iDreamPost
android-app
ios-app

విష ప్రచారం ఉధృతం చేసిన పచ్చ మీడియా, వైసీపీ ఎలా ఎదుర్కుంటుందో

  • Published Mar 13, 2022 | 11:08 AM Updated Updated Mar 13, 2022 | 12:29 PM
విష ప్రచారం ఉధృతం చేసిన పచ్చ మీడియా, వైసీపీ ఎలా ఎదుర్కుంటుందో

ఏపీలో ప్రభుత్వం ఏంచేసినా నేరమే. అదేపని తెలంగాణా ప్రభుత్వం చేస్తే దానిని సమర్ధించాల్సిందే. ఇదీ పచ్చమీడియా కి గీటురాయి. చంద్రబాబు హయాంలో జరిగిన ప్రతీ ఘోరాన్ని సమర్ధించడం, జగన్ చేసిన మంచిపనిని కూడా భూతద్దం పెట్టి వెదుకుతూ తప్పుబట్టడం. ఇదీ వారికి తెలిసిన జర్నలిజం. ఇప్పటికే మూడేళ్లుగా ఇదే తంతు సాగుతోంది. వాటికి ఉదాహరణలు కావాలంటే ఎన్నో చూడవచ్చు. వందల్లో ఉంటాయి. ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టగానే అందులో అప్పుల గురించి మాత్రమే ప్రస్తావించడం, తెలంగాణా ప్రభుత్వంలో కేటాయింపులను హైలెట్ చేయడం అందుకో ఉదాహరణ. అంతేగాకుండా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు కూడా ఏవో అడ్డంకులంటూ ప్రజల్లో అపోహలు కల్పించే ప్రయత్నం చేయడం అందుకు కొనసాగింది. ఇదంతా ఓ పథకం ప్రకారం సాగించే ప్రచారం. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే లక్ష్యంలో భాగం..

వైఎస్సార్సీపీ కూడా దీనిని ఎప్పుడో గ్రహించింది. జగన్ స్వయంగా తాను చంద్రబాబుతో మాత్రమే పోరాడడం లేదని, అతని వెనుక ఉన్న పచ్చమీడియా మాఫియాతో తలపడుతున్నానని కూడా ప్రజలకు ఎప్పుడో చెప్పారు. దానికి తగ్గట్టుగా విరుగుడు ప్రయత్నాలు చేశారు. పుష్కర కాలంగా దానిని కొనసాగిస్తున్నారు. 2019లో ఫలితం దక్కించుకున్నారు. పచ్చ మీడియా ప్రచార పటోటపాల్ని ఎదురించి విజయబావుటా ఎగురవేశారు.

ప్రస్తుతం ఏపీలో ముందస్తు ఎన్నికల ఫీవర్ టీడీపీని ఆవరించింది. త్వరలో ఎప్పుడయినా ఎన్నికలు రావచ్చని ఆ పార్టీ భావిస్తోంది. దానికి తగ్గట్టుగా సన్నాహాలు చేస్తోంది. చివరకు ఆ దూకుడు వ్యూహం అదుపుతప్పి గవర్నర్ ని అడ్డుకునేయత్నం వరకూ వెళ్లింది. విపక్షాన్ని జనం వేలెత్తిచూపేందుకు కారణమయ్యింది. ఇక తాజాగా పచ్చమీడియాని కూడా ముందస్తు జ్వరం తాకింది. దానికి తగ్గట్టుగా జగన్ ప్రభుత్వాన్ని జనంలో పలుచన చేయాలనే సంకల్పంతో సాగుతోంది. అందుకు అనుగుణంగా వికృత పోకడలతో విషప్రచారం సాగిస్తోంది. దూకుడుగా తన దాడి సాగిస్తోంది. ఏపీ ప్రభుత్వాన్ని ఎండగట్టడమే లక్ష్యంగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.

గతంలో పచ్చమీడియాను ఎదుర్కోవడంలో సోషల్ మీడియా శ్రేణుల ద్వారా వైఎస్సార్సీపీ ఎదురదాడికి దిగింది. అది ఫలించి విజయం దక్కడంతో గడిచిన రెండున్నరేళ్లుగా కొంత దూకుడు తగ్గించినట్లు కనిపిస్తోంది,మరోవైవు పచ్చ మీడియా పురివిప్పింది. రెచ్చిపోయి అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టే పనిసాగిస్తోంది. దాంతో మరోసారి తన అస్త్రాలకు పదునుపెట్టే పనిలో వైఎస్సార్ సీపీ పడింది. సోషల్ మీడియాలో వాలంటీర్లను సన్నద్ధం చేసే దిశలో యత్నాలు మొదలెట్టింది. పార్టీ కార్యాలయంలో సమావేశాలు నిర్వహిస్తోంది. స్వయంగా విజయసాయిరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. అధినేత ఆదేశాలకు తగ్గట్టుగా పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని క్రియాశీలకం చేసే పనిలో ఉన్నారు. ఇష్టారాజ్యంగా అన్నింటికీ వక్రభాష్యాలు వల్లించే పచ్చమీడియా ప్రభావాన్ని ఎదుర్కోవడానికి అదే మంచి మార్గం అని వైఎస్సార్సీపీ అంచనా వేస్తోంది. దాంతో పచ్చ మీడియా ప్రచార ఉధృతిని అధికార పార్టీ శ్రేణులు ఏ రీతిలో అడ్డుకుంటారో చూడాలి.