iDreamPost
iDreamPost
ఏపీలో అధికార పార్టీ సంస్థాగత వ్యవహారాలు చక్కదిద్దేందుకు అధినేత దృష్టి పెట్టారు. మళ్లీ పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేసేలా అనుబంధం సంఘాలకు పునరుత్తేజం కల్పించే దిశలో అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా పార్టీ అనుబంధ సంఘాలకు ఇన్ఛార్జ్ బాధ్యతలను విజయసాయిరెడ్డికి అప్పగించారు. ఇప్పటికే విజయసాయిరెడ్డి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగుతున్నారు. తాజాగా కీలక బాధ్యతలు ఆయనకు అప్పగించడం ఆసక్తిగా మారింది.
ఎన్నికలకు ముందు విజయసాయిరెడ్డి స్వయంగా అనుబంధ సంఘాల ఇన్ఛార్జ్ గా ఉండేవారు. అనేక విధాలుగా పార్టీ విభాగాలను గాడిలో పెట్టి, నడిపించడంలో ఆయన పూర్తి శ్రద్ధ చూపించారు దానికి తగ్గట్టుగా ఫలితాలు కూడా వచ్చాయి. దాంతో మరోసారి ఆయనకే ఈ విభాగాల ఇన్ఛార్జ్ బాధ్యత అప్పగించినట్టు కనిపిస్తోంది. విజయసాయిరెడ్డి ప్రస్తుతం రాజ్యసభ సభ్యత్వ పదవీకాలం ఈ జూన్ తో ముగుస్తోంది. ఆయనకు మరోసారి రెన్యువల్ ఉంటుందనే అభిప్రాయం వినిపిస్తోంది. జాతీయ స్థాయిలో వివిధ పార్టీల నాయకులతో సాయిరెడ్డికి ఉన్న సంబంధాల రీత్యా ఆయన్ని రాజ్యసభ సభ్యుడిగా కొనసాగంచే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో అనుబంధ విభాగాల బాధ్యత ఆయనకు అప్పగించడం కీలక పరిణామంగా భావించాలి.
పార్టీ ఉత్తరాంధ్ర వ్యవహారాలకు ఆయన సమన్వయకర్తగా ఉన్నారు. మూడు జిల్లాల పరిధిలో పార్టీ అభివృద్ధికి ఆయన ప్రయత్నిస్తున్నారు. అందుకు తోడుగా రాష్ట్ర స్థాయిలో అన్ని విభాగాలకు ఆయన్నే ఇన్ఛార్జ్ గా నియమించిన తరుణంలో రాష్ట్ర కార్యాలయం నుంచి కూడా ఆయన పలు కార్యక్రమాలు చక్కదిద్దాల్సి ఉంటుంది. దాంతో ఇటు ఢిల్లీ, ఇటు అమరావతి, మధ్యలో విశాఖ వ్యవహరాలు విజయసాయిరెడ్డి నిర్వహించాల్సిన అవసరం ఏర్పడుతోంది