Raj Mohan Reddy
HanuMan (2023) Movie Review & Rating in Telugu: తేజ సజ్జ- ప్రశాంత్ వర్మ కాంబోలో.. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన హనుమాన్ సినిమా ఎలా ఉందో తెలియాలంటే ఈ రివ్యూ చదివేయండి.
HanuMan (2023) Movie Review & Rating in Telugu: తేజ సజ్జ- ప్రశాంత్ వర్మ కాంబోలో.. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన హనుమాన్ సినిమా ఎలా ఉందో తెలియాలంటే ఈ రివ్యూ చదివేయండి.
Raj Mohan Reddy
హనుమాన్.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాని, సినీ ప్రేక్షకులను ఒక ఊపు ఊపేస్తున్న పేరు ఇది. వర్సటైల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన మొట్ట మొదటి భారతీయ సూపర్ హీరో మూవీగా హనుమాన్ విడుదలైంది. మరి ఎంతో పోటీ నడుమ సంక్రాంతి సినిమా అనిపించుకోవడానికి ప్రేక్షకుల ముందుకి వచ్చిన “హనుమాన్” మూవీ ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
సముద్ర తీర ప్రాంతంలో ఉండే అంజనాద్రి అని ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరిలో అల్లరి, చిల్లరిగా తిరుగుతూ, చిన్న చిన్న దొంగతనాలు చేసే దొంగ హనుమంతు( తేజ సజ్జ) అతనిని ప్రాణంగా చూసుకునే అక్క అంజమ్మ(వరలక్ష్మి శరత్ కుమార్). హీరో ప్రాణంగా ప్రేమించే అమ్మాయి మీనాక్షి( అమృత అయ్యర్). అత్యంత బలహీనుడైన హనుమంతు.. మీనాక్షి ప్రాణాలు కాపాడటానికి ప్రయత్నించి ప్రాణాల మీదకి తెచ్చుకుంటాడు. ఆ ప్రమాదంలోనే హనుమంతుకి.. ఆ హనుమాన్ శక్తులు సిద్ధిస్తాయి. చిన్ననాటి నుండి సూపర్ హీరో అవ్వాలని తహతహలాడే మైఖెల్(వినయ్ రాయ్) ఈ విషయం తెలుసుకుని అంజనాద్రి గ్రామంలోకి ఎంటర్ అవుతాడు. అసలు హనుమంతుకి ఆ ప్రమాదంలో హనుమన్ శక్తులు ఎలా వచ్చాయి? అతన్ని వెనుక ఉండి నడిపించిన శక్తి ఏమిటి? ఆ సూపర్ హీరో పవర్స్ కోసం ప్రయత్నించిన మైఖెల్ ఏమయ్యాడు? అసలు.. శ్రీరామ చంద్రమూర్తికి ఆ హనుమంతుడు ఇచ్చిన మాట ఏమిటి? అన్నదే మిగిలిన కథ.
సూపర్ హీరో మూవీస్.. ఇండియన్ సినీ ప్రేక్షకులకి అంతగా పరిచయం లేని జానర్. కానీ.., మన అందరికీ తెలిసిన రియల్ సూపర్ హీరో మాత్రం ఒకరు ఉన్నారు. ఆయనే మన హనుమాన్. ఆ అంజనీ సుతుడి బలం గురించి, శక్తి గురించి, ఆయన దైర్యం గురించి, ఆయన సాధించిన విజయాల గురించి వింటూ పెరిగిన వాళ్ళం మనం. అలాంటి ఓ మహా బలశాలి ఆరా చుట్టూ.. సూపర్ హీరో కాన్సెప్ట్ కథ అల్లుకోవడంతోనే ప్రశాంత్ వర్మ సగం సక్సెస్ అయిపోయాడు. నిజానికి మనం ఇప్పటి వరకు మార్వెల్ యూనివర్స్ లో చూస్తూ వచ్చిన స్పైడర్ మ్యాన్, ఐరెన్ మ్యాన్, యాంట్ మ్యాన్, హల్క్.. వీరంతా కూడా మన హనుమాన్ లోని ఒక్కో సూపర్ పవర్ ని మాత్రమే కలిగి ఉంటారు. అలాంటిది ఏకంగా ఆ హను మానే సూపర్ హీరోగా కదిలొస్తే అనే ఆలోచన ప్రేక్షకులకి కిక్ ఇవ్వక ఇంకేం చేస్తుంది? హనుమాన్ మూవీ ఆసాంతం ఈ మ్యాజిక్ సూపర్ గా వర్కౌట్ అయ్యింది.
దర్శకుడు హనుమాన్ సినిమా కోసం ఏ విధంగా అయితే భారీ తారాగణాన్ని ఎంచుకోలేదో, ఆ కథ బ్యాక్డ్రాప్ విషయంలో కూడా అంతే సింపుల్ గా వెళ్ళిపోయాడు. టైటిల్స్ కార్డు సమయంలోనే మూవీ సోల్ పాయింట్ పాట రూపంలో చెప్పేయడంతో.. హీరో క్యారెక్టర్ ని, అంజనాద్రి ఊరి పరిస్థితులను ఎస్టాబ్లిష్ చేయడానికి తీసుకున్న సమయం అంతగా ల్యాగ్ అనిపించదు. ఇక అక్కడ నుండి ఆలస్యం చేయకుండా హీరోకి సూపర్ పవర్స్ వచ్చేలా చూపించడం, దానికి ఆడియన్ కూడా అగ్రీ అయ్యేలా బిల్డప్ షాట్స్ పెట్టడం, సరిగ్గా కాంఫ్లిక్ట్ పాయింట్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ ముగించడం, వీటన్నిటికీ తోడు ఒక ఇంట్రెస్టింగ్ లవ్ ట్రాక్ తో ఫస్ట్ ఆఫ్ అంతా ఆకట్టుకునేలా సాగింది.
సూపర్ హీరో మూవీస్ లో ఓ బేసిక్ రూల్ ఉంటుంది. హీరోకి పవర్స్ వచ్చే వరకు ఎంతో సహనంతో కథతో ట్రావెల్ అయ్యే ఆడియన్.. ఒక్కసారి ఆ ఫేజ్ దాటాక కచ్చితంగా ఎక్స్ ట్రీమ్ ఎలిమెంట్స్ కోరుకుంటాడు. దీన్నే సినీ భాషలో మూడ్ ఆఫ్ ది ఆడిటోరియం అంటారు. తెలుగులో ఒక్క రాజమౌళి మాత్రమే ఈ సూత్రాన్ని ఫాలో అవుతూ.. స్క్రీన్ ప్లే నడిపిస్తూ ఉంటాడు. కానీ.., సరిగ్గా ఇక్కడే దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా కాస్త తడబడ్డాడు. హనుమంతుకి పవర్స్ వచ్చాక, ఆ పవర్ ఎక్కడ నుండి వస్తుందో మైఖెల్ కి అర్థం అయ్యాక కూడా కథ వేగం అందుకోదు.
పైగా.. ఆ సమయంలో అక్కడక్కడ వచ్చి పోయే లవ్ సీన్స్ ఇంకాస్త భారంగా మారాయి. దీంతో.. ఆ 20 నిమిషాల్లో హనుమాన్ ట్రాక్ తప్పిందా అన్న అనుమానం కలుగుతుంది. కానీ.., ఎప్పుడైతే సముద్రఖని క్యారెక్టర్ రివీల్ అవుతుందో అక్కడ నుండి హనుమాన్ అంచనాలు అందుకోలేని స్థాయికి వెళ్లిపోతాయి. ఇంత హైప్ ఇచ్చిన ప్రీ క్లైమాక్స్ కి తగ్గట్టే.. క్లైమాక్స్ మనసు, తనువు పులకించిపోయే రేంజ్ లో ఉండటంతో హనుమాన్.. సక్సెస్ ట్రాక్ ఎక్కేసింది.
హనుమాన్ మూవీలో నటన విషయానికి వస్తే.. తేజ సజ్జ ప్రాణం పెట్టేశాడు. ఇతన్నేనా మనం ఇన్నాళ్లు చైల్డ్ యాక్టర్ గా, చిన్న హీరోగా చూసింది అని ఆశ్చర్యపోయే రీతిలో తేజ మెప్పించాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే హనుమంతు పాత్రలో పరకాయ ప్రవేశం చేసేశాడు. ఇక అంజమ్మ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ మెరుపులు మెరిపించింది. అమృత అయ్యర్ క్యారెక్టర్ కి కథతో ప్రమేయం లేకున్నా, తనకి దొరికిన స్క్రీన్ స్పేస్ బాగానే వాడుకుంది. ఇక గెటప్ శ్రీను, సత్య, వెన్నెల కిషోర్ వంటి వారు హనుమాన్ మూవీకి బాగా ప్లస్ అయ్యారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సముద్రఖని. ఆయన స్వామీజీ పాత్రలో కెరీర్ బెస్ట్ ఇచ్చేశాడు. సెకండ్ ఆఫ్ లో సముద్రఖని క్యారెక్టర్.. కార్తికేయ-2 లో అనుపమ్ ఖేర్ క్యారెక్టర్ రేంజ్ లో పేలడం విశేషం.
హనుమాన్ మూవీ కథ పరంగా ఎంత సాలిడ్ గా ఉందో.. టెక్నికల్ గా టీమ్ వర్క్ అంతే బాగా సెట్ అయ్యింది. ఈ విషయంలో ముందుగా చెప్పుకోవాల్సింది సీజీ వర్క్ గురించే. మూవీలో ఎక్కడైతే హనుమాన్ రిఫరెన్స్ ఉందో.. ఆ షాట్స్ అన్నిట్లో బెస్ట్ సిజీ వర్క్ కనిపించింది. ఇదే హనుమాన్ సక్సెస్ కి పెద్ద ఎసెట్ అయ్యింది. ఇక దాశరథి శివేంద్ర కెమెరా వర్క్ అన్ మ్యాచ్ బుల్. గతంలో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన కల్కి మూవీకి ఈయనే సినిమాటోగ్రాఫర్. దీంతో.. ప్రశాంత్ వర్మ విజన్ ని అందుకోవడంలో దాశరథి శివేంద్ర సూపర్ సక్సెస్ అయ్యారు. ఇక ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, గౌరహరి, కృష్ణ సౌరభ్ మ్యూజిక్ అందించారు. సాంగ్స్ ఓకే అనిపించుకోగా, బీజీఎమ్ మాత్రం సినిమాకి ప్రాణం పోసేసింది. ఇక దర్శకుడిగా ప్రశాంత్ వర్మ స్థాయి హనుమాన్ తో ఆకాశమంత పెరిగింది అని చెప్పుకోవడానికి ఎలాంటి సంకోచం అవసరం లేదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి. హేట్సాఫ్ టూ యువర్ గట్స్ . ఓ మంచి ఐడియా కోసం ఇంత బలంగా నిలబడి, ఇంత మందిని ముందుకి నడిపించడం అంటే మాటలు కాదు. హేట్సాఫ్ టూ యూ వన్స్ అగైన్.
చివరి మాట: హనుమాన్.. 2024 సంక్రాంతి తొలి హిట్ బొమ్మ
రేటింగ్: 3/5
ఇదీ చదవండి: మహేశ్ బాబు గుంటూరు కారం మూవీ రివ్యూ