iDreamPost
android-app
ios-app

నితీష్ కు రాజ్యసభపై ఆసక్తి ఎందుకో?

  • Published Mar 31, 2022 | 5:07 PM Updated Updated Mar 31, 2022 | 5:29 PM
నితీష్ కు రాజ్యసభపై ఆసక్తి ఎందుకో?

అవకాశం ఉంటే రాజ్యసభకు వెళ్లాలని ఉంది. కానీ సీఎంగా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఏం జరుగుతుందో చెప్పలేను’ అంటూ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు విస్తృత చర్చకు ఆస్కారం ఇచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వంలో మార్పులకు సంకేతం ఇస్తున్నాయి. ఆయన త్వరలో సీఎం పదవి నుంచి తప్పుకుంటారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బీహార్లో జేడీయూ, బీజేపీల కూటమి అధికారంలో ఉంది.జాతీయస్థాయిలో ఎన్డీయే భాగస్వాములు గా ఉన్న ఈ రెండు పార్టీల మధ్య కొంతకాలంగా విభేదాలు నెలకొన్నాయి. ఇటీవలి కొన్ని పరిణామాలతో ఇవి మరింత ముదిరి నితీష్ పదవికి ఎసరు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన జాతీయ రాజకీయాల వైపు చూస్తున్నట్లు చర్చ జరుగుతోంది.

మిత్రపక్షాల మధ్య పెరిగిన దూరం

2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే భాగస్వాములైన బీజేపీ, జేడీయూ కలిసి పోటీచేశాయి. బీజేపీ 74, జేడీయూ 43 సీట్లు, ఆర్జేడీ 75 సీట్లు గెలుచుకున్నాయి. బీజేపీ,జేడీయూ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం జేడీయూ నేత నితీష్ కుమార్ రెండోసారి సీఎం పదవి చేపట్టారు. తర్వాత కాలంలో నితీష్ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంతో పలు అంశాల్లో విభేదిస్తూ వచ్చారు. ముఖ్యంగా కులగణన చేపట్టాలని నితీష్ గట్టిగా డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలను కూడగట్టి ప్రధాని మోడీని కూడా కలిసి వినతిపత్రం సమర్పించినా కేంద్రం స్పందించలేదు. అలాగే కేంద్ర కేబినెట్లో జేడీయూ మంత్రుల సంఖ్య విషయంలోనూ మనస్పర్ధలు తలెత్తాయి. వాటి ప్రభావంతో రాష్ట్రంలోనూ రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది. ఇదే సమయంలో ఆమధ్య జరిగిన ఉప ఎన్నికల్లో రెండు సీట్లు గెలుచుకుని జేడీయూ అసెంబ్లీలో తన బలాన్ని 45కు పెంచుకోగా.. ఈ నెల 23న వికాస్ శీల్ ఇన్సాఫ్ పార్టీ (వీఐపీ)కి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో 77 మంది ఎమ్మెల్యేలతో ఆ పార్టీ అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దాంతో బీజేపీ స్వరం పెంచింది. అదే రెండు పార్టీల మధ్య ఇప్పటికే ఉన్న విభేదాలను,గ్యాప్ ను మరింత పెంచింది.

సీఎం పదవిలో వాటాకు డిమాండ్

అసెంబ్లీలో జేడీయూ సంఖ్యాబలం తమకంటే తక్కువగా ఉన్నప్పటికీ ముందస్తు ఒప్పందానికి కట్టుబడిన బీజేపీ నితీష్ కు సీఎం పదవి అప్పగించింది. అయితే మారిన పరిస్థితుల్లో తమకూ ఆ పదవి కావాలని డిమాండ్ చేస్తోంది. రెండు పార్టీలు సీఎం పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలని బీజేపీ ఎంపీ చేదీ పాశ్వాన్ ఇటీవల డిమాండ్ చేశారు. అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే వినయ్ బిహారీ కూడా అదే డిమాండుతో గళమెత్తారు.

ఈ పరిణామాలతో ఇప్పటికిప్పుడు కాకపోయినా.. ముందు ముందు సీఎం పదవి వదులుకోవాల్సి వస్తుందని నితీష్ భావిస్తున్నారు. 16 ఏళ్లు సీఎంగా చేసిన ఆయన పదవిపోతే కేవలం ఎమ్మెల్యేగా రాష్ట్రంలో ఉండలేరు.అందుకనే రాజ్యసభ వైపు మనసు మళ్లినట్లు విలేకరుల వద్ద వ్యాఖ్యానించారు. తద్వారా కేంద్ర స్థాయిలో ఏదైనా పదవి ఇస్తే సీఎం పదవి నుంచి తప్పుకోవడానికి తాను సిద్ధమేనన్న సంకేతాలను బీజేపీ జాతీయ నాయకత్వానికి పంపారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.