iDreamPost
android-app
ios-app

ఢిల్లీలో టీఆర్ఎస్ నేత మిస్సింగ్.. అసలేమైంది?

ఢిల్లీలో టీఆర్ఎస్ నేత మిస్సింగ్.. అసలేమైంది?

దేశ రాజధానిలో మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ ఉద్యమకారుడు మున్నూరు రవి కనిపించకుండా పోవడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించి, విద్యార్థి నాయకుడిగా అనేక విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహించిన మున్నూరు రవి మహబూబ్ నగర్ కు చెందిన టీఆర్ఎస్ నేత. కేసీఆర్ కు ఆయన సన్నిహితుడు అని పేరుంది. రవి రాజకీయాలతో పాటు ఇంటీరియర్ డిజైనింగ్ బిజినెస్ చేస్తున్నారు. అయితే రవి వ్యక్తిగత పనుల నిమిత్తం ఢిల్లీ వెళ్లారు.

న్యూఢిల్లీ విఐపి ఏరియాలోని సౌత్ ఎవెన్యూ ప్లాట్ నంబర్ 105 మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఢిల్లీ నివాసంలోకి వెళుతున్న సమయంలో కిడ్నాప్ జరిగిందని అనుమానిస్తున్నారు. ఫిబ్రవరి 26న మున్నూరు రవి సహా ఆయన స్నేహితులయిన మరో ఇద్దరిని గుర్తుతెలియని వ్యక్తులు బలవంతంగా తీసుకువెళ్తున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో తమవాళ్లను ఎవరో కిడ్నాప్ చేశారు అంటూ బాధితకుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఫిబ్రవరి 26న ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. ఎంతోమంది వీఐపీలు ఈ ప్రాంతంలో రాకపోకలు కొనసాగిస్తుంటారని, రాష్ట్రపతి రాకపోకలు కూడా ఇదే ప్రాంతంలో కొనసాగుతుంటాయని తెలుస్తోంది.

మరి అత్యంత కట్టుదిట్టంగా ఉండే ఆ ప్రాంతంలో మున్నూరు రవిని,సహాయ స్నేహితులను ఎవరు బలవంతంగా తీసుకువెళ్లారు ? ఎక్కడికి తీసుకువెళ్లారు ? అనే విషయం ఇప్పటికీ అంతుపట్టడం లేదు. రవికి గాని ఆయన స్నేహితులకు గాని ఎవరితోనూ ఎలాంటి శత్రుత్వాలు లేవు అని, ఆర్థిక వ్యవహారాలలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేవని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరి వారిని బలవంతంగా తీసుకువెళ్ళింది ఎవరు? అనే విషయం మీద ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతోంది. ఢిల్లీ సౌత్ ఎవెన్యు, చాణక్యపురి పోలీస్ స్టేషన్లో వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.