Idream media
Idream media
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కారు. మద్యాన్ని నిషేధించాలని ఆమె నిరంతరం డిమాండ్ చేస్తున్నారు. 2022 జనవరి 15 కల్లా రాష్ట్రంలో మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధించాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు చేపడతామని ఆమె పోయిన ఏడాదే ప్రకటించారు. ఒకవేళ చేయలేకపోతే సొంత ప్రభుత్వం అని కూడా చూడకుండా ప్రభుత్వాన్ని రోడ్డెక్కిస్తామని చాలాసార్లు హెచ్చరించింది. రెండు రోజుల క్రితం సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా భోపాల్ నివాసానికి వెళ్లి ఉమాభారతిని కలిశారు. ఈ సందర్భంగా మద్యపాన నిషేధంపై చర్చ జరిగింది. మద్యానికి వ్యతిరేకంగా సామాజిక ప్రచారం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. అయినప్పటికీ మద్యనిషేధం కోసం ఉద్యమిస్తామని ఉమాభారతి తెలిపారు. తాజాగా ఉమాభారతి తన పర్యటనలో భాగంగా ఓ వైన్ షాపు మీదకి రాయి విసిరారు.
ఈ వీడియో ఆమెనే స్వయంగా ట్విటర్‌లో ట్వీట్ చేయడంతో విపరీతంగా వైరల్ అవుతోంది. ఉమాభారతి రాజధాని భోపాల్‌లో రోడ్డెక్కారు. భోపాల్‌లోని బర్ఖేడ్ పఠానీ, ఆజాద్ నగర్ మరియు బీహెచ్‌ఈఎల్ ప్రాంతాల్లో ఆమె బీభత్సం సృష్టించారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో కూలీలు నివాసం ఉంటున్నారు. అక్కడ అనేక మద్యం దుకాణాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఉమాభారతి మద్యం షాపులోకి ప్రవేశించింది. ఆమె చేతిలో పెద్ద రాయి ఉండగా ఉమాభారతి మద్యం బాటిళ్లను ఆ రాయితో కొట్టారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమెనే స్వయంగా ట్వీట్ కూడా చేశారు. ఈ విషయం మీద ఉమాభారతి స్పందిస్తూ పక్కనే కూలీల నివాసాలు ఉన్నాయి, సమీపంలో దేవాలయాలు ఉన్నాయి, చిన్న పిల్లలకు పాఠశాలలు ఉన్నాయి. అదే సమయంలో, బాలికలు మరియు మహిళలు పైకప్పులపై నిలబడి ఉన్నప్పుడు, తాగిన వ్యక్తులు వారికి ఎదురుగా నిలబడి అసభ్యంగా ప్రవర్తించారని అన్నారు. ఈ షాపుల్లో కూలీల సంపాదన మొత్తం తగలబెడుతున్నారు అని ఉమాభారతి తెలిపారు.
ఈ దుకాణం ప్రభుత్వ విధానానికి విరుద్ధమైనందున ఇక్కడి వాసులు, మహిళలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు. ఈ దుకాణాలను మూసివేయాలని గతంలో చాలాసార్లు అధికారులకు చెప్పానని మాజీ సీఎం ఉమాభారతి అన్నారు. కానీ ప్రతిసారీ భరోసా మాత్రమే లభించిందని ఆమె అన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి నరేంద్ర సలూజా శివరాజ్ ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకున్నారు. ఎంపిలో మద్యం మీద నిషేధాజ్ఞలు ప్రారంభించడానికి మూడు తేదీలు ఇచ్చి మోసపోయిన తరువాత రాష్ట్ర మాజీ సీఎం ఉమాభారతి ఇప్పుడు మద్యం షాపుపై రాళ్లు రువ్వుతోందని ఆయన అన్నారు. ఉమాభారతి రాయి ఎత్తి లిక్కర్ బ్యాన్ చేస్తారా…? ఓ మాజీ సీఎం తన ప్రభుత్వంలో ఇదంతా చేయాల్సి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు..? ఆమె ఎంత నిస్సహాయంగా మారిందో అని అన్నారు. ఒకవైపు శివరాజ్ రాష్ట్రంలో మద్యం షాపులను రెట్టింపు చేస్తూ వెళ్తుంటే మరోవైపు సొంత పార్టీ నేత రంగంలోకి దిగి రాళ్లు రువ్వుతున్నారా…? సరే, వారు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదు, అది నేరం, దానికి అనేక ఇతర ప్రజాస్వామిక పద్ధతులలో నిరసన చేయవచ్చు అని అన్నారు. ఇక ఉమాభారతి వైఖరి కారణంగా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇబ్బంది పడక తప్పని పరిస్థితి. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడన్నదే ప్రశ్న. ఎన్నికల్లో పోటీ చేస్తానని ఉమ ఇప్పటికే ప్రకటించారు. మద్యం నిషేధం సాకుతో ఉమాభారతి మరేదో చేయాలని చూస్తున్నారని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. దీనిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.