iDreamPost
android-app
ios-app

సభ్యత్వంలోనూ రికార్డుకు వైసీపీ ప్లాన్‌

సభ్యత్వంలోనూ రికార్డుకు వైసీపీ ప్లాన్‌

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) ఆది నుంచీ రాజకీయంగా సంచలనాలను సృష్టిస్తోంది. ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సారథ్యంలో అద్భుత ఫలితాలను సాధిస్తోంది. 125 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్‌ పార్టీని ఎదిరించి మార్చి 11, 2011లో జగన్‌ వైఎస్‌ఆర్‌సీపీని ప్రారంభించారు. పార్టీ స్థాపన అనంతరం రెండోసారి జరిగిన ఎన్నికల్లోనే ఎనభై శాతం సీట్లు, యాభై ఒక శాతం ఓట్లతో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. అధికారంలోకి వచ్చింది. ఇక అప్పటి నుంచీ ఎదురులేకుండా ఆ పార్టీ పల్లె, పట్టణం తేడా లేకుండా అన్ని చోట్లా విజయ విహారం చేస్తూ రికార్డులు సృష్టిస్తోంది.

ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జగన్మోహన్‌ రెడ్డి మొదటి నుంచీ సంచలన నిర్ణయాలతో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. మొదటి మూడు నెలల్లోనే సుమారు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి యువత మదిలో గూడుకట్టుకున్నారు. విప్లవాత్మక నిర్ణయాలు, చారిత్రాత్మక చట్టాల రూపకల్పన ద్వారా జగన్‌ రియల్‌ హీరో అనిపించుకున్నారు. సంక్షేమ పథకాల అమలులో అగ్రతాంబూలం అందుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించి చరిత్ర సృష్టించారు. గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థల ద్వారా ప్రభుత్వ పథకాలు ప్రజల ఇంటి వద్దకు చేరేలా చేశారు.

సీఎం జగన్‌ అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలతో వైఎస్సార్‌సీపీ తిరుగులేని శక్తిగా అవతరించింది. రాష్ట్రంలో ఉన్న పథకాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవని నిరూపించుకుంది. జగన్‌ తనదైన వ్యూహాలతో పార్టీని, ప్రభుత్వాన్ని నడిపిస్తున్న తీరు అందరి ప్రశంసలూ అందుకుంటోంది. ఫలితంగా ప్రతీ ఎన్నికలోనూ ఆ పార్టీ అభ్యర్థులు ఘనవిజయాలు సాధిస్తున్నారు. ఫలితాల్లో వైసీపీ రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పుడు సభ్యత్వ నమోదులో కూడా రికార్డు సాధించేందుకు ఆ పార్టీ భారీప్లాన్‌ చేస్తోంది. సహజంగానే వైసీపీపై ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. ఇప్పుడు ప్రతీ కార్యకర్త సీఎం జగన్‌ అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి అత్యధిక మందిని సభ్యులుగా చేర్చేలా ఆ పార్టీ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు.

వైఎస్సార్‌సీపీ సభ్యత్వ నమోదు త్వరలో ప్రారంభమవుతుందని, ప్రజల్లో పార్టీకి ఉన్న ఆదరణ సభ్యత్వంలో ప్రతిఫలించాలని వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల ఇన్‌ఛార్జి విజయసాయిరెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. మూడు దశాబ్దాల పాటు అధికారంలో ఉండేలా పార్టీని సీఎం జగన్‌ పటిష్టం చేశారని, ఇందులో కార్యకర్తల పాత్ర క్రియాశీలకంగా ఉందని చెప్పారు. కార్యకర్తలు సహా చైర్మన్లు, డైరెక్టర్లు, సర్పంచులు, జెడ్‌పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు.. ఇలా అందరూ సభ్యత్వ నమోదును ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. ఇప్పటికే ఏపీలో తెలుగుదేశం, జనసేన సభ్యత్వ నమోదును ప్రారంభించాయి. ఇప్పుడు వైసీపీ కూడా సభ్యత్వ నమోదుపై దృష్టి సారించడం ఆసక్తిగా మారింది.