iDreamPost
android-app
ios-app

యోగి ప్రమాణస్వీకారానికి ముందే రంగంలోకి బుల్డోజర్లు..

యోగి  ప్రమాణస్వీకారానికి ముందే రంగంలోకి బుల్డోజర్లు..

ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారానికి ముందే బుల్డోజర్లు రంగంలోకి దిగాయి. మీరట్‌లోని ట్రాన్స్‌పోర్ట్ నగర్‌లో, ఒక గ్యాంగ్ స్టర్ అక్రమ ఆస్తిని మంగళవారం కూల్చివేసింది. ప్రభుత్వ భూమిని మాఫియా కబ్జా చేసి కోట్ల ఆస్తులు కూడబెట్టింది. ముందు నుంచి గ్యాంగ్ స్టర్ లను టార్గెట్ చేస్తూ వస్తున్న యోగి ఈ ఎన్నికల ప్రచారంలో బుల్డోజర్లను మరమ్మత్తుల కోసం పంపారని, మార్చి 10న మరోసారి పని ప్రారంభిస్తామని ప్రకటించారు. ఆయన చెప్పినట్లుగానే యుపిలో బీజేపీ ప్రభుత్వం మరోసారి ఇంకా ఏర్పడకుండానే నేరస్థులను అదుపులో పెట్టడం కోసం వారు అక్రమంగా సంపాదించిన వాటిని స్వాధీనం చేసుకోవడం, కట్టడాలని కూల్చడానికి బుల్డోజర్లు రంగంలోకి దిగాయి.

ఈ క్రమంలో, టిపి నగర్‌లోని జగన్నాథపురిలో, కరుడుగట్టిన నేరస్థుడు, మోస్ట్ వాంటెడ్ బాదన్ సింగ్ బద్దోకి ఉన్న కొన్ని దుకాణాలను పోలీసు యంత్రాంగం మరియు ఎండిఎ బృందం బుల్‌డోజర్‌ లతో ధ్వంసం చేశారు. వారు షాపులు నిర్మించిన స్థలం పార్క్ భూమి అని పోలీసులు చెబుతున్నారు. మీరట్‌ పోలీసులు మాట్లాడుతూ.. ‘క్రమక్రమంగా ల్యాండ్‌ మాఫియా దానిని ఆక్రమించి భవనాన్ని నిర్మించింది. అతిపెద్ద ల్యాండ్ ను బదన్ సింగ్ బద్దో మరియు అతని సహచరులు స్వాధీనం చేసుకున్నారు. అందులో వారు రేణు గుప్తా పేరుతో ఇక్కడ ఒక భవనాన్ని నిర్మించారు. అయితే మీరట్ డెవలప్‌మెంట్ అథారిటీ అది చట్టబద్దం కాదని తేల్చడంతో పాటు కూల్చివేయాలని ఆదేశించింది అని అన్నారు.

పార్కు స్థలంలో నిర్మించిన అక్రమ భవనాన్ని కూల్చివేసేందుకు చర్యలు తీసుకున్నామని మీరట్ పోలీసులు తెలిపారు. గతంలో కాన్పూర్‌లో చెరువు భూమి ఆక్రమణలను తొలగించేందుకు ఈ బుల్‌డోజర్లను నడిపారు. చెరువు భూమిని అక్రమంగా ఆక్రమించారని ఆరోపిస్తూ 1750 చదరపు మీటర్ల స్థలంలో ల్యాండ్ మాఫియా చేసిన అక్రమ నిర్మాణాన్ని కాన్పూర్ డెవలప్‌మెంట్ అథారిటీ (కెడిఎ) బృందం కూల్చివేసింది. ఈ భూమిని ల్యాండ్ మాఫియాడాన్ విష్ణు కుమార్ యాదవ్ అలియాస్ పంగు యాదవ్ అక్రమంగా ఆక్రమించాడని, అతనికి సమాజ్ వాదీ పార్టీతో సంబంధం ఉందని చెబుతున్నారు. ఆ మధ్య ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌తో విష్ణు ఉన్న చిత్రం కూడా బయటకు వచ్చింది. ఇక మరిన్ని అక్రమ కట్టడాల మీద కూడా యోగి సర్కార్ ద్రుష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది.