Janaka Aithe Ganaka Review: జనక అయితే గనుక మూవీ రివ్యూ

Janaka Aithe Ganaka Telugu Movie Review & Rating: సుహాస్ ఇప్పుడు మినిమం గ్యారెంటీ హీరో. అలాగే కథలు కొత్తగా ఎంచుకుంటూ ఉంటాడు. అలాంటి సుహాస్ నుంచి ఇప్పుడు ఒక డిఫరెంట్ కథ వచ్చింది. మరి.. ఆ మూవీ ఎలా ఉందో తెలియాలంటే ఈ రివ్యూ చూసేయండి.

Janaka Aithe Ganaka Telugu Movie Review & Rating: సుహాస్ ఇప్పుడు మినిమం గ్యారెంటీ హీరో. అలాగే కథలు కొత్తగా ఎంచుకుంటూ ఉంటాడు. అలాంటి సుహాస్ నుంచి ఇప్పుడు ఒక డిఫరెంట్ కథ వచ్చింది. మరి.. ఆ మూవీ ఎలా ఉందో తెలియాలంటే ఈ రివ్యూ చూసేయండి.

జనక అయితే గనుక

10/10/2024, కామెడీ, 2h 18m U/A
U/A
  • నటినటులు:సుహాస్, సంగీర్థన, వెన్నెల కిషోర్, తదితరులు
  • దర్శకత్వం:సందీప్ రెడ్డి బండ్ల
  • నిర్మాత:దిల్ రాజు, హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి
  • సంగీతం:విజయ్ బుల్గానిన్
  • సినిమాటోగ్రఫీ:సాయి శ్రీరామ్

Rating

3

సుహాస్.. టాలీవుడ్ సూపర్ ఫాస్ట్ గా దూసుకెళ్తున్న యంగ్ అండ్ టాలెండ్ హీరో. మినిమం గ్యారెంటీ హీరో అనే ట్యాగ్ కూడా అందుకున్నాడు. ఏడాదికి మూడు సినిమాల చొప్పున జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఈ ఏడాది హీరోగా, మల్టీస్టారర్ లో, క్యామియోలతో కలిపి ఏకంగా నాలుగు సినిమాలు చేసేశాడు. ఇప్పుడు జనక అయితే గనుక అనే విభిన్నమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కథ ఇప్పటి యువతకు సరిగ్గా సరిపోతుంది. మరి.. అలాంటి ఒక ప్రయోగాత్మక చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? సుహాస్ మరోసారి తన జడ్జిమెంట్ కరెక్ట్ అని నిరూపించుకున్నాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ రివ్యూలో చూద్దాం.

కథ:

ప్రసాద్(సుహాస్) మధ్య తరగతి వ్యక్తి. తండ్రి తనకు బెస్ట్ ఇవ్వలేకపోతాడు. దీంతో.. తాను మాత్రం తన పిల్లలకి అన్నీ విషయాల్లో ది బెస్ట్ ఇవ్వాలి.. లేకుంటే పిల్లల్ని కనడం అనవసరం అనే ఒక నిర్ణయానికి వస్తాడు. 30 వేల జీతానికి పని చేసే ప్రసాద్ ది బెస్ట్ ఇచ్చే స్థోమత ఉండదు. అందుకే పెళ్లై రెండేళ్ళు అవుతున్నా పిల్లలు వద్దు అనుకుని జీవిస్తూ ఉంటాడు. ప్రసాద్ భార్య(సంగీత విపిన్) ఈ నిర్ణయానికి అంగీకరిస్తుంది కూడా. ప్రసాద్ తండ్రి (గోపరాజు రమణ) కూడా ఈ విషయంలో సైలెంట్ అయిపోతాడు. అయితే అనూహ్యంగా ప్రసాద్ భార్యకి ప్రెగ్నెన్సీ వస్తుంది. దీంతో.. కండోమ్ సరిగ్గా పని చేయలేదని ఆ కంపెనీ పై కేసు వేస్తాడు ప్రసాద్. తరువాత ఈ కేసు ఏ టర్న్ తీసుకుంది. ప్రసాద్ లైఫ్ లో ఎలాంటి మార్పులు వచ్చాయి? చివరికి ఈ కేసు ఎవరు గెలిచారు? ఇలాంటి ప్రశ్నలకి సమాధానమే జనక అయితే గనుక కథ.

విశ్లేషణ:

కొన్నిసార్లు ఒక చిన్న ఐడియా ఒక మంచి కథను అందిస్తాయి. అలాంటి ఒక ఐడియా డైరెక్టర్ కు వచ్చింది. ఒక కండోమ్ కంపెనీ మీద కేసు వేయడం అనే పాయింట్ చాలా కొత్తగా ఉంది. అయితే ఆ చిన్న ఆలోచనను పెద్ద కథగా మలచడంలోనే అసలు ప్రతిభ కనిపిస్తుంది. ఈ విషయంలో మంచి మార్కులే పడతాయి. అయితే అంత పర్ఫెక్ట్ గా ఉందా? అంటే చిన్న చిన్న మైనస్లు కూడా లేకపోలేదు. ఓవరాల్ ఎక్స్ పీరియన్స్ లో మాత్రం అంత పెద్ద మైనస్ లు కనిపించవు. ముఖ్యంగా ఈ రోజుల్లో ఇలాంటి కథ యువతకు చాలా అవసరం. ప్రసాద్ లాగానే ఖర్చులకు భయపడి పిల్లలను కనకుండా ఉంటున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారికి ఈ సినిమా ఒక మెసేజ్ లా కూడా ఉపయోగపడుతుంది.

