iDreamPost
android-app
ios-app

పంచాయతీల హక్కులు హరించింది ఎవరు బాబూ?

  • Published Feb 28, 2022 | 4:38 PM Updated Updated Feb 28, 2022 | 4:38 PM
పంచాయతీల హక్కులు హరించింది ఎవరు బాబూ?

ఏ విషయాన్ని అయినా తనకు అవసరం ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా స్పందించడం చంద్రబాబు నైజం. అధికారంలో ఉన్నప్పుడు హక్కులు, అధికారాలు తనకు తప్ప ఇంకెవరికీ ఉండటానికి వీల్లేదన్నట్లు వ్యవహరించిన ఆయన.. వాటి కోసం గొంతెత్తి అడిగిన వారిని నిర్దాక్షిణ్యంగా అణచివేశారు. కానీ అధికారం పోయి ప్రతిపక్షంలోకి వచ్చాక ఆ అధికారాలు, హక్కులు గుర్తుకొస్తున్నాయి. వాటి కోసం పోరాడమని అన్ని వర్గాలను రెచ్చగొడుతున్నారు. తాజాగా టీడీపీకి చెందిన సర్పంచులతో తన అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు అదే పని చేశారు. గతంలో సర్పంచులకు తాను చేసిన అన్యాయాలను విస్మరించి ప్రస్తుత ప్రభుత్వం పోరాడమని ఎగదోశారు.

బాబు హయాంలో పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం

గత చంద్రబాబు జమానాలో పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఎన్నికైన సర్పంచులు, పంచాయతీ పాలకవర్గాలను కాదని జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేశారు. పెత్త నమంతా వాటికి కట్టబెట్టి సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు. పంచాయతీల నిధులను వాటి ప్రమేయం లేకుండానే ఇతర కార్యక్రమాలకు మళ్లించేశారు. 2018 జూలైలో పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగిసినా ఎన్నికలు నిర్వహించకుండా పర్సన్ ఇంఛార్జీలను నియమించి పంచాయతీ పాలనను భ్రష్టు పట్టించిన ఘనత చంద్రబాబుదే. తక్షణమే ఎన్నికలు జరపాలన్న హైకోర్టు ఆదేశాలను సైతం తుంగలో తొక్కారు.

గాడిలో పెట్టినందుకు పోరాడాలా..

ఇంత నిర్వాకం చేసిన చంద్రబాబు ఇప్పుడు పంచాయతీలు, సర్పంచుల హక్కులు, అధికారాలు.. అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఇప్పుడేదో వారికి అన్యాయం జరిగిపోతున్నట్లు కలరింగ్ ఇస్తూ.. పోరాడాలని పిలుపు ఇచ్చారు. రాష్ట్రంలో జగన్ ఎలాంటి అధికారాలు ఉన్నాయో.. పంచాయతీ ప్రభుత్వంలో సర్పంచులకు అలాంటి అధికారాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వానికి భయపడకుండా పోరాడాలన్నారు. ఇన్ని సుద్దులు చెబుతున్న చంద్రబాబు తాను అధికారంలో ఉన్నప్పుడు అవన్నీ గుర్తులేవా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.