Idream media
Idream media
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడి ప్రాణాలకు ముప్పు ఉందట. ఈ మేరకు ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య.. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డికి లేఖ రాశారు. టీడీపీ కేంద్ర కార్యాలయానికి సాయుధ బలగాలతో భద్రత కల్పించాలంటూ ఆయన లేఖలో కోరారు. చంద్రబాబుకు సంఘ విద్రోహ శక్తుల నుంచి ముప్పు ఉందని లేఖలో వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి టీడీపీ కార్యాలయాన్ని సందర్శించే నాయకులకు సైతం తీవ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తుల నుంచి తీవ్రమైన ముప్పు ఉందని డీజీపీకి రాసిన లేఖలో వర్ల రామయ్య వివరించారు.
ఇప్పటికే కొందరు దుండగులు పార్టీ కార్యాలయంపై దాడి చేసిన సంగతిని ఆయన గుర్తుచేశారు. అందువల్ల వెంటనే స్పందించి పార్టీ కార్యాలయానికి నిత్యం సాయుధ బలగాలతో రక్షణ కల్పించాలని లేఖలో డీజీపీని వర్ల రామయ్య డిమాండ్ చేశారు వర్ల రామయ్య. ముఖ్యంగా వైసీపీ నేతల నుంచి తమకు ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లనంటూ భీష్మించుకుని కూర్చున్న ప్రతిపక్ష నేత ప్రాణాలకు ముప్పు అంటూ అకస్మాత్తుగా తెరపైకి రావడం హాట్ టాపిక్ గా మారింది.
గత అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవడం, అనంతరం సింపతీ కోసం జనాల్లోకి వెళ్లడం, పురందేశ్వరి కూడా తెరపైకి రావడం, ఆ తర్వాత తండ్రీ కొడుకులూ ఇద్దరూ పాదయాత్ర ప్లాన్ చేస్తున్న తరుణంలో.. అకస్మాత్తుగా వర్ల లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక రాజకీయంగా కుట్ర ఏమైనా ఉందా, నిజంగానే వాళ్లకు ఆ అనుమానాలు కలిగాయా అనేది తేలాల్సి ఉంది. ఎందుకంటే.. మూడేళ్లుగా టీడీపీ రాష్ట్రంలో ఉందంటే ఉంది అన్నట్లుగా ఉంది తప్పా.. ఏ ఎన్నికలోనూ కనీస ప్రభావం చూపలేకపోతోంది.
చంద్రబాబునాయుడి సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా వైసీపీ జెండా ఎగిరింది. ఈ క్రమంలో వచ్చే రెండేళ్లలో పార్టీ నిలదొక్కుకోవడం చాలా కష్టం. ఇప్పటికే గత ఎన్నికల్లో కేవలం 23 సీట్లతో సరిపెట్టుకుని చరిత్రలో తక్కువ సీట్లు పొందినదిగా పేరు పొందింది. అప్పటికి, ఇప్పటికీ పరిస్థితి మరింత దిగజారిందే తప్పా ఏ మాత్రం మార్పు లేదు. రాజకీయ ఎత్తుగడలు టీడీపీకి అనివార్యంగా మారాయి. గత అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు కన్నీళ్లు, శపథం దానిలో భాగంగానే తెరపైకి వచ్చాయన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు తాజాగా చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందంటూ వర్ల రామయ్య లేఖ రాయడంపై కూడా చర్చ జరుగుతోంది. అందులోనూ వైసీపీ నేతల నుంచి తమకు ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తం చేయడం రాజకీయ దురుద్దేశంతోనే అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.