BRS ట్రబుల్‌ షూటర్‌.. హరీశ్‌ రావు రాజకీయ ప్రస్థానం! గ్రేట్ జర్నీ!

తెలంగాణ రాజకీయాల్లో హరీశ్‌ రావుది ప్రత్యేక ప్రస్థానం. ఎంత జటిలమైన సమస్యనైనా సరే ఎంతో ఓర్పుగా, నేర్పుగా పరిష్కరించి.. ట్రబుల్‌ షూటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు హరీశ్‌ రావు. ఆయన రాజకీయ, వ్యక్తిగత జీవిత విశేషాలు మీకోసం..

తెలంగాణ రాజకీయాల్లో హరీశ్‌ రావుది ప్రత్యేక ప్రస్థానం. ఎంత జటిలమైన సమస్యనైనా సరే ఎంతో ఓర్పుగా, నేర్పుగా పరిష్కరించి.. ట్రబుల్‌ షూటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు హరీశ్‌ రావు. ఆయన రాజకీయ, వ్యక్తిగత జీవిత విశేషాలు మీకోసం..

తెలంగాణ రాజకీయాల్లో ట్రబుల్‌ షూటర్‌ అనే పేరు వినపడగానే గుర్తుకు వచ్చే వ్యక్తి హరీశ్‌ రావు. ముఖంపై చెరగని చిరునవ్వు.. ప్రతి ఒక్కరిని తన వాళ్లు అనుకునే స్వభావం.. సమస్య అంటే చాలు వెంటనే రంగంలోకి దిగి పరిష్కారం దిశగా అలుపెరుగని కృషి చేస్తారు. ప్రత్యర్థులు సైతం ఇష్టపడే అతి తక్కువ మంది నాయకుల్లో హరీశ్‌ రావు ఒకరు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం ఆయనకు పెట్టని ఆభరణం అని చెప్పవచ్చు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత దూరమైనా వెళ్తారు.. తనను నమ్ముకున్న వారి చేయి వదిలి పెట్టరు.

ఇక నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం పాటు పడుతూ.. ప్రతి ఒక్కరి చేత ప్రేమగా హరీశన్న అని పిలిపిచుకుంటున్నారు. వ్యక్తిగతంగా ఎంతటి మృదు స్వభావో.. రాజకీయ పరంగా చూస్తే.. ప్రత్యర్థుల మీద దూకుడుగా ముందుకు వెళ్తారు. ఎన్నికల్లో వరుసగా విజయాలు సాధిస్తూ.. గెలుపుకి కెరాఫ్‌ అడ్రెస్‌గా, కారు పార్టీ ట్రబుల్‌ షూటర్‌గా పేరు గాంచిన హరీశ్‌ రావు వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం సాగిందిలా..

వ్యక్తిగత జీవితం..

హరీశ్‌ రావు వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఆయన 1972 జూన్ 3న, మెదక్‌ జిల్లా, సిద్దిపేట సమీపంలోని చింతమడక గ్రామంలో నివాసం ఉంటున్న సత్యనారాయణ-లక్ష్మీబాయి దంపతులకు జన్మించారు. హరీష్ రావు తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. చదువు విషయానికి వస్తే హరీశ్‌ రావు ప్రాథమిక విద్యను.. స్థానికంగా ఉన్న వాణినికేతన్ పాఠశాలలో పూర్తి చేశారు. ఆ తరువాత హైదరాబాద్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో డిప్లొమా పూర్తి చేసి.. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్‌ చేశారు. అనంతరం హరీష్‌రావుకు శ్రీనితరావుతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. కుమారుడు ఆర్చిష్మాన్, కుమార్తె వైష్ణవి.

రాజకీయ జీవితం..

కేసీఆర్‌ మేనల్లుడిగా బాల్యం నుంచే రాజకీయాలను ఒంటబట్టించుకున్నారు హరీశ్‌ రావు. చదువుకునే రోజుల నుంచే.. అన్ని విషయాల్లో మేనమామ కేసీఆర్‌కి చేదోడు వాదోడుగా ఉండేవారు. ఇక ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం.. కేసీఆర్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి.. టీఆర్‌ఎస్‌ పార్టీని స్థాపించిన తర్వాత.. హరీశ్‌ రావు కారు పార్టీలో చేరి.. కీలకంగా వ్యవహరించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య పాత్ర పోషించారు హరీశ్‌ రావు. ఉద్యమం ప్రారంభం నుంచి అనగా.. 2001 నుంచి తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో హరీశ్‌ రావు కీలకంగా వ్యహరించారు.