ట్రైలర్ లోనే మీకు కథలో ఉండే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఎంటో తెలిసిపోయింది. అలాంటి సమయంలో డైరెక్టర్ ఎంత వేగంగా ఆ పాయింట్ ని రివీల్ చేస్తే అంత బాగుంటుంది. కథ కూడా పరుగులు పెట్టిన ఫీలింగ్ వస్తుంది. కానీ, ఈ విషయంలో మాత్రం కాస్త డైరెక్టర్ సందీప్ రెడ్డి బండ్ల కాస్త సమయం తీసుకుంటాడు. ఇంటర్వెల్ సమయానికి గానీ అసలు విషయం తెలియదు. అలాగని మొదటి నుంచి బోర్ గా ఉందా అంటే.. అలా ఏం లేదు. సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకునేలాగే ఉంది. ముఖ్యంగా ఖర్చులకు భయపడి.. ప్రసాద్ పిల్లల కనే విషయాన్ని దాటేయడం ఆకట్టుకుంటుంది. భర్త చెప్పిన మాటకు తల ఊపిన ఆ ఇల్లాలు కూడా అందరినీ మెప్పిస్తుంది. అయితే ప్రసాద్ క్యారెక్టర్లో మాత్రం పిల్లలు అంటే ఖర్చు మాత్రమే అన్నట్లు చూపించడం కొంతమందికి నచ్చకపోవచ్చు. పిల్లలు అంటే బరువు కాదు.. బాధ్యత అని అందరికీ తెలిసిందే. ఫస్ట్ హాఫ్ మాత్రం కాస్త సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది.

మీకు సెకండాఫ్ లో మురళీ శర్మ ఎంట్రీ ఇచ్చాక డ్రామా ఇంకాస్త రక్తి కడుతుంది. న్యాయమూర్తిగా రాజేంద్ర ప్రసాద్ ఎంట్రీతో కథలో ఇంకాస్త ఫన్ జనరేట్ అవుతుంది. ఎలాగూ వెన్నెల కిషోర్ ఉండనే ఉన్నాడు. నవ్వులు పూయించడంలో బాగానే సక్సెస్ అయ్యారు. అయితే ఈ కథ ప్రకారం రూపాయి నష్టపరిహారం చెల్లించినా కూడా కేసు ఓడిపోయినట్లే అవుతుంది. అలాంటి సమయంలో కోటి కాదు.. 5 లక్షలు ఇస్తాను అనడం మాత్రం రైటింగ్ పరంగా కాస్త వీక్ పాయింట్ లా కనిపిస్తుంది. అంతేకాకుండా.. వంశంలో విన్నర్స్ లేరు.. అందరూ లూజర్సే.. అలాంటప్పుడు పిల్లల్ని కనడం ఎందుకు అనే వాదన లాజిక్ కి కాస్త దూరంగా అనిపిస్తుంది. కానీ, ఓవరాల్ ఎక్స్ పీరియన్స్ లో మాత్రం జనక అయితే గనుక మెప్పిస్తుంది. సినిమా చివర్లో బామ్మ అదిరిపోయే ట్విస్ట్ ఇస్తుంది. అది మాత్రం ఇప్పుడు చెప్తే స్పాయిలర్ అవుతుంది. అందుకే మీరు సినిమా చూసి తెలుసుకోండి.

నటీనటులు- టెక్నికల్ విభాగం పనితీరు:

ఇలాంటి మధ్యతరగతి పాత్రలు చేయడం సుహాస్ కు వెన్నతో పెట్టిన విద్య. నిజానికి ఇలాంటి పాత్రలు ఇప్పటికే చాలానే చేశాడు. తన నటనతో ప్రేక్షకులను మరోసారి మెప్పించేశాడు. పిల్లలు వద్దు అని మంకు పట్టు పట్టిన వాడు.. తండ్రైతే ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపించేశాడు. ప్రసాద్ పాత్రలో జీవించేశాడు. సంగీర్థన విపిన్ తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చేస్తుంది. భర్త చెప్పిన మాటను జవదాటని ఇల్లాలిగా ఆమె నటన ఆకట్టుకుంటుంది. తన పాత్ర పరిధి మేరకు ఎక్కడా డిజప్పాయింట్ చేయలేదు. రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ పాత్రలు మెప్పిస్తాయి. అందరూ తమ పాత్ర మేరకు మెప్పిస్తారు. కథ విషయంలో డైరెక్టర్ సందీప్ రెడ్డి బండ్ల వంద మార్కులు కొట్టేశాడు. సినిమాని చాలా కొత్తగా రాసుకున్నాడు. కాకపోతే ఫస్ట్ హాఫ్ మీద ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. కొన్ని పాయింట్స్ మరీ ఫోర్స్డ్ గా ఉండటం కూడా కొందరిని ఇబ్బంది పెట్టచ్చు. సినిమాకి విజయ్ బుల్గానిన్ నేపథ్య సంగీతం మెప్పిస్తుంది. కానీ, పాటలు మాత్రం మూవీకి మైనస్ గా మిగిలిపోయాయి. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ మెప్పిస్తుంది. నిర్మాణ విలువలు మెప్పిస్తాయి.

ప్లస్ లు:

  • కొత్త కథ కావడం
  • సుహాస్ నటన
  • వెన్నెల కిషోర్ కామెడీ
  • గుడ్ రైటింగ్
  • బీజిఎం

మైనస్:

  • కొన్ని పాయింట్స్ ఫోర్స్డ్ గా అనిపించడం
  • ఫస్ట్ ఆఫ్ లో కాస్త ల్యాగ్
  • పాటలు

చివరిగా: పెళ్లైన ప్రసాద్.. కచ్చితంగా అలరిస్తాడు..

(*గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)
Show comments