iDreamPost
android-app
ios-app

సత్తా చాటిన కాంగ్రెస్ సీనియర్లు.. ఇదీ సక్సెస్ అంటే!

  • Published Dec 03, 2023 | 12:24 PM Updated Updated Dec 03, 2023 | 12:24 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరి కొన్ని గంటల్లో వెలువడనున్నాయి. ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్ లో కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక కాంగ్రెస్ సీనియర్ నేతలంతా లీడ్ లో కొనసాగుతున్నారు. ఆ వివరాలు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరి కొన్ని గంటల్లో వెలువడనున్నాయి. ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్ లో కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక కాంగ్రెస్ సీనియర్ నేతలంతా లీడ్ లో కొనసాగుతున్నారు. ఆ వివరాలు..

  • Published Dec 03, 2023 | 12:24 PMUpdated Dec 03, 2023 | 12:24 PM
సత్తా చాటిన కాంగ్రెస్ సీనియర్లు.. ఇదీ సక్సెస్ అంటే!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కీలక ఘట్టమైన కౌంటింగ్ ప్రక్రియ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభం అయ్యింది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకుపోతుంది. ఈవీఎం ఓట్ల కౌంటింగ్ లో కూడా హస్తం పార్టీనే ముందంజలో ఉంది. ఖమ్మం, నల్గొండలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ దిశగా దూసుకుపోతుంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ స్థానాల్లో అనగా సుమారు 67 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ సెకండ్ ప్లేస్ కే పరిమితం అయ్యింది. కామారెడ్డిలో కేసీఆర్ వెనకంజలో కొనసాగుతున్నారు. ఇక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కామారెడ్డి, కొడంగల్ లో ముందంజలో ఉన్నారు.

ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలంతా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నల్లగొండ నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, మధిరలో భట్టి విక్రమార్క, ములుగు నుంచి సీతక్క, జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేతలు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఫలితాలు చూసుకున్నా.. కాంగ్రెస్ పార్టీనే ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ ఫలితాలపై కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ నేతల సమిష్టి కృషి వల్లే.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందని అంటున్నారు.

ఇది మాత్రం నిజమే అంటున్నారు రాజకీయ పండితులు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవి చూసింది. తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ ను కాంగ్రెస్ పార్టీ వినియోగించుకోలేకపోయింది. గెలిచిన వారిలో కూడా కొందరు కారు పార్టీలో చేరారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ దారుణంగానే ఓడిపోయింది. కేవలం 19 స్థానాలకే పరిమితం అయ్యింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అయితే 12 స్థానాలకు గాను కేవలం రెండు చోట్ల మాత్రమే విజయం సాధించింది.

ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వెనబడుతూనే ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు, ఉప ఎన్నికలు ఇలా ప్రతీ వాటిలో కాంగ్రెస్ వరుస వైఫల్యాలను చవి చూస్తూ వస్తోంది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది.. గాంధీ భవన్ కు కూడా తాళం వేస్తారనే విమర్శలు వచ్చాయి. అయితే ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురైనా.. ఎన్ని విమర్శలు వచ్చినా సరే.. కోమటి రెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, జానారెడ్డి, షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేతలు పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు.

ఎందరు ఉన్నామన్నిది కాకుండా.. ప్రజా సమస్యలపై ఎలా పోరాటం చేయాలి.. పార్టీని బతికించుకోవడానికి ఏం చేయాలి అనే దానే గురించి ఆలోచించారు. పార్టీ బలోపేతానికి అందరూ కలిసి కట్టుగా పని చేశారు. ఆ ఫలితం ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ గెలుపులో సీనియర్ల కృషి గణనీయంగా ఉంది అంటున్నారు కార్యకర్తలు.

వారు పార్టీని బతికించడమే కాక.. భారీ విజయాన్ని సాధించేలా చేశారని కొనియాడుతున్నారు. పార్టీకి సీనియర్ల అవసరం ఎంత ఉందో ఈ ఫలితాలతో స్పష్టమైంది అంటున్నారు. సీనియర్లను గౌరవించుకుని.. వారికి తగిన ప్రధాన్యత ఇస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనే దానికి ఇదే ఊదాహరణ అంటున్నారు. మరి కార్యకర్తల అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.