Idream media
Idream media
“జస్ట్ 25 కోట్లు చెల్లిస్తే.. పెగాసస్ సాఫ్ట్‌వేర్ ఇస్తామంటూ మాకు మూడేళ్ల క్రితమే ఆఫర్ వచ్చింది. కానీ రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకునే పెగాసస్‌ను మా ప్రభుత్వం వ్యతిరేకించింది, అయితే ఇదే టైమ్‌లో చంద్రబాబు అప్పట్లో ఈ స్పైవేర్ వాడారు.”
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఇటీవల ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇది టీడీపీకి మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది. దొరికిందే తడవుగా పెగాసస్ వ్యవహారంపై హౌస్ కమిటీ వేయాలని ఏపీ అసెంబ్లీ తీర్మానించింది. నేడో, రేపో దీనికి సంబంధించి కమిటీ సభ్యులను స్పీకర్ ప్రకటిస్తారు. ఇది ఏపీ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలను సృష్టిస్తోంది. ప్రధానంగా ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలో కలవరపాటు మొదలైంది.
పెగాసెస్ పై హౌస్ కమిటీ, జుడీషియరీ కమిటీ లేదా సీబీఐ విచారణ ఇలా దేనికైనా సిద్ధమంటూ ప్రకటనలు చేస్తున్న టీడీపీ నేతలు మరి ఎందుకు ఇంతలా ఉలిక్కిపడుతున్నారు, ఒకరి వెంట మరొకరు దీనిపై ఎందుకు స్టేట్మెంట్ లు ఇస్తున్నారు, అనే ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అసలు మమత ఈ వ్యాఖ్యలు చేశారా.. అని ప్రశ్నిస్తూనే విషయాన్ని పక్కదారి పట్టించేందుకు టీడీపీ విపరీతంగా ప్రయత్నిస్తోందని వరుస ప్రకటనలు తెలియజేస్తున్నాయి.
నాటి చంద్రబాబు ప్రభుత్వం పెగాసస్ కొనలేదని స్వయంగా నీ సవాంగన్నే చెప్పారు జగన్ రెడ్డి.. అంటూ అయ్యన్న, మమతా బెనర్జీ అసెంబ్లీలో మాట్లాడారా..? లేదా..? అనే క్లారిటీ ఇప్పటికీ లేదంటూ లోకేషన్న.. ఇలా ఒకరి తర్వాత మరొకరు హౌస్ కమిటీ ప్రకటన అనంతరం స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మమత అన్నట్లుగా మూడు నాలుగు రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఇప్పటివరకూ స్పందించని టీడీపీ నేతలు పెగాసస్ వ్యవహారంపై అసెంబ్లీలో హౌస్ కమిటీ ప్రకటన అనంతరం మాత్రం ఆదుర్దా మొదలైనట్లు కనిపిస్తోంది. ఈ విషయంలో మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కూడా రంగంలోకి దిగిపోయారు. టీడీపీ హయాంలో పెగాసెస్ కొనలేదని చెప్పడమే కాదు.. పరువు నష్టం దావా కూడా వేస్తామని ప్రకటించారు.
ఇక టీడీపీ అనుకూల మీడియా కూడా విషయాన్ని పక్కదారి పట్టించేందుకు కథనాలు అల్లేసింది. సారా కంపు కడిగేసేందుకే పెగాసస్ రచ్చ అంటూ డిబేట్లు మొదలుపెట్టింది. గతంలో దేశాన్ని కుదిపేసిన పెగాసస్.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీని కుదిపేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పెగాసస్ వ్యవహారంపై హౌస్ కమిటీ వేస్తే టీడీపీకి భయమెందుకని మంత్రి కన్నబాబు ప్రశ్నించారు. ‘తప్పు చేశాం.. ప్రాయశ్చిత్తం చేసుకుందాం’ అని కూడా టీడీపీకి లేదని విమర్శిస్తున్నారు.