తొలిసారి పోటీ చేసింది అక్కడ నుంచే..

2004లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు హరీశ్‌ రావు. ఆ ఏడాది మేనమామ కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేశారు. దాంతో కేసీఆర్‌ పోటీ చేసిన సిద్దిపేట శాసన సభ స్థానానికి 2004 అక్టోబర్‌లో ఉప ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల్లో బరిలో దిగిన హరీశ్‌ రావు.. 24827 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అనంతరం తెలంగాణ కోసం రాజీనామా చేసి.. 2008 ఉపఎన్నికల్లో ఇదే స్థానం నుంచి రెండోసారి మళ్లీ 58,935 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

ఇక 2009 అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ సిద్దిపేట నుంచి పోటీ చేసిన హరీష్ రావు మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి.. హ్యాట్రిక్ విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో ఆయన తన సమీప అభ్యర్ధిపై 64,677 ఓట్ల తేడాతో గెలిచారు. అలాగే 2010లో జరిగిన ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేసి.. ఆయ‌న త‌న స్థానాన్ని తిరిగి నిల‌బెట్టుకున్నారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో సిద్దిపేట నుంచే మరోసారి బరిలోకి దిగి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత కేసీఆర్ క్యాబినేట్‌లో మినిస్టర్‌గా చేశారు. నూతన రాష్ట్రంలో రాష్ట్ర సాగునీరు, మార్కెటింగ్ అండ్ శాస‌న‌సభ వ్యవ‌హ‌రాల శాఖ మంత్రిగా సేవలందించారు హరీశ్‌ రావు.

తన రికార్డు తానే బద్దలు కొట్టుకున్నారు..

2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో హ‌రీష్ రావు రికార్డు స్థాయిలో 1,20,650 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొంది తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్నారు. అలాగే.. అతి చిన్న వయస్సులో ఒకే నియోజక వర్గం నుంచి వ‌రుస‌గా ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత కూడా సొంతం చేసుకున్నారు. 2018 ఎన్నికల్లో గెలిచిన తర్వాత మరోసారి కేసీఆర్‌ క్యాబినేట్‌లో ఆరోగ్య, ఆర్ధిక శాఖలను చూసుకుంటున్నారు. 2023 ఎన్నికల్లో మరోసారి భారీ మెజార్టీతో విజయం సాధించి.. సరికొత్త రికార్డును నెలకొల్పే దిశగా అడుగులు వేస్తున్నారు హరీశ్‌ రావు.

హరీశ్‌ రావు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ప్రజా నేత. క్షేత్రస్థాయిలో యువత శ్రేణులను సమీకరించి.. ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టించే వ్యూహ రచన చేయగల తెలివితేటలు హరీష్ సొంతం. ఇక కేసీఆర్‌ తీసుకునే ప్రతి నిర్ణయంలో హరీశ్‌ రావు కీలక పాత్రధారిగా ఉండటమే కాక.. మామ అడుగుజాడల్లో నడిచే నమ్మిన బంటుగా పేరుగాంచారు. ఎన్నికలు, ఉప ఎన్నికలు ఏవైనా సరే.. హరీశ్‌ రావు ఎక్కడ కాలు పెడితే అక్కడ గులాబీ పార్టీ గెలుపు ఖాయమని అనేక సందర్భాల్లో నిరూపించారు.

హరీశ్‌ రావు పనితనం గురించి గతంలో కేసీఆర్‌ ఒకసారి మాట్లాడుతూ.. ఆరగుడుల బుల్లెట్.. ట్రబుల్ షూటర్, తనను మించిన నాయకుడు అని ప్రశంసించారంటేనే.. ఆయన గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవచ్చు.  ఇంతలా ప్రజాభిమానాన్ని గెలుచుకున్న హరీశ్‌ రావు.. 2023 ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతో విజయం సాధించి సరికొత్త రికార్డులు నెలకొల్పుతారని బీఆర్‌ఎస్‌ శ్రేణులు నమ్మకంగా చెబుతున్నాయి.

Show comments