iDreamPost
android-app
ios-app

రోశయ్య మీద టీడీపీకి ఇంత ప్రేమ ఉందా ?

  • Published Mar 09, 2022 | 7:30 AM Updated Updated Mar 09, 2022 | 10:17 AM
రోశయ్య మీద టీడీపీకి ఇంత ప్రేమ ఉందా ?

గడిచిన నాలుగుదశాబ్దాల్లో అధిక సమయం ఆపార్టీనే అధికారంలో ఉంది. అందులోనూ తాను దేశంలోనే అందరికన్నా అనుభవజ్ఞుడినని చెప్పుకోవడం చంద్రబాబుకి పరిపాటి. అయినా ఆయనకు తెలిసే ఉంటుందిగా. శాసభసభ నిబంధనావళి ప్రకారం సంతాపతీర్మానంలో ప్రాధాన్యతలు ఆయనకు తెలిసే ఉండాలిగా. అయినా తెలిసి కూడా ఎందుకు వివాదం అనుకుంటున్నారా. అదే తెలుగుదేశం పార్టీ పతనమవుతున్న తీరుని చాటుతోంది. చివరకు సంతాపతీర్మానం చుట్టూ వివాదం రాజేయాలని చూడడం వారి నైజాన్ని వెల్లడిస్తోంది.

మంత్రిగా ఏపీ పురోభివృద్ధికి కష్టకాలంలోనూ ఎంతో శ్రమించిన నాయకుడు మేకపాటి గౌతమ్ రెడ్డి. ఆరు శాఖల నిర్వహణలోనూ తన సమర్థత చాటుకున్న నేత ఆయన. విశేష పరిచయాలు విషయ పరిజ్ఞానం ఉన్న గౌతమ్ రెడ్డి మృతి రాష్ట్రంలో అందరినీ శోకసముద్రంలో ముంచింది. అలాంటి నాయకుడికి సంతాపతీర్మానం ప్రవేశపెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సభా సంప్రదాయాలను అనుసరించి, సిట్టింగ్ సభ్యుడు, అందులోనూ కీలక శాఖల మంత్రిగా వ్యవహరించిన గౌతమ్ రెడ్డి కోసం ఒకరోజు కేటాయించింది. దానికి అనుగుణంగా బీఏసీలో చర్చించి నిర్ణయం మేరకు అమలుచేశారు. దానిని కూడా టీడీపీ నేతలు రాజకీయయత్నం చేయడం విడ్డూరమే కాకుండా విషాదంగానూ చూడాలి.

మరణించిన నాయకుడికి సంతాపతీర్మానం పెట్టడాన్ని టీడీపీ నేతలు ఎద్దేవా చేయడం వారి తీరుని తేటతెల్లం చేస్తోంది. రాజకీయ అవసరాల కోసం ఎంతకైనా దిగజారే వైనాన్ని వెల్లడిస్తోంది. గౌతమ్ రెడ్డి మృతికి సంతాపం తెలియజేసిన సభ ఇటీవల మరణించిన మరో సీనియర్ నేత కొణిజేటి రోశయ్యకు సంతాపం తెలుపలేదంటూ విడ్డూర వాదన ముందుకు తెచ్చింది. నిజానికి తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఈ అంశాన్ని బీఏసీలో ఆపార్టీ ప్రస్తావించాలి. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే మీడియా ద్వారా జనంలోకి తీసుకెళ్లాలి. కానీ బీఏసీ సమావేశంలో అచ్చెన్నాయుడు ఏమీ మాట్లాడకుండా గౌతమ్ రెడ్డి సంతాప తీర్మానం మీద టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో రాజకీయాలు చేయడం వారి స్థాయిని చాటుతోంది.

సభ నిబంధనావళి ప్రకారం సభ్యుడిగా ఉన్న నాయకుడు ఎవరు మరణించినా సంతాపం తెలియజేయడం సంప్రదాయం. దానిని ఏపీ ప్రభుత్వం అనుసరించింది. గతంలో సభకు ప్రాతినిధ్యం వహించిన మాజీలకు సంబంధించి కూడా సంతాపం తెలియజేసేందుకు ఓ ప్రక్రియ ఉంది. దానిని అనుసరించాలని నిర్ణయించారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే చేసింది. భూమా నాగిరెడ్డితో పాటుగా అంతకుముందు మాజీ సీఎం నేదురుమల్లి జనార్థన్ రెడ్డి విషయంలోనూ ఇదే పద్ధతి పాటించింది. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండడంతో గతం మరచిపోయినట్టుగా జనాలను పక్కదారి పట్టించాలని చూస్తోంది. కుల రాజకీయాల కోసం కొందరిని పక్కదారి పట్టించే లక్ష్యంతో రోశయ్య పేరుని ప్రస్తావిస్తోంది. రోశయ్య విషయంలో ఏపీ అసెంబ్లీ సంతాపం తెలియజేసేందుకు ఇంగితం ఉన్నవారెవరూ అభ్యంతరం పెట్టరు. సంప్రదాయాలను అనుసరించి వాటిని పాటిస్తారు. కానీ టీడీపీ మాత్రం నిబంధనలను తోసిపుచ్చి, తమకు తోచినవిధంగా జనాలను మభ్యపెట్టాలనే యత్నంలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇలాంటి చౌకబారు రాజకీయాలు చంద్రబాబు కి కొత్త కాదు గానీ, మరీ సంతాప తీర్మానాల విషయంలోనూ వివాదం సృష్టించే యత్నమే వికృతంగా కనిపిస్తోంది.

పైగా బుధవారం నాడు సభకు విరామం ప్రకటించడాన్ని కూడా టీడీపీ తప్పుబడుతోంది. పైగా బొత్సా ఇంట్లో వివాహ వేడుక కోసమేనంటూ వక్రభాష్యాలు చెబుతోంది. ఇంతటి విడ్డూరంగా వాదించే పార్టీ మరోటి ఉండదేమోనని చెప్పవచ్చు. స్వయంగా ఆపార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హాజరయిన బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కూడా టీడీపీ తప్పుబట్టడం చూస్తుంటే బాబు రానురాను మరింత దిగజారి వ్యవహరించడానికి వెనుకాడడం లేదని అర్థమవుతోంది. ఇలాంటి ప్రయత్నాలతో టీడీపీకి ఒరిగేదేమీ ఉండదని గ్రహించాల్సి ఉంటుంది.