iDreamPost
android-app
ios-app

యూపీ సీఎంగా యోగి -37 ఏళ్ల తర్వాత ..

  • Published Mar 25, 2022 | 4:33 PM Updated Updated Mar 25, 2022 | 5:05 PM
యూపీ సీఎంగా యోగి -37 ఏళ్ల తర్వాత ..

ఉత్తరప్రదేశ్ నిరంతరం రాజకీయ అస్థిరతతో నలిగిపోతుండేది. స్వాతంత్ర్యానికి ముందు నుంచీ రాష్ట్రంలో అధికారం చెలాయించిన కాంగ్రెస్, జనతా, జనతాదళ్, బీజేపీ పార్టీలు ఏ ముఖ్యమంత్రినీ పూర్తిస్థాయిలో పనిచేయనివ్వలేదు. ఏడాది రెండేళ్లకు సీఎంలను మార్చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. స్థిరమైన ప్రభుత్వాలు లేకపోవడం వల్ల అనేకసార్లు రాష్ట్రపతి పాలన కూడా ఆ రాష్ట్ర ప్రజలు అనుభవించాల్సి వచ్చింది. 2007 తర్వాత ముఖ్యమంత్రులు అయిన మాయావతి, అఖిలేష్ యాదవ్ ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకోగలిగినా.. వరుసగా రెండోసారి సీఎంలు కాలేకపోయారు. వీటన్నింటినీ బ్రేక్ చేసిన ఘనతను యోగి ఆదిత్యనాథ్ సొంతం చేసుకున్నారు. ఒక టర్మ్ పదవీకాలం పూర్తిచేసుకుని.. దానికి కొనసాగింపుగా మళ్లీ రెండోసారి సీఎం కావడం ఆయనకే సాధ్యం అయ్యింది. 37 ఏళ్ల క్రితం నారాయణ దత్ తివారీ (ఎన్డీ తివారీ) వరుసగా రెండుసార్లు సీఎంగా చేసినా.. పూర్తికాలం పదవిలో కొనసాగలేక పోయారు.

అనూహ్యంగా తెరపైకి యోగి

తాజా ఎన్నికల్లో యూపీలో బీజేపీ కూటమి 273 స్థానాలతో మళ్లీ అధికారంలోకి రాగా యోగి ఆదిత్యనాథ్ రెండోసారి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణస్వీకారం చేశారు. 2017లో యోగి అనూహ్యంగా తెరపైకి వచ్చారు. ఆనాటి ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం అయ్యింది. సీఎంగా ఎవరిని ఎంపిక చేయాలన్న తర్జన భర్జనల్లో ఎవరూ ఊహించని విధంగా యోగి పేరు ప్రస్తావనకు వచ్చి.. చివరికి ఆయనే సీఎం పీఠం అధిష్టించారు. అప్పటికి ఆయన గోరఖ్ పూర్ ఎంపీగా ఉన్నారు. ఎంపీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఐదేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే బీజేపీ కూటమి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధం కాగా బీజేపీ నాయకత్వం కూడా యోగికే మళ్లీ సీఎం పదవికి ఎంపిక చేసింది.

యూపీ చరిత్రలో ఇదే తొలిసారి

ఐదేళ్లు సీఎంగా ఉన్న నేత.. వరుసగా రెండోసారి ఆ పదవి చేపట్టడం ఇదే తొలిసారి. 2007కు ముందు యూపీ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఐదేళ్ల పూర్తి కాలం పదవిలో కొనసాగలేదు. గతంలో గోవింద్ వల్లబ్ పంత్ 1946 నుంచి 1954 మధ్య మూడుసార్లు, ఎన్డీ తివారీ 1984-1985 సంవత్సరాల్లో వరుసగా రెండుసార్లు సీఎం పదవులు చేపట్టినా వారు ఏ ఒక్క టర్మ్ లోనూ పూర్తికాలం పనిచేయలేదు. అలాగే 2007 ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి సీఎం అయ్యి 2012 వరకు పూర్తి కాలం పనిచేసినా ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో బీఎస్పీ ఓడిపోవడంతో వరుసగా రెండోసారి సీఎం కాలేకపోయారు. 2012 ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ గెలవడంతో అఖిలేష్ యాదవ్ సీఎం అయ్యి పూర్తి ఐదేళ్లు ఆ పదవిలో ఉన్నా.. 2017 ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఓడి అధికారాన్ని కోల్పోయారు. 2017లో సీఎం అయిన యోగి మాత్రం తాజా ఎన్నికల్లో సీట్లు తగ్గినా అధికారాన్ని కాపాడుకోవడమే కాకుండా రెండోసారి సీఎం పీఠం అధిష్టించి సరికొత్త చరిత్ర లిఖించారు.