iDreamPost
android-app
ios-app

తెలంగాణలోనూ బీజేపీ ‘డబుల్‌ ఇంజిన్‌’ నినాదం

తెలంగాణలోనూ బీజేపీ ‘డబుల్‌ ఇంజిన్‌’ నినాదం

ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో బీజేపీ డబుల్‌ ఇంజిన్‌ ప్రచారాన్ని అందుకుంది. అది విజయంలో కీలక పాత్ర పోషించింది కూడా. ఇప్పుడు అదే నినాదాన్ని బీజేపీ మరిన్ని రాష్ట్రాల్లో ఎత్తుకునేందుకు ప్రయత్నిస్తోంది. టీఆర్‌ఎస్‌తో ఢీ అంటే ఢీ అంటున్న కమలం పార్టీ వ్యూహాత్మక పోరాటాలకు సిద్ధమవుతోంది. ఒకవైపు క్షేత్రస్థాయి పోరాటాలకు పదును పెడుతూ, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై విద్యావంతులు, ఉద్యోగవర్గాల్లో మరింత అవగాహన కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ‘డబుల్‌ ఇంజిన్‌’ ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరాన్ని వివరించే ప్రయత్నం చేయనుంది.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఖరి కారణంగా రాష్ట్ర ప్రయోజనాలు ఎలా దెబ్బతింటున్నాయో పేర్కొంటూ, మేధావి వర్గానికి చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ‘డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌’ నినాదాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు ఉమ్మడి జిల్లాస్థాయి సదస్సులకు సిద్ధమవుతోంది. టీఆర్‌ఎస్‌ నాయకత్వం ఢిల్లీకి వెళితే, తాము జిల్లాలు, మండలాలకు వెళుతున్నామని బీజేపీ నాయకులు వెల్లడించారు.గడిచిన ఏడేళ్లుగా రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఎలా సహకరిస్తూ వస్తోంది? రాష్ట్ర ప్రభుత్వ సహాయనిరాకరణ కారణంగా ఎలా నష్టపోతోంది ? అన్న కోణంలో మేధావి వర్గానికి మరింత వివరించేందుకు కసరత్తు చేపట్టింది.

ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాల్లో సదస్సులు నిర్వహించబోతోంది. డాక్టర్లు, ఇంజినీర్లు, న్యాయవాదులతో పాటు వివిధ రంగాల్లో మేధావులతో సదస్సులు ఏర్పాటు చేయబోతోంది. కేంద్రం ఏమిచ్చింది? టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏమిచ్చింది? రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంటే అభివృద్ధి ఎలా జరుగుతుంది? అన్న అంశాలను వివరించనుంది. కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల జరుగుతున్న నష్టంపై తాము ఇప్పటికే ఎండగడుతున్నా, క్షేత్రస్థాయిలో దీనిపై ఇంకా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని గుర్తించామని బీజేపీ ముఖ్యనేత ఒకరు వెల్లడించారు.

అందుకే ఉమ్మడి జిల్లాస్థాయిలో సదస్సులు నిర్వహించాలని పార్టీ భావిస్తోందని పేర్కొన్నారు. పలు కీలక ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీస సహకారం కూడా అందడం లేదని ఇప్పటికే కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లు పలుమార్లు విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టుల పూర్తికి వ్యక్తిగతంగా చొరవ చూపాలంటూ టీఆర్‌ఎస్‌ ప్రతినిధులు పదేపదే చేసే వ్యాఖ్యలకు కూడా సమాధానం ఇవ్వనున్నారు. ఇప్పటికే మంజూరు చేసిన ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు, భూముల సంగతి చూడాలని చెప్పనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాస్థాయిలో సదస్సులు నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమవుతోంది.