iDreamPost
iDreamPost
ఏపీలో నీటిపారుదల ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. దానికి తగ్గట్టుగా డెడ్ లైన్ విధించారు. కీలక ప్రాజెక్టుల విషయంలో మరింత వేగంగా పనులు పూర్తికావాలని ఆదేశించారు. నీటిపారుదల శాఖ సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మంత్రి అనిల్ కుమార్ సహా పలువురు అధికారులు హాజరయ్యారు.
పోలవరంలో దిగువ కాఫర్ డ్యాం, ఈసీఆర్‌ఎఫ్ డ్యాంలకు సంబంధించిన పలు అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. ఈసీఆర్‌ఎఫ్ డ్యాంకు సంబంధించి డిజైన్లు కూడా త్వరలో ఖరారవుతాయని సీఎం అన్నారు. ఆర్ ఆండ్ ఆర్ పై దృష్టి పెట్టి ప్రాధాన్యతా క్రమంలో కుటుంబాలను తరలిస్తున్నట్టు అధికారులు సీఎం కి తెలిపారు. ఆగష్టుకల్లా తొలిదశ తరలింపు పూర్తవుతుందన్నారు. మొదటగా ప్రాధాన్యతగా నిర్దేశించుకున్న 20946 కుటుంబాల్లో ఇప్పటికే 7962 మందిని తరలించబోతున్నట్టు వివరించారు. డీబీటీ పద్ధతుల్లో ఆర్ అండ్ ఆర్ కింద ప్యాకేజీలు చెల్లించాలంటూ సీఎం ఆదేశించారు.
నెల్లూరు బ్యారేజీ పనులు పూర్తవుతున్నాయని, మే 15నాటికి ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తామని అధికారులు వెల్లడించారు. సంగం బ్యారేజీ పనులు కూడా దాదాపు పూర్తి కావచ్చాయన్నారు. మే 15కి ప్రారంభించేందుకు సిద్ధమవుతుందని తెలిపారు. ఈ బ్యారేజ్ కి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు నోటిఫై చేయాలని సీఎం ఆదేశించారు, అవుకు టన్నెల్–2లో మిగిలిపోయిన పనులు కేవలం 77.5 మీటర్లు, ఈసీజన్‌లో పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి టన్నెల్–2 పనుల్లో నెలకు 400 మీటర్ల మేర పనులు చేస్తున్నట్టు అధికారులు వివరించారు. పనులు వేగవంతం చేసి 500 మీటర్ల వరకూ టన్నెల్ తవ్వకం పనులు చేస్తామని అధికారులు తెలిపారు. టన్నెల్-1 ద్వారా సెప్టెంబర్ నెలలో నీటి సరఫరా ప్రారంభోత్సవానికి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. 2023 నాటికి టన్నెల్ –2 కూడా అందుబాటులోకి రావాలన్నారు. దాంతో సహా అన్నిరకాల పనులు పూర్తిచేసి.. రెండు టన్నెళ్ల ద్వారా నీళ్లు ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. వెలిగొండ ప్రాజెక్టు కింద ఉదయగిరి, బద్వేలు ప్రాంతాలకు నీటిని అందించడానికి టెండర్లు పిలవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
వంశధార –నాగావళి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. వాటిని అక్టోబరు నాటికి పూర్తయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలంటూ సీఎం ఆదేశించారు. వంశధార నదిపై గొట్టా బ్యారేజి వద్ద నీటిని లిఫ్ట్ చేసి హిరమండలం రిజర్వాయర్‌లోకి పంపింగ్‌కు సంబంధించిన ప్రణాళికలు రూపొందిచాలని ఆదేశించారు. ఉత్తరాంధ్రలోని నాలుగు ప్రాజెక్టుల పనులు కూడా సమీక్షలో సీఎం ప్రస్తావించారు. తోటపల్లి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సహా అన్ని ప్రాజెక్టులపై దృష్టి పెట్టి పనిచేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు.