ్బిలి రాజా రేంజ్ లో ఇలా ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతుంటాడు.

ఫస్ట్ హాఫ్ ని చాలా మటుకు కామెడీతో నెట్టుకొచ్చి ఇంటర్వెల్ లో చిన్న ఝలక్ ఇచ్చి బాగానే కట్ చేసిన నరేష్ కుప్పిలి నిస్సహాయత మొత్తం రెండో సగంలో కనిపిస్తుంది. ఇంకో ముఖ్యమైన ట్విస్టు(అదీ అంత గొప్పదేమీ కాదు)ని నమ్ముకుని మరీ ఎక్కువ సాగతీతకు వెళ్ళిపోయి ఎక్కడబడితే అక్కడ పాటలను ఇరికించి వీలైనంత సహనాన్ని పరీక్షిస్తాడు. ప్రేమ్ ని ఏదో అమరప్రేమికుడి స్థాయిలో చూపించాలనే తాపత్రయం ఎక్కువైపోయింది. అదే నిజమైతే రోడ్డు మీద పోయే అందరికీ గులాబీలు ఇచ్చి లవ్ చేయమని చెప్పడుగా. కనీసం తన తల్లికి సరితూగే లక్షణాలు వాళ్ళలో ఉన్నాయో లేదో చెక్ చేయాలిగా.

పాగల్ టైటిల్ కి జస్టిఫికేషన్ స్టోరీ కన్నా ఎక్కువగా మేకింగ్ లో జరిగింది. ప్రేమ్ తీరల మధ్య అంత బరువైన ఎమోషన్ ని రిజిస్టర్ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు చాలా బలమైన ట్రాక్ ఉండాలి. అదేమీ కనిపించదు. తీర ప్రవర్తన, క్షణానికో రకంగా మారిపోయే తీరు ఎన్నో ప్రశ్నలు లేవనెత్తి చిరాకు పుట్టిస్తుంది. దానికి సమాధానం తర్వాత చెప్పించారు కానీ అప్పటికే డ్యామేజ్ జరిగిపోయింది. ప్రీ క్లైమాక్స్ లో ఓపెన్ చేసే అసలు ట్విస్టు కూడా సోసోగానే పండింది. ఎమోషన్ అంటే సాగతీత సీన్లు, బరువైన డైలాగులు అనుకునే భ్రమలో నుంచి యంగ్ మేకర్స్ బయటికి రావాలి. ఇలాంటి పాగల్ లు హీరో కన్నా ఎక్కువ నష్టం చేసేది దర్శకులకే

రధన్ సంగీతం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంపోజర్ లియోన్ జేమ్స్ మంచి ఫీల్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ప్లేస్ మెంట్ వల్ల కొన్ని పాటలు ఎక్కలేదు కానీ జేమ్స్ పనితనంలో మాత్రం పెద్దగా మైనస్సులు లేవు. మణికందన్ ఛాయాగ్రహణం కూడా క్వాలిటీకి బాగా తోడ్పడింది. గ్యారీ ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్ గా ఉంటే సెకండ్ హాఫ్ బోర్ డం కాస్తయినా తగ్గేది. విజయ్ బిన్నీ స్టెప్పులు విశ్వక్ కు తగ్గట్టు నీట్ గా ఉన్నాయి. ఫస్ట్ సాంగ్ కు దీని వల్లే ప్లస్ అయ్యింది. నిర్మాణ విలువలు ఓకే. బెక్కం వేణుగోపాల్ రిస్క్ లేని సబ్జెక్టు కాబట్టి నీట్ గా ఖర్చు పెట్టుకున్నారు. దిల్ రాజు తోడయ్యారు కాబట్టి ఇంక చెప్పేదేముంది

ప్లస్ గా అనిపించేవి

విశ్వక్ పెర్ఫార్మన్స్
సంగీతం
ఇంటర్వెల్ బ్లాక్
ఫస్ట్ హాఫ్ కామెడీ కొంత

మైనస్ గా తోచేవి

సెకండ్ హాఫ్
సాగతీత
ఎమోషన్ లేని లవ్ స్టోరీ
నివేత పేతురాజ్ ఎపిసోడ్

కంక్లూజన్

ఎలాంటి ప్రేమకథైనా కనీస భావోద్వేగాలు, పాత్రలకు సంబంధించిన ఔచిత్యాలు సరిగా లేకపోతే అవి తెరమీద పండవు సరికదా ఎన్నో డౌట్లు రేకెత్తించి చివరికి ఉస్సూరుమనిపిస్తాయి. దురదృష్టవశాత్తు పాగల్ అదే కోవలోకి వచ్చింది. లైట్ కామెడీతో అక్కడక్కడా టైం పాస్ చేయించినప్పటికీ అసలైన ఎమోషన్ విషయంలో చేతులెత్తేయడంతో లవ్ స్టోరీ కాస్తా లౌడ్ స్టోరీగా మారిపోయింది. తను ఇష్టపడి కష్టపడి చేసిన పాత్ర కాబట్టి విశ్వక్ సేన్ కాన్ఫిడెన్స్ ని తప్పుబట్టడానికి లేదు కానీ మరీ సవాళ్లు చేసి మూసేసిన థియేటర్లన్నీ దీని దెబ్బకు తెరుచుకుంటాయని బిల్డప్ ఇచ్చుకునే రేంజ్ అయితే పాగల్ ది సగం కూడా కాదు

ఒక్కమాటలో – సౌండ్ ఎక్కువ సరుకు తక్కువ

Also Read : SR కళ్యాణ మండపం రివ్యూ