iDreamPost
android-app
ios-app

కేంద్రంపై పోరు.. టీఆర్ఎస్ ‘ప్లాన్’ ఇదే..!

కేంద్రంపై పోరు.. టీఆర్ఎస్ ‘ప్లాన్’ ఇదే..!

కేంద్రంపై పోరాటానికి తెలంగాణ రాష్ట్ర స‌మితి మ‌రోసారి ప్ర‌ణాళిక సిద్ధం చేసింది. నేటి నుంచి వ‌రుస ఆందోళ‌న‌ల‌కు పిలుపు ఇచ్చింది. ఈ మేర‌కు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కె. తారక రామారావు ఆదివార‌మే కేంద్ర పెద్ద‌లపై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. యాక్ష‌న్ ప్లాన్ ను ప్ర‌క‌టించారు. యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని పదేపదే కోరినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడమే కాకుండా తెలంగాణ ప్రజలను ముఖ్యంగా రైతులను అవమానించేలా మాట్లాడిందని మండిపడ్డారు.కేంద్రం వైఖరిని ప్రజల ముందు ఎండగట్టేందుకు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ఇప్పటికే 12,769 గ్రామ పంచాయతీలతోపాటు అన్ని మండల, జిల్లా పరిషత్‌లు, మున్సిపాలిటీలు, డీసీసీబీ, డీసీఎంఎస్‌లు, పీఏసీఎస్‌లు తదితర సంస్థలన్నీ ధాన్యం కొనుగోలు చేయాలని తీర్మానించి ప్రధానికి పంపాయి. కేంద్రం స్పందించనందున గల్లీ నుంచి ఢిల్లీ దాకా నిరసన తెలపాలని నిర్ణయించాం’అని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

ఇదీ ఉద్యమ కార్యాచరణ…

– ఈ నెల 4న అన్ని మండల కేంద్రాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ఇన్‌చార్జీల ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపడతారు. ఈ శిబిరంలో రైతులు కూడా పాల్గొనాల్సిందిగా కేటీఆర్‌ పిలుపునిచ్చారు.
– 5న విరామం
– 6న రాష్ట్రం మీదుగా వెళ్లే 4 జాతీయ రహదారులపై నాగపూర్, ముంబై, బెంగళూరు, విజయవాడ మార్గాల్లో రాస్తారోకోలు చేపడతారు.
– 7న హైదరాబాద్‌ మినహా 32 జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నిరసన దీక్షలు జరుగుతాయి.
– 8న రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో నిరసన ర్యాలీలు నిర్వహించడంతోపాటు పార్టీ కార్యకర్తలు, రైతులు ఇళ్లపై నల్ల జెండాలు ఎగరేసి కేంద్రం దమననీతి, భ్రష్టు రాజకీయాలపై నిరసన తెలపాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.
– 9, 10 తేదీల్లో విరామం
– 11న ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ నిరసనకు దిగనుంది. మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, జీహెచ్‌ఎంసీ మినహా 141 మున్సిపాలిటీల చైర్మన్లు, మేయర్లు, డీసీసీబీ, డీసీఎంఎస్, రైతుబంధు సమితి అధ్యక్షులు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గం నిరసన కార్యక్రమంలో పాల్గొంటారు.