iDreamPost
iDreamPost
కాపులకు రిజర్వేషన్లు నిలిపివేసినట్లు..పవన్ సినిమాను నిలిపేస్తారా? అని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ చేసిన వ్యాఖ్యలను అధికార పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. ఆదివారం అనగాని మీడియాతో మాట్లాడుతూ ఏ సినిమాకు లేని ఆంక్షలు.. పవన్ సినిమాకే ఎందుకు? సీఎం జగన్‌కు కాపులంటే ఎందుకంత కక్ష? అని అన్నారు.
2014 ఎన్నికలకు ముందు కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని హామీ ఇచ్చింది తమ పార్టీ అధినేత చంద్రబాబు అన్న సంగతి అనగానికి తెలియదా? ఆ హామీని అమలు చేయండి అని కోరిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను, ఆయన కుటుంబాన్ని అరెస్టు చేయించి అవమానాల పాలు చేసింది
మరచిపోయారా? అని వైఎస్సార్ సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు కాపులకు రిజర్వేషన్ అంశం తన పరిధిలోనిది కాదు కనుక హామీ ఇవ్వలేనని వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహనరెడ్డి స్పష్టంగా చెప్పారు. కాపుల అభ్యున్నతికి కార్పొరేషన్ ద్వారా అవసరమైన నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అన్నమాట ప్రకారం నిధులు మంజూరు చేస్తున్నారు. వాస్తవం ఇది కాగా సీఎం జగన్మోహనరెడ్డి కాపులకు రిజర్వేషన్లు నిలిపివేసినట్టు ఎమ్మెల్యే అనగాని వ్యాఖ్యానించడం తప్పుదోవ పట్టించడం కాదా అని ప్రశ్నిస్తున్నారు.
ఎవరు పెద్ద పీట వేశారు?
కాపులకు చంద్రబాబు పెద్దపీట వేస్తే.. జగన్‌మోహన్ రెడ్డి కత్తిపీట వేశారని అనడం మరీ ఘోరం. రిజర్వేషన్ల పేరిట
కాపులను మోసగించడమే కాక ఉద్యమంలో పాల్గొన్నవారిపై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెట్టి చంద్రబాబు వేధించటం కాపులకు పెద్దపీట వేయడమా? ఇచ్చిన హామీ మేరకు ఆ కేసులను మొత్తం ఎత్తివేసి తన చిత్తశుద్ధి చాటుకున్న జగన్ ను నిందించడం సమంజసమా? టీడీపీ ప్రయోజనాలకు అనుగుణంగా వాస్తవాలను వక్రీకరించాలని అనగాని ప్రయత్నం చేయడం శోచనీయం. ఈయన ఎన్ని కబుర్లు చెప్పినా చంద్రబాబు కాపులకు చేసిన ద్రోహం ఏమిటో అందరికీ తెలుసునని వైఎస్సార్ సీపీ నేతలు అంటున్నారు.
ఇదేం దుష్ప్రచారం..
పవన్ కల్యాణ్ సినిమాను ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కలర్ ఇవ్వడానికి పచ్చ బ్యాచ్ ట్రై చేస్తోంది. అందులో భాగంగానే ఎమ్మెల్యే అనగాని వ్యాఖ్యలు చేస్తున్నారు కాని ఆయనకు కాపులపై ప్రేమ లేదని అధికార పార్టీ నేతలు అంటున్నారు. నిబంధనల ప్రకారం సినిమా ప్రదర్శనలు సాగాలని, బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటే అది కాపులపై కక్ష సాధించడం అవుతుందా? ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలనుకునే టీడీపీ ఒక సినిమా ఆధారంగా అనవసర రాద్దాంతం చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు జిత్తులమారి రాజకీయం అర్థం చేసుకోలేని స్థితిలో ప్రజలు ముఖ్యంగా కాపులు లేరన్న సంగతి ఎమ్మెల్యే అనగాని గ్రహించాలని వైఎస్సార్ సీపీ నేతలు సూచిస్తున్నారు.