Idream media
Idream media
యాసంగి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలవడానికి ఢిల్లీ వచ్చిన తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఆయన అపాయింట్‌మెంట్ కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. అనేక ప్రయత్నాల తర్వాత చివరికి గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్ర మంత్రి అపాయింట్‌మెంట్ ఖరారు చేశారు. దీంతో రాష్ట్ర మంత్రులు, ఎంపీల బృందం పార్లమెంటు భవనంలో పియూష్ గోయల్‌తో భేటీ కానుంది. రాష్ట్ర మంత్రులు నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్ మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న సంగతి తెలిసిందే.
కాగా, వారు ఢిల్లీకి రాకముందు నుంచే కేంద్ర మంత్రి అపాయింట్‌మెంట్ కోసం టీఆర్‌ఎస్ ఎంపీలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. బుధవారం పార్లమెంటు ఆవరణలో ఎంపీలు కె.కేశవరావు, నామా నాగేశ్వరరావు.. పియూష్ గోయల్‌ను కలిసి అపాయింట్‌మెంట్ ఖరారు చేయాల్సిందిగా కోరారు. అయితే బుధవారం తనకు ముందే ఖరారైన కొన్ని సమావేశాలు ఉన్నాయని, గురువారం కలిసే ప్రయత్నం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం బుధవారం సాయంత్రం కేంద్ర మంత్రి కార్యాలయం నుంచి సమయం ఖరారు చేస్తూ ఎంపీలకు సమాచారం వచ్చింది. ఇదిలా ఉండగా.. ఎంపీలు కేకే, నామా నాగేశ్వరరావు తనను కలిసిన సమయంలో ‘‘ధాన్యం కొనుగోలు విషయంపై రాష్ట్ర మంత్రులు మళ్లీ ఢిల్లీ వచ్చారా?!’’ అని పియూష్ గోయల్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. గత ఏడాది డిసెంబరులోనూ ఇదే అంశంపై రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీకి వచ్చిన విషయం తెలిసిందే.
ఒక రాష్ట్రంలో ధాన్యం సేకరణ అనేది కేవలం పంట ఉత్పత్తిపై మాత్రమే ఆధారపడి ఉండదని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పియూష్ గోయల్, సహాయ మంత్రి సాధ్వి నిరంజనా జ్యోతి అన్నారు. మార్కెట్ చేయదగ్గ అదనపు నిల్వలు, కనీస మద్దతుధర, అమలవుతున్న మార్కెట్ రేటు, డిమాండ్- సప్లై పరిస్థితులు, ప్రైవేట్ ట్రేడర్ల భాగస్వామ్యం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. బుధవారం లోక్‌సభలో సభ్యులు రాజీవ్‌రాయ్, సుమలతా అంబరీశ్ అడిగిన ప్రశ్నలకు వారు సమాధానమిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు, ఎఫ్‌సీఐ కలిసి నిర్దిష్ట కాలపరిమితి లోపు కనీస మద్దతుధర కోసం నిర్ణయించిన నాణ్యతా ప్రమాణాల ప్రకారం వరిధాన్యం, గోధుమలను కొనుగోలు చేస్తుందని చెప్పారు. జాతీయ ఆహార భద్రత చట్టం, ఇతర సంక్షేమ పథకాల కింద వాటి పంపిణీ జరుగుతుందన్నారు. కాగా తెలంగాణలో ధాన్యం ఎగుమతి సామర్థ్యం అత్యధికంగా ఉందని పియూష్ గోయల్ అన్నారు. జాతీయ మీడియా సెంటర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఎగుమతిదారులు భారీ ఎత్తున ఎగుమతి చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. గత ఏడాది కూడా తెలంగాణ నుంచి చెప్పుకోదగిన విధంగా బియ్యం ఎగుమతి అయ్యాయని తెలిపారు.