iDreamPost
iDreamPost
రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో నవరత్నాల పేరుతో ఇచ్చిన హామీ మేరకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ప్రజాసంకల్ప యాత్రలోనూ, ఎన్నికల ప్రచారంలోనూ ఇచ్చిన హామీ ప్రకారం సీఎం జగన్ సంక్షేమం, అభివృద్ధి ప్రధాన అజెండాగా పాలన సాగిస్తున్నారు. కరోనా సంక్షోభ సమయంలోనూ సంక్షేమానికి లోటు లేకుండా చూసిన జగన్ అధికారంలో ఉన్నంతకాలం ఈ పథకాలకు ఢోకా ఉండదని తేటతెల్లమైంది. కానీ వీటిపై ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం చేస్తున్న అల్లరి, అదేపనిగా విషం చిమ్ముతుండటాన్ని చూస్తుంటే.. ఒకవేళ ఖర్మ కాలి టీడీపీ అధికారంలోకి వస్తే ఈ పథకాలు, పేదలకు చేకూర్చుతున్న ఆర్థిక ప్రయోజనాలు నిలిచిపోతాయన్న భయం, అనుమానాలు బలపడుతున్నాయి. ఒంగోలు సభలో సీఎం జగన్ చేసిన ప్రసంగం.. దానికి మహిళలు స్పందించిన తీరు చూస్తే వారిలో ఆ భయం ఉందన్నది స్పష్టం అయ్యింది.
సంక్షేమ పథకాలు ఆపేయాలా?
ఎన్నికల్లో నేరుగా వైఎస్సార్సీపీని ఎదుర్కోలేక చతికిలపడిన టీడీపీ జగన్ ప్రభుత్వంపై అదేపనిగా విషంచిమ్ముతూ ప్రజల్లో వ్యతిరేకత పెరిగేలా కుట్రలు పన్నుతోంది. సంక్షేమ పథకాల వల్లే రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీస్తోందని, అవి కొనసాగితే ఆంధ్ర రాష్ట్రం కూడా శ్రీలంకలా తయారవుతుందని చంద్రబాబు బ్యాచ్ ఆరోపించడమే కాకుండా తమ అనుకూల పత్రికల్లో నిరంతరం వార్తాకథనాలు రాయిస్తోంది. వీటిపై సీఎం జగన్ ఒంగోలులో జరిగిన సున్నా వడ్డీ పథకం సభలో నేరుగా ఎదురుదాడి చేశారు. టీడీపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 35 నెలలుగా సంక్షేమ పథకాలకు రూ. 1,36,694 కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. ఈ పథకాల వల్లే రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతింటోందని చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అంటే ఈ పథకాలన్నింటినీ ఆపేయాలని వారు కోరుకుంటున్నట్లుగా ఉందని వ్యాఖ్యానిస్తూ.. వాటిని ఆపేయమంటారా? అని సభలో పాల్గొన్న మహిళలను ప్రశ్నించారు. దానికి సమాధానంగా పథకాలు కొనసాగాలని వారంతా ముక్తకంఠంతో నినదించారు. ఈ ఘటన రాష్ట్ర ప్రజల్లో టీడీపీ తీరుపై అనుమానాలు రేకెత్తించింది. ఇప్పుడే ఇంత విషప్రచారం చేస్తున్న టీడీపీ ఒకవేళ అధికారంలోకి వస్తే ప్రస్తుతం అమలు అవుతున్న సంక్షేమ పథకాలను ఏదో సాకుతో నిలిపివేస్తుందన్న చర్చ, భయం మొదలైంది.
అన్ని వర్గాలకు సంక్షేమం
జగన్ సీఎం అయిన వెంటనే సంక్షేమ అజెండాను భుజానికెత్తుకున్నారు. నవరత్నాల్లో భాగంగా అమ్మఒడి, విద్యా దీవెన, రైతు భరోసా, ఆసరా, చేయూత, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, సున్నావడ్డీ తదితర అనేక పథకాల రూపంలో సమాజంలోని దాదాపు అన్ని వర్గాల ప్రజలకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుస్తున్నారు. దాదాపు ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం ద్వారా లబ్ది చేకూరుతోంది. కరోనా సంక్షోభంలో రాష్ట్ర ఆదాయం పడిపోయినా సంక్షేమ పథకాలను నిర్విఘ్నంగా కొనసాగించారు. దాని వల్లే కరోనా కాలంలో ఉపాధి కోల్పోయి ఆదాయం లేకపోయినా జగనన్న సంక్షేమ పథకాలు ఆదరువుగా నిలిచాయి. ఫలితంగా రాష్ట్ర ప్రజల గుండెల్లో జగన్ స్థానాన్ని సుస్థిరం చేశాయి. ఇదే టీడీపీ కంటగింపునకు కారణమైంది. చాలా పథకాలను అడ్డుకోవడానికి ప్రయత్నించి విఫలమైన టీడీపీ నేతలు చివరికి ఆ పథకాల వల్లే రాష్ట్రం దివాలా తీస్తోందని తప్పుడు ప్రచారానికి తెగబడుతున్నారు. ప్రజలకు మేలు జరగకుండా పథకాల పీక నొక్కడానికి కుట్రలు పన్నుతున్నారు. ఇదే విషయాన్ని జగన్ బట్టబయలు చేయడంతో టీడీపీ దురుద్దేశం ప్రజలకు అవగతం అవుతోంది. ఇప్పుడే ఇన్ని విమర్శలు చేస్తూ అడ్డంకులు సృష్టిస్తున్న తెలుగుదేశం నేతలకు అధికారం ఇస్తే మొత్తం పథకాలకే ఎసరు పెడతారని చర్చించుకుంటున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు క్షేత్రస్థాయిలో ఇదే విషయం చెప్పేందుకు ఉద్యుక్తులవుతున్నారు.