iDreamPost
iDreamPost
తన ప్రభుత్వ హయాంలో ఊరూ-వాడా మద్యం అమ్మకాలను ప్రోత్సహించిన టీడీపీ ఇప్పుడు మద్యానికి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేయడానికి వెబ్ సైట్ ప్రారంభించడం చిత్రంగా ఉంది. ‘జె-బ్రాండ్ పోవాలి.. జగన్‌రెడ్డి దిగిపోవాలని’ అనే నినాదంతో టీడీపీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మద్యం పేరుతో దోపిడీ, మరణాల వివరాల నమోదు చేస్తామంటూ శనివారం వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.
బెల్ట్ షాపుల సంస్కృతి బాబు పుణ్యమే కదా..
మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కినట్టు.. రాష్ట్రంలో మద్యం ఏరులై పారడానికి కారణమైన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కల్తీ సారా అంటూ, వింత వింత ఆందోళనలు చేస్తూ, మద్యపానంపై యుద్ధం చేస్తున్నట్టు గత కొన్ని రోజులుగా బిల్డప్ ఇస్తోంది. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచింది చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వమే. మద్యం అమ్మకాలను పెంచడానికి బెల్ట్ షాపుల సంస్కృతిని తీసుకొచ్చింది బాబుగారి జమానాలోనే. రాష్ట్రవ్యాప్తంగా 43 వేల బెల్ట్ షాపులను తెరిపించి తెలుగు తమ్ముళ్ళకు ఉపాధి కేంద్రాలుగా మార్చేశారు అనే అప్రఖ్యాతిని మూటగట్టుకున్నారు.
అప్పుడు మంగళ సూత్రాలు గుర్తుకు రాలేదా?
మద్యం షాపులకు సమీపంలో గుడి, బడి వంటివి ఉన్నాయనే విచక్షణ కూడా పాటించకుండా టీడీపీ హయాంలో విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చేశారు.పర్మిట్ రూములు అంటూ కొత్తపేరు పెట్టి మరీ మినీబార్లకు తెరతీశారు. చీప్ లిక్కరు తాగి మా భర్తలు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. మా మంగళసూత్రాలు తెగిపోతున్నాయని మహిళలు మొర పెట్టుకుంటే పట్టించుకోలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం బెల్ట్ షాపులను, పర్మిట్ రూములను రద్దు చేసింది. మద్యపానాన్ని దశలవారీగా నిషేధించడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. వాస్తవం ఇదైతే రాష్ట్రంలో మంగళసూత్రాలు తెగిపోతున్నాయని టీడీపీ నేతలు ఆందోళన చేయడం విచిత్రం.
అసెంబ్లీలో ఎందుకు చర్చించలేదు?
కల్తీ సారా అంటూ పదిహేను రోజులుగా రాష్ట్ర ప్రజలదృష్టిని ఆకర్షించడానికి నానా హంగామా చేస్తున్న టీడీపీ… మద్యం పాలసీపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ఎందుకు పాల్గొనలేదు? అని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సభలో తెలుగుదేశం పార్టీ పాలనలో ప్రవేశ పెట్టిన 254 మద్యం బ్రాండ్ల గురించి సమగ్రంగా వివరించారు.అవే బ్రాండ్లు ఇప్పటికీ కొనసాగుతున్నాయని, తమ ప్రభుత్వం ఒక్క కొత్త బ్రాండ్ కు కూడా అనుమతి ఇవ్వలేదు అని చెప్పారు. అయినా జె బ్రాండ్ లు అంటూ టీడీపీ నేతలు తమ దుష్ప్రచారం ఆపకపోవడం దిగజారుడు రాజకీయం కాదా అని అధికారపార్టీ నేతలు అంటున్నారు.
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..
బీరు హెల్త్ డ్రింక్ అంటూ అప్పటి మంత్రి జవహార్ మద్యం అమ్మకాలకు ఒక బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. ఇప్పుడు మద్యానికి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేయడానికి వెబ్ సైట్ ప్రారంభించి టీడీపీ హంగామా చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని వైఎస్సార్ సీపీ నేతలు అంటున్నారు. తమ ప్రభుత్వ చిత్తశుద్ధి గురించి తెలిసిన ప్రజలు టీడీపీ చేసే దుష్ప్రచారాన్ని పట్టించుకోరని చెబుతున్నారు